కరోనా కరాళ నృత్యం | Guest Column About USA Facing Bad Situation About Coronavirus Cases | Sakshi
Sakshi News home page

కరోనా కరాళ నృత్యం

Published Sun, Mar 29 2020 12:49 AM | Last Updated on Sun, Mar 29 2020 12:50 AM

Guest Column About USA Facing Bad Situation About Coronavirus Cases - Sakshi

అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా కరోనా కేసుల విషయంలోనూ అగ్ర స్థానంలో ఉండటం విషాదం. సైనిక, శాస్త్ర, సాంకేతిక సహా అనేక రంగాల్లో ముందంజలో ఉంటూ ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా కోవిద్‌–19 ముందు బోల్తా పడింది. చాలా సందర్భాల్లో విచిత్రమైన తన మాటలతో అందరినీ ఆశ్చర్యచకితులను చేసే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైరస్‌ శక్తిని అంచనావేయలేక క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా వైరస్‌ పుట్టిన చైనాను, నిర్లక్ష్యం కారణంగా వేలాది మరణాలను చవిచూస్తున్న ఇటలీని అమెరికా దాటేయడం సర్వత్రా ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే సుమారు లక్షన్నరమందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కాగా, మరో 80 వేలమందికి కూడా సోకే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషించడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతుంది.

అయితే, ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉండ టం ఉపశమానాన్ని ఇచ్చే అంశం. అనేక ప్రపంచస్థాయి కార్యాలయాలకు, ప్రముఖ కంపెనీల కేంద్ర కార్యాలయాలకు నెలవైన న్యూయార్క్‌ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. న్యూయార్క్‌ లో 46,262 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 600మంది మరణించారు. అటు న్యూజెర్సీ, కాలి ఫోర్నియా, వాషింగ్టన్‌ డీసీ, ఫ్లోరిడా, ఇల్లినాయిస్, మిచిగాన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, లూసియానా, జార్జియాల్లో, కొలరాడో, మసాచుసెట్స్, చికాగో, డెట్రాయిట్‌ తదితర రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

ఇదీ తేడా
ఈ ఏడాది జనవరి 20వ తేదీన మొదటిసారి కరోనా వైరస్‌ కేసు వెలుగులోకి వచ్చింది. చైనాలోని వూహాన్‌ నగరంలోని తన కుటుంబ సభ్యులను కలిసి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్‌ సోకింది. సరిగ్గా అదే రోజు  ఐదు వేల మైళ్ల దూరంలో ఉన్న దక్షిణ కొరియాలో కూడా ఈ వైరస్‌ బయటపడింది. ఈ రెండు నెలల్లో ఈ రెండు దేశాలు దానిపట్ల వ్యవహరించినతీరులో ఎంతో భిన్నత్వం కనబడుతుంది. దక్షిణ కొరియా తక్షణం స్పందించి కరోనా సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచడమేగాక, రాబోయే పెనుముప్పును ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధమయ్యింది. కానీ, అమెరికా మాత్రం వైరస్‌ వ్యవహారాన్ని చాలా నిర్లక్ష్యం చేసింది. అమెరికాలో విస్తరించబోయే మహమ్మారిని అడ్డుకోడానికి తక్షణం యుద్ధప్రాతిపదికన స్పందించాలని వైద్య నిపుణులు మొత్తుకున్నా ఫిబ్రవరి నెలాఖరు వరకూ ట్రంప్‌ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పుడు కూడా దేశంలోని పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులు కోవిద్‌–19 పరీక్షలు నిర్వహించడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. 

చరిత్ర పాఠం
రాజకీయ నాయకత్వం విఫలమైతే ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందనే దానికి అమెరికాయే ప్రత్యక్ష నిదర్శనం. అమెరికా అధ్యక్షుడి బాధ్యతారాహిత్యాన్ని గురించి తరువాతి తరాల వారు చరిత్ర పాఠాలుగా చదువుకుంటారని అక్కడి మేథావులు విమర్శిస్తున్నారు. జనవరి చివరి నాటికే అమెరికా దగ్గర కోవిద్‌–19 గురించిన పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ట్రంప్‌ దాన్ని రాజకీయంగా వాడుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. ‘చైనీస్‌ వైరస్‌’ అని విమర్శించడం, చైనా పర్యటనలపై తాత్కాలిక నిషేధం విధించడంతో కాలం వెళ్లబుచ్చారు. తనను తాను వార్‌ టైమ్‌ ప్రెసిడెంట్‌ గా చెప్పుకునే ట్రంప్‌ కరోనా విషయంలో పప్పులో కాలేశారు. జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ ట్రంప్‌ లో చలనం రాలేదు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు అక్కడి ప్రజలు కూడా చాలా రోజులు కరోనా వస్తే రానీ అని నిర్లక్ష్యం వ్యవహరించారు. పార్టీలు, పండుగలు చేసుకున్నారు. అందుకు ఇప్పుడు వాళ్లు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 

అమల్లోకి రక్షణ చట్టం
చిట్టచివరకు చేతులు కాలుతున్నప్పుడైనా ఆకులు పట్టుకోడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సిద్ధమయ్యారు. అత్యవసరంగా చేపట్టగలిగే అన్ని చర్యల్ని తీసుకుంటూనే సైన్యంలోని ఇంజినీర్లను రంగంలోకి దించి దేశ వ్యాప్తంగా ఆసుపత్రులు నిర్మించాలని ఆదేశించారు. అలాగే, డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌ ను కూడా అమల్లోకి తీసుకు వచ్చారు. వీటన్నిటితోపాటు రెండు లక్షల కోట్ల ప్యాకేజీపై ట్రంప్‌ సంతకం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, వ్యాపార వర్గాలతోపాటు సామాన్యులకు ఊరట కలిగించడానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు.  

వీడని పెద్దన్న పాత్ర
ఇదే సమయంలో తన పెద్దన్న పాత్రను నిలబెట్టుకోడానికి అన్నట్టు కోవిద్‌–19పై పోరాటానికి అమెరికా 64 దేశాలకు సుమారు 17.4లక్షల కోట్ల డాలర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన పది లక్షల కోట్ల డాలర్లకు ఇది అదనం. ఇందులో భాగంగా మన దేశానికి సుమారు 29 లక్షల కోట్ల డాలర్లు అందుతాయి. వ్యాధి నిరోధక, అదుపు కేంద్రాలు(సీడీసీ) ద్వారా ఈ నిధులు అందిస్తారు. 

ఉచిత యోగా
ఇందుకు ప్రత్యామ్నాయమా అన్నట్టుగా భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. దేశ సంస్కృతిలో భాగమైన, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన యోగాను అమెరికా పౌరులకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ నుంచి భారత రాయబార కార్యాలయానికి చెందిన ఫేస్‌బుక్‌ పేజీలో సాయంత్రం ఐదు గంటలకు యోగా తరగతులు ప్రసారమవుతాయి. కరోనా వైరస్‌ విషయంలో అక్కడి ప్రజలు భయాం దోళనకు గురికాకుండా యోగా, మెడిటేషన్‌ ఎంతో దోహదపడతాయని అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

కొసమెరుపు :
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్వాకంతో ఒళ్లుమండిన పలువురు నెటిజన్లు ఆయనపై దాడి చేస్తున్నారు. ఒక సమావేశంలో మాట్లాడుతూ తూలిపడబోయిన ట్రంప్‌ను ఇతరులు పట్టుకుని తీసుకువెళ్లిన వీడియోను షేర్‌ చేస్తూ.. ట్రంప్‌ కూడా కరోనా వైరస్‌ సోకిందనీ అందుకే అలా స్పృహ కోల్పోయారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement