నమస్కార్‌ కరోనా! | Guest Column On Israel Prime Minister Netanyahu Salutes Indian Greeting | Sakshi
Sakshi News home page

నమస్కార్‌ కరోనా!

Published Fri, Mar 6 2020 12:21 AM | Last Updated on Fri, Mar 6 2020 12:21 AM

Guest Column On Israel Prime Minister Netanyahu Salutes Indian Greeting - Sakshi

భారతదేశపు పలకరింపు నమస్కారానికి చేతులెత్తి నమస్కరించారు ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి నెతన్యాహు. ప్రపంచమంతటా కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌ డిసీజ్‌) మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో కరచాలనాల (షేక్‌ హ్యాండ్‌) కన్నా పరస్పర పలకరింపులకు భార తీయుల్లాగా నమస్కారం చెప్పడమే సంస్కార మన్నారు. అది అలవర్చుకొండంటూ ఆయన తమ దేశ వాసులకు పిలుపునిచ్చారు. ఇదొ క్కటే కాదు... చాలా చాలా సంప్రదాయిక విలువలు కొన్ని వేల సంవ త్సరాల పాటు భారతీయుల్ని సురక్షితంగా ఉంచాయి. సంస్కృతి– సంప్రదాయాలు, విలువల జీవనం పరంగా ఎంతో జ్ఞాన సంపదను భారత్‌ ప్రపంచానికి అందించింది. కానీ, కాలక్రమ పరిణామాల వల్ల ఆహారపు అలవాట్లు, పనితీరు, జీవనశైలి మారి ఇప్పుడు మనం ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. కోవిడ్‌–19 వ్యాప్తిస్తున్న సంక్లిష్ట సందర్భంలోనూ అది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

మన ఆహార అల వాట్లు మారడం, పనిచేసే తత్వంలో వచ్చిన అలసత్వం, ఇతరేతరంగా జీవనశైలి గతి తప్పడం మన ఆరోగ్య భద్రతకు, ప్రగతికి, జీవన ప్రమా ణాల మెరుగుకు అవరోధంగా మారింది. ఫలితంగా ఇలాంటి విప త్తులు ముంచుకు వచ్చినపుడు ప్రతికూల ప్రభావానికి గురి కావాల్సి వస్తోంది. ఈ దుస్థితిని తప్పించడానికి యుద్ధప్రాతిపదికన సమైక్య చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. కేంద్ర–రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేస్తూ.. వైద్యారోగ్య విభాగాలు, ప్రయివేటు ఆస్ప త్రులు, కార్పొరేట్లు, ప్రసార మాధ్యమాలు, పౌర సమాజం మధ్య సమన్వయం సాధించి ఉపద్రవాన్ని అధిగమించే కృషి చేయాలి. నిజమే! వదంతుల వ్యాప్తి ప్రజల్లో అలజడిని సృష్టిస్తుంది. కానీ, వాస్త వాల్ని మరుగుపరచి, పైపై మాటలతో కాలం వెల్లబుచ్చడం కూడా అంతే ప్రమాదకరం. వైరస్‌ ప్రభావిత కేసులు ఒక్కసారిగా పెరిగితే, వైద్యపరంగా, పలు విషయాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు లేని మన వ్యవస్థలు ఏ మేరకు తట్టుకొని నిలువ గలుగుతాయన్నది ప్రశ్నార్థకమే! కలకలం చెందకుండానే దేశ ప్రజలు విషయం అర్థం చేసుకునేలా అవగాహన పెంచాలి. అలవాట్లు, పద్ధతులు, వ్యవహార శైలిలో పౌరులు జాగ్రత్త తీసుకునేలా ప్రచారం ముమ్మరం చేయాలి.

వ్యాప్తి నిరోధం మన చేతుల్లోనే...
కోవిడ్‌–19 గురించి దేశం లోపల, బయట చాలా మందికి సరైన అవ గాహన లేదు. కరోనా వైరస్‌ ఆ జాతికి చెందిన పలు వైరస్‌ల కన్నా తక్కువ ప్రమాదకారే! అందుకే, వ్యాధి సోకిన వారిలో మృతుల సంఖ్య 3 శాతం లోపే ఉంది. 50 సంవత్సరాల లోపు వయస్కులకు ఇదే మంత ప్రమాదకారి కాదని రుజువౌతోంది. వయసుతో నిమిత్తం లేకుండా రోగనిరోధక శక్తి లోపించిన వారికి వైరస్‌ హాని కలిగిస్తోంది. సత్వర చికిత్సతో ఫలితాలుంటాయి. కానీ, ఇప్పటికి అది వ్యాప్తి చెందు తున్న తీరే ఆందోళన కలిగిస్తోంది. చైనా నుంచి మొదలై ప్రపంచంలోని మూడో వంతు పైగా దేశాలకు(77) విస్తరించింది. వైరస్‌ లక్షణాన్ని బట్టి... మనుషులు వ్యవహరించే తీరులో జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాప్తిని తేలిగ్గా నిరోధించవచ్చు. ఇప్పుడు చైనా చేసిందదే! ఆరం భంతో పోల్చి చూస్తే, గడచిన మూడు రోజులుగా వ్యాప్తి చాలావరకు అదుపులోకొచ్చింది. కొత్తగా వ్యాధి సోకిన వారి సంఖ్య, ఆరు వారా ల్లోనే అత్యల్పంగా బుధవారం 119గా నమోదైంది.

వ్యాధిగ్రస్తుల నుంచి వెలువడే ద్రవదినుసు (డ్రాప్‌లెట్‌)లో తప్ప బయట దీర్ఘకాలం ఈ వైరస్‌ బతకలేదు. గాలిలో ఒకర్నుంచి మరొకరికి సోకదు. వ్యాధి సోకిన వారు గట్టిగా దగ్గినపుడో, తుమ్మినపుడో, ఉమ్మినపుడో... ద్రవ దినుసులో బయటకు వస్తుంది. మూడు అడుగుల వరకు అలా వ్యాప్తి చెందగలుగుతుంది. అందుకే, ఇతరులతో కనీసం ఒక మీటర్‌ ఎడంతో ఉండమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఏవైనా వస్తువులపై ద్రవదినుసు పడినపుడు కొన్ని గంటల పాటు వైరస్‌ అక్కడ మనగలు గుతుంది. ఈ లోపు ఇతరులెవరికైనా అది సోకే ప్రమాదముంటుంది. తగు జాగ్రత్తల ద్వారా దాన్ని అడ్డుకోవాలి. మాస్క్‌లు ధరించమనడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోమనడం, చీటికి మాటికి చేతులతో కళ్లు, ముక్కు, ముఖం రాసుకోవద్దని చెప్పడం ఇందుకోసమే! ఏ ప్రభుత్వ పథకాలు, విశేష కార్యక్రమాలు కూడా పౌరులే పాటించా ల్సిన ఈ చర్యలకు ప్రత్యామ్నాయాలు కాజాలవు!

రోగనిరోధక శక్తి దివ్యౌషధం
మనిషిలో సహజంగా ఉండే రోగనిరోధక శక్తి ఏ రకమైన వైరస్‌నైనా సమర్థంగా ఎదుర్కొంటుంది. అది జీవుల శరీర నిర్మాణంలోని గొప్ప దనం. కానీ, అసహజమైన మన ఆహారపు అలవాట్లతో ఆ శక్తిని నశిం పజేస్తున్నాం. వైరస్‌లను ఎదుర్కోలేని, వ్యాధుల్ని తట్టుకోలేని బల హీన మనుషులుగా మిగులుతున్నాం. దాదాపు ముఫ్పై ఏళ్ల కింద మొదలైన ప్రపంచీకరణ, తర్వాతి పట్టణీకరణ మన ఆహారపు అల వాట్లను, జీవన శైలిని సమూలంగా మార్చేసింది. అంతకు ముందు, చేలలో పండిన పంట ధాన్యంతో, సీజన్ల వారీగా లభించే కాయ గూరలు, ఫలాలతో సమతుల ఆహారం తీసుకునేది. మంచి పౌష్టికా హారం, శారీరక శ్రమ వల్ల రోగనిరోధక శక్తి ఆ తరం వారిలో పుష్క లంగా ఉండేది. కానీ, ప్రపంచీకరణలో పుట్టుకొచ్చిన మార్కెట్‌ మాయాజాలం మనను ఫక్తు వస్తు వినిమయదారులుగా మలిచింది. జంక్‌ ఫుడ్‌కు బానిసను చేసింది. కోట్ల రూపాయల ప్రచారంతో దూసుకొచ్చే విషరసాయన పానీయాలు, పీచులేని కృతక ఆహారాల ముప్పేట దాడికి సంప్రదాయిక సమతులాహారం వెనుక వరుసలోకి వెళ్లింది. సత్తువలేని దేహాలు మనకు మిగిలాయి. వైరస్‌లు విజృంభి స్తున్నాయి.

‘భారత్, చైనా వంటి తూర్పు దేశాల్లోని సంప్రదాయిక ఆహారం, ఆహార అలవాట్లు వేల సంవత్సరాల పాటు వారిని పటి ష్టమైన రోగనిరోధక శక్తితో నిలిపాయి, పాశ్చాత్తీకరణే గత కొన్ని దశా బ్దాలుగా వారిని దెబ్బతీసింద’ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2012–13 లో జరిపించిన ఓ అధ్యయన నివేదిక చెప్పింది. పారిశ్రామికీకరణ, ఐటీ విప్లవం తర్వాత వ్యక్తుల కొనుగోలు శక్తి పెరగడం, భార్యాభర్తలు ఉద్యోగులు కావడం, ఒకరో, ఇద్దరో పిల్లలు కలిగిన చిన్న కుటుంబా లుగా మిగలడం... అత్యధికుల ఆహారపు అలవాట్లను, జీవన శైలిని సమూలంగా మార్చింది. అది వ్యక్తుల అంతర్గత రోగనిరోధక శక్తికి శాçపమైంది. దానికి తోడు, విలువలు నశించిన పక్కా వ్యాపార వైద్యరంగం ఈ పరిస్థితిని పెంచి పోషించింది. కాలగతిలో వచ్చిన ఒక విపరిణామాన్ని తమ ఇబ్బడిముబ్బడి సంపాదనకు, దోపిడీకి భూమిక చేసుకుంది. మనిషి అవసరాలు చూసి స్పందించే మానవతా విలువలు గాలికిపోయాయి. సగటు మనిషి అవసరాన్నే అవకాశంగా పిండుకుం టోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒక్కసారిగా తలెత్తిన సర్జికల్‌ మాస్క్‌లు, వెంటిలేటర్ల కొరత ఇటువంటిదే! 

ప్రపంచ సంస్థ హెచ్చరించినా..
భారతీయ సనాతన సమాజం వైద్యాన్ని ఎప్పుడూ వ్యాపారంగా చూడ లేదు. ప్రాణం నిలిపే వైద్యుడు జీవం పోసే దేవుడితో సమానమంది. అతి సాధారణ చార్జీలతో వైద్యం చేసే వైద్యులు కూడా కలరా, ప్లేగు వంటి విపత్తులు సంభవించినపుడు పూర్తి ఉచితంగా వైద్యం చేసిన దాఖలాలున్నాయి. అవే విలువలతో వేల ఏళ్లపాటు ఈ భూభాగంపై ఆరోగ్యసమాజం పరిఢవిల్లింది. సర్జికల్‌ మాస్క్‌లతో పాటు సాధారణ మాస్క్‌లు కూడా ఈ రోజు తేలిగ్గా దొరకటం లేదు. మాస్క్‌లైనా, వెంటిలేటర్లయినా, ఈ విపత్కాలంలో అవసరమైన ఏ వైద్య వస్తువు లైనా... ఉత్పత్తి తగ్గించడం, అక్రమ నిల్వల ద్వారా కృత్రిమ కొరత సృష్టించడం నేరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా నుంచి హెచ్చ రించింది.

‘తగిన సర్జికల్‌ మాస్క్‌లు పరికరాలతో మా సిబ్బంది ప్రాణాలు కూడా కాపాడుకోకుంటే మేమీ వ్యాధిని అరికట్టలేమ’ని డబ్లుహెచ్‌వో అధినేత స్పష్టం చేశారు. దేశంలో తగినన్ని వైరాలజీ ల్యాబ్‌లు లేవు. కరోనా వైరస్‌ను గుర్తించే కిట్స్‌ లేవు. కోవిడ్‌–19 వ్యాధిగ్రస్తుల్ని విడిగా ఉంచే ఐసొలేషన్‌ కేంద్రాలు తగిన ప్రమాణా లతో లేవు. ఉన్న అరకొర కేంద్రాల్లో కూడా అప్పటికప్పుడు ఒకటో, రెండో, మరెన్నో పడకల్ని సర్దుబాటు చేసి బయట బోర్డు పెడుతు న్నారు తప్ప వాటికి ప్రత్యేక మూత్రశాలలు కూడా లేవు. మూత్ర విస ర్జన కోసం కోవిడ్‌–19 రోగులు జనరల్‌ వార్డుల్లోని మూత్ర శాలలకు వస్తుంటే, వ్యాధి తమకెక్కడ సోకుతుందోనని అక్కడి రోగులు జడుసు కుంటున్నారు. ప్రజాసుపత్రుల నుంచి ‘ఐసొలేషన్‌ యూనిట్‌’లను తొలగించండని మొరపెట్టుకుంటున్నారు. రాష్ట్రాల రాజధానుల్లోనే ఈ పరిస్థితి ఉంటే, ఇక జిల్లా కేంద్రాల్లో స్థితిని ఊహించవచ్చు.

వ్యాక్సినే గొప్ప ఉపశమనం
ప్రపంచంలో గొప్ప పేరున్న దాదాపు అన్ని వైరాలజీ, ఇతర వైద్య ప్రయోగశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. కరోనాకు విరుగుడు కను గొనే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మనుషులపై అతి ప్రభావం చూపిన రెండు పోగుల్ని (స్ట్రేయిన్స్‌) చైనా శాస్త్రవెత్తలు గుర్తిం చారు. ఈ వ్యాధి పుట్టిన వుహాన్‌లో కరోనా వైరస్‌ నుంచి సేకరించిన ‘జన్యు పటం’ (జీనోమ్‌ సీక్వెన్స్‌ డాటా)పై విస్తృత పరిశోధనల తర్వాత ఈ విషయం కనుగొన్నట్టు గురువారం వెల్లడించారు. వ్యాధి ప్రభావానికి 70 శాతం ఒక (దూకుడు) పోగు కారణం కాగా 30 శాతా నికి మరో (అణకువ)పోగు కారణంగా గుర్తించారు. మిగతా ప్రపంచ మంతటా వ్యాధి కారకమైన వైరస్‌ జన్యు పటాల్ని విశ్లేషిస్తే చిత్రం మరింత స్పష్టమౌతుంది.

ఇది వ్యాధి నివారణ మందు, వ్యాక్సిన్‌ కను గొనేందుకు ఎంతో ఉపకరిస్తుంది. నేపాల్, వియత్నాం, కంబోడి యాతో సహా ఇప్పటికి 23 దేశాలు, తమ దేశాల్లో కరోనా వైరస్‌ నుంచి సేకరించిన జన్యుపటాలను ‘గ్లోబల్‌ ఇనిషియేటివ్‌’తో పంచుకు న్నాయి. దాంతో ప్రపంచ వ్యాప్త పరిశోధనలకిది అందుబాటులోకి వచ్చినట్టయింది. ఈ పని చైనా జనవరి 11నే చేసింది. కానీ, మన దేశం ఇప్పటివరకు జన్యు పటాన్ని విశ్వవేదికపై (పబ్లిక్‌ డాటాబేస్‌) పొందు పరచలేదు. ఎందుకింత అలసత్వం? ఇది భారత సంస్కృతి, సంప్రదా  యానికి విరుద్ధమైన పోకడ! విపత్కాలంలో వదంతులు ఎంత చేటో అలసత్వం అంతే ప్రమాదకారి. మరింత చిత్తశుద్ధి, తగి నంత నిబద్ధత చూపిస్తేనే విపత్తు నుంచి బయటపడుతాం!

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement