మన సమాజం బాగుపడాలంటే సమాజంలో సగభాగమైన బీసీలు అన్ని రంగాల్లో స్థిరపడి నిలబడగలగాలి. ఏ సమాజమైనా బాగుపడాలంటే ఉత్పత్తి శక్తులతో సంపదలు సృష్టింపచేసి, తిరిగి ఆ సంపదను వాళ్లకే పంచి పెట్టాలి. ఇక్కడ ఉత్పత్తి శక్తులంటే బీసీలు, ఈ బీసీల బతుకులలో, జీవన విధానంలో సమగ్రమైన మార్పు రావాలి. తెలుగు సమాజం రెండు రాష్ట్రాలుగా విభజింపబడిన తర్వాత ఏపీలో బీసీల జీవనంలో వచ్చిన మార్పు ఏమిటి? అన్న సందర్భం వచ్చింది. అమరావతి సాక్షిగా ఈ 55 నెలల పాలనలో బీసీ బతుకులలో వచ్చిన మార్పు ఏమీలేదు. తెచ్చిన మార్పు కూడా ఏమీలేదు. పునాది నుంచి చూస్తే బీసీలలో అట్టడుగున ఉన్నవారిని పైకి తీసుకువచ్చే పనిమొదలు కావాలి. కానీ, అది ఇప్పటికీ జరగటం లేదు. బీసీలు మరింత వెనుకబడిన ఎంబీసీల స్థితి దారుణంగా ఉంది.
అభివృద్ధి ఫలాలు కొందరికే అందుతున్నాయి. అవి అందరికీ అందించాలి. ప్రపంచీకరణ ప్రభావం వలన అనేక కులవృత్తుల చేతులు విరిగిపోయాయి. కొన్ని కులవృత్తులు నడుస్తున్నప్పటికీ ఈ వృత్తులకు ఆధునీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అందకపోవటం వలన దెబ్బతింటున్నారు. బతుకుపైన బీసీలకు భరోసా కలిగించాలి. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెలమగ్గం, శరీర కష్టం స్ఫురింపచేసే రంపం, కొడవలి, నాగలి సమస్త వృత్తుల సమస్త చిహ్నాలను శ్రీశ్రీ తన కవితా చిహ్నాలుగా చేసుకుని పలవరిం చారు. సరిగ్గా పాలకులు కూడా తమ పాలనా చిహ్నాలుగా బీసీల జీవితాలను మార్చటమే ధ్యేయంగా ముందుకుసాగాలి. బాబు 55 నెలల పాలనను చూశాక అది ఆయనవల్ల కాదని తేలిపోయింది.
సరిగ్గా ఇదే సమయంలో వైస్సార్‌సీపీ అధినేత జగనన్న ఏపీలో అన్ని రంగాలలో మార్పు రావాలని, ప్రధానంగా ఉత్పత్తి శక్తులైన బీసీల జీవితాలు బాగుపడాలని తపన పడుతున్నారు. అందుకోసం ఆలోచిస్తున్నారు, పథక రచనలు చేస్తున్నారు. బీసీ బతుకులకు భరోసా కల్పించేందుకు ఎంత సాహసం చేయ టానికైనా సిద్ధపడుతున్న జగనన్ననే బడుగు జనులు అర్థం చేసుకుంటున్నారు. బీసీలంటే ప్రభు త్వ పథకాలు కాదని, వారి జీవన విధానాన్ని పరిపూర్ణంగా మార్చటానికి జగన్ ముందుకొస్తున్నారు. బీసీల జీవితాల్లో మార్పు రావాలంటే విద్యా, వైద్య రంగాలు రెండూ వీరికి అందుబాటులోకి రావాలి. చదువులేకపోతే పరిణామ క్రమం లేదు. వైద్యరంగం ద్వారా ప్రతి ఒక్క పేదకు, బహుజనావళికి ఉచితంగా వైద్యం అందాలి. ఈ రెండు పనులు చేయటమే లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నారు.
దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో బీసీల చదువుల కోసం రీయింబర్స్‌మెంట్ పథకాన్ని చేపట్టారు. అదే విధంగా వైఎస్ జగన్ ఏపీలో ఏ రాజకీయపార్టీ ఆలోచించని విధంగా, ఒక నూతన శకానికి నాంది పలికేందుకు రాష్ట్ర జనాభాలో సగభాగంగావున్న వెనుక బడిన తరగతుల, అత్యంత వెనుకబడిన తరగతుల, సంచారజాతులలో వెలుగు నింపాలని, వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా పురోభివృద్ధికి చేయూతనివ్వాలని, అధికారానికి రాకముందే రాష్ట్రంలో బీసీల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి అధ్యయన కమిటీని వేయటం బీసీ వర్గాలు హర్షిస్తున్నాయి.
ఈ నేప«థ్యంలో బీసీ అధ్యయన కమిటి కన్వీనర్‌గా బాధ్యతలు తీసు కుని రాష్ట్రంలో బీసీల జీవన విధానాన్ని అధ్యయనం చేసే అవకాశం కలగటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. బీసీల గురించి లోతుగా తెలుసుకునేందుకు ఈ కమిటి ద్వారా క్షేత్రస్థాయికి వెళ్ళేందుకు జగనన్న నాకు అవకాశం కల్పించారు. క్షేత్రస్థాయిలో బీసీలకు సంబంధించిన విషయాలపై అవగాహన చేసుకుని వారికి అండగా నిలవడమే ధ్యేయంగా జగన్ అడుగులు వేయడంతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర నూతనశకానికి నాంది కాబోతుంది.
స్వాతంత్య్రం అనంతరం ప్రపంచ మేధావి, శ్రమ జీవుల పక్షపాతి బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మహాత్మాజ్యోతిబాపూలే ఆలోచనల ధారలో అంబేడ్కర్ బహుజనం గురించి లోతుగా ఆలోచించి రాజ్యాంగ రచనను కొనసాగించారు. స్వాతంత్య్రం వచ్చి 72 సం‘‘లు అయినప్పటికి కూడా ఆశించిన మేరకు వెనుకబడిన వర్గాల, నిమ్నజాతుల యొక్క జీవన ప్రమాణాలలో మార్పురాలేదు. వర్ణ, కుల, లింగ వివక్షత కొనసాగుతూనే వుంది. సమాజంలో ఒక అభద్రతాభావం, రాజకీయ అనిశ్చితస్థితి, వైషమ్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అసమానతల గోడలను కూల్చకుండా అభివృద్ధి సాధ్యం కాదని వై.ఎస్ బాటలో జగన్ బీసీ పథక రచనలను రూపొందించారు.
ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక రాజ్యం కొనసాగుతోంది. అప్రజాస్వామిక పాలకవర్గ విధానాలు, రోజురోజుకు బడుగు, బలహీనుల జీవితాలను దిగజారుస్తున్నాయి. అధికారకాంక్ష, సంపాదనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ కుళ్ళిన వ్యవస్థను బాగుచేయాలంటే బహుజన పక్షపాతి అయిన జగనన్నే ముందుండాలని ఆ వర్గాలు కోరుకుంటున్నాయి. బహుజన వర్గాలకు విశ్వాసం, నమ్మకం కలిగించటమే కాదు వారికి అండగా నిలబడవలసిన సమయమిది. ఆ పనిని జగన్ తన భుజస్కందాలపై వేసుకున్నారు. అన్నివర్గాల ప్రజల జీవన విధానాలు తెలుసుకొని, అలుపెరగని యోధుడుగా నిరంతర శ్రామికుడిగా వెలుగొందుతున్న జగనన్న నాయ కత్వం ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాలకు, ముఖ్యంగా తాడిత, పీడిత ప్రజానీకానికి న్యాయం జరుగుతుం దని ఆ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
రాష్ట్రంలోని అన్ని రంగాలతో పోల్చుకొని చూస్తే బీసీల అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది.బీసీల అభివృద్ధిలో తారతమ్యాలున్నాయి. మైదాన, మెట్ట, దిగువ, కొండప్రాంతాలు, నగర, మహానగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బీసీలలో ఊహించనంత వ్యత్యాసం ఉంది. ఇంకా బీసీలలో గుర్తింపు లభించని కులాలున్నాయి. కులంపేరు తెలియని అభాగ్యులున్నారు. వీరిని గుర్తించి బీసీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉంది. సంచారజాతుల పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావాలి.
పెద్దనాయకుల పిల్లలు అమెరికా పోయి చదువుకోవడం గొప్పతనం కాదని, ఆర్థికంగా, బలహీనంగా ఉన్న పిల్లలు చదువులో ఎదిగి దేశదేశాల్లో స్థిరపడాలని జగన్ ఆలోచిస్తూ బీసీ డిక్లరేషన్‌ని తయారుచేస్తున్నారు. ప్రతిభ కొన్ని వర్గాల సొత్తుకాదని అది అందరిలో ఉంటుందని, బీసీలలో వున్న ప్రతిభను వెలికితీయడానికి వారికి విద్యారంగంలో ఎన్నో అండదండలు అందించవల్సి ఉందని జగన్ ప్రతిపాదిస్తున్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా దేశవ్యాపితంగా ఈ విషయంపై అన్ని పార్టీలను ఏకం చేసి నిలబడతానని జగనన్న మాటిచ్చాడు.
బీసీ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్న దశలో పల్లెకన్నీరు పెడుతున్న దశను చూసి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వీరి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలకు మరింత కొనసాగింపుగా, బీసీల ప్రామాణికమైన అభివృద్ధికి అండదండలుగా నిలవాలి. ఆ పని చేయగలిగిన శక్తివంతులెవ్వరో బీసీలకు తెలుసు. అందుకే బీసీలు జగన్ పాదయాత్రలో అడుగడుగునా అండదండలతో నిలిచారు. వారి కన్నీళ్లను, కష్టాలను దగ్గరకెళ్లి ఆయన చూశారు. బీసీలు శిరసెత్తుకుని నిలబడగలిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చెందినట్లుగా భావించాలి.
నవసమాజ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు బీసీలే, ఊరుకు ప్రాణం బీసీలే, వ్యవస్థకు ప్రాణం బీసీలే. వీరి అభివృద్ధే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి. బీసీలకు అండగా, వారికి గుండెదండుగా జగన్ నిలబడతారన్న నమ్మకముంది. బీసీలు నమ్మకంపై నమ్మకం వున్నవారు. బీసీలకు అండగా నిలిచే శక్తులను బీసీలే కాపాడుకుంటారు. నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి జగన్‌కు అండగా బీసీలు చీమలదండులా కదలివస్తారు. బహుజన తాత్త్వికతతో నిర్మించబోయే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి తలావొకచేయి వేసి నిలుద్దాం. జగనన్న మార్గంలో బహుజనపథాన్ని నిర్మిస్తూ ముందుకు సాగుదాం. పదండి.
(నేడు ఏలూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభ సందర్భంగా)
వ్యాసకర్త : జంగా కృష్ణమూర్తి, బీసీ అధ్యయన కమిటీ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment