ఇవి భాషాప్రయుక్త ఎన్నికలు | Kannada Language Is Key Role In Karnataka Elections | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 18 2018 12:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Kannada Language Is Key Role In Karnataka Elections  - Sakshi

గడచిన సంవత్సరం జూలైలో బెంగళూరు మెట్రో రైలు వ్యవస్థకు చెందిన పలు స్టేషన్‌లు దాడికి గురయ్యాయి. ఆ దాడులన్నీ దాదాపు ఏకకాలంలోనే జరిగాయి కూడా. కన్నడ ఆందోళనకారులు, ముఖ్యంగా కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు హిందీలో రాసి ఉన్న బోర్డుల మీద నల్ల రంగు పూశారు. హిందీ భాషకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. వెంటనే మెట్రో రైల్‌ అధికారులు స్పందించి పరిస్థితి మరింత విషమించకుండా బోర్డుల గురించి ఉన్న ఆంక్షలు తొలగించారు. హిందీలో ఉన్న పేర్లను ఇంగ్లిష్, కన్నడ భాషలలో రాయిం చారు. ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు సాధారణంగా వాటిని విశాల దృక్పథం లేని, సంకుచిత మనస్తత్వం కలిగిన సంస్థల, వ్యక్తుల చర్యలంటూ కొట్టి పారవేయడం జరుగుతుంది. తాము చెప్పేది విని తీరాలన్నట్టు వ్యవహ రించే రౌడీ మూకల పనిగా కూడా అలాంటి చర్యలను నిరసించడం జరు గుతూ ఉంటుంది. కానీ ఈ నిరసన మాత్రం ప్రత్యేకమైనదే. కన్నడ భాషకు తగిన గౌరవం దక్కడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఉద్యోగుల మద్దతు కూడా ఈ ఆందో ళనకు ఉంది. 

కన్నడం అంటే చులకనా?
నేను గత వారం బెంగళూరులో ఉన్నప్పుడు వసంత్‌ శెట్టి, వల్లీశ్‌ అనే ఇద్దరు భాషా శాస్త్రవేత్తలను కలుసుకున్నాను. వారిద్దరిలోనూ కనిపించిన సారూ ప్యత, కర్ణాటకలో కూడా ప్రాధాన్యక్రమంలో కన్నడకు హిందీ తరువాత స్థానంలోకి ¯ð డుతున్నారనే భావనే. కన్నడిగులకు హిందీ అనుసంధాన భాష కాలేదన్నది ఆ ఇద్దరి వాదన. మరొక విషయాన్ని శెట్టి చాలా ఆర్ద్రంగా చెప్పారు. కన్నడ భాషలో మాట్లాడని బ్యాంకు సిబ్బంది, తపాలా శాఖ సిబ్బంది ఉన్నారనీ, రైల్వేశాఖలో అయితే కన్నడను అసలు పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి ధోరణే ప్రజలలో హిందీ పట్ల ఒకరకమైన భయాన్ని, తమ పట్ల తమకు అభద్రతా భావాన్ని కలిగిస్తున్నదని కూడా శెట్టి చెప్పారు. కానీ ఇది కేవలం భాషను గురించిన వ్యవహారం కాదు.

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాష గురించిన అంశం కన్నడిగుల ఉనికి, ఆత్మగౌరవాలతో ముడిపడిపోయింది. దీనికి తోడు హిందీలో ప్రసంగించేవారి కంటే, కన్నడ భాషలో ప్రసంగించేవారు తక్కువ అన్న భావం బలం పుంజు కుంటోంది. వల్లీశ్‌ చెప్పిన మరో అంశం చాలా కలవరపాటుకు గురిచేసింది. ఇంత వైవిధ్యం ఉన్న భారత్‌ వంటి దేశంలో  భిన్నత్వాన్నీ, అందులోని అనే కానేక అస్తిత్వాలనీ ప్రభుత్వం గౌరవించాలని ఆయన అన్నారు. విద్యావం తుడైన ఒక కన్నడిగుడి అభిప్రాయం ఎలా ఉందో సుస్పష్టంగా గమనించడా నికి ఆయన మాటలలోనే ఆ విషయం చెబుతాను. ‘మనకి ఇండియన్‌ అన్న ఒక్క అస్తిత్వం మాత్రమే ఉందని ఎవరూ చెప్పలేరు.  ఇది అన్నింటినీ తుడిచి పెట్టేస్తుంది. ఒకే అస్తిత్వాన్ని ఇతరుల మీద కూడా ప్రయోగించలేం. నీవు ఇండియన్‌వి అయితే హిందీని ఆమోదించు, కన్నడిగుడివి అని చెబితే నీవు తక్కువ రకం ఇండియన్‌వి అన్న ఊహలు భారత్‌ అన్న భావనతో మమేకం కావడానికి దోహదం చేయవు.’ అని చెప్పారు వల్లీశ్‌. ఇలా తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్న అభిప్రాయం ఒక్క బెంగళూరులోనే కాదు, దక్షిణ భారత ప్రజలలోనే ఉంది.

ఇంకా చెప్పాలంటే త్రిభాషా సూత్రమనేది హిందీని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దడానికి ఉద్దేశించిన పెద్ద మాయ అన్న భావన కూడా నానాటికి పెరుగుతున్నది. ఇది ఒక్క భాషకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. రామాయణ కావ్యం గురించే చూద్దాం. వాల్మీకి రామాయణం ఒక్కటే అసలైన రామాయణమని ఔత్తరాహుల దృఢాభి ప్రాయం. కానీ దక్షిణాదిన చాలా రామాయణాలు ఉన్నాయి. తమ తమ విశ్వాసాల గురించి, జన్మభూమి గురించి ప్రతి తరం విశ్లేషించుకోవడానికి ప్రతి సంస్కృతిలోనూ ఒక రామాయణం అవతరించడం కనిపిస్తుంది. ఏక శిలా సదృశమైన సంస్కృతినే అనుసరించాలని, అది అందరికీ సరిపోతుందని బలవంతం చేస్తే దానికి వెంటనే ప్రతిఘటన తప్పదు. కన్నడ విషయంలో గుర్తించవలసిన అంశం ఏమిటంటే, మిగిలిన భాషల మాదిరిగానే ఇది కూడా కేవలం ఒక మాధ్యమమని చెప్పడానికి పరిమితం కారాదు. ఇదొక ఉద్వేగం. 

తెగేదాకా లాగవద్దు
ఇక ప్రత్యామ్నాయ అభిప్రాయం గురించి కూడా తెలుసుకోవాలి. రాష్ట్రాలని ప్రాంతీయవాదపు దీవులుగా మలచడం భారత్‌ ఒకే జాతి అన్న భావనకు ఆరోగ్యకరం కాదు. భారతదేశ రాష్ట్రాలను కలిపి ఉంచే శక్తి కలిగిన భావో ద్వేగమేదీ లేదన్న అనుమానం నుంచి ఇది జనిస్తుంది. నిజానికి ఈ వ్యతిరేకత వాస్తవమే. ఒక జాతిగా మనం సురక్షితంగానే ఉన్నాం. అయితే దేశం మరింత బలమైన సమాఖ్యగా ఎదగడానికీ,  మరింతగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రా లకు అవకాశం కల్పించడానికీ సమయం ఆసన్నమైంది. అదే సమయంలో కర్ణాటక భాష సమస్యను తెగేదాకా లాగడం సరికాదు.

అది హిందీ వ్యతిరేక ధోరణికి మళ్లిందంటే కర్ణాటక, బెంగళూరుల అభివృద్ధికి ఇతర ప్రాంతాల వారి ద్వారా జరిగిన కృషి మరుగున పడేటట్టు చేస్తుంది. గుర్తించవలసిన మరొక అంశం కూడా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది కన్నడ భాష ఒక్కటే కాదు. రాష్ట్రంలో ఇంకా తుళు, కొడవ, కొంకణి, ఆఖరికి హైదరాబాద్‌–కర్ణా టక పరిధిలో దక్కనీ ఉర్దూ కూడా ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే కన్నడ భాష ఆధిపత్యం పాత మైసూరు పరిధిలోని ఐదు లేదా ఆరు జిల్లాలకే పరిమితం. బెంగళూరుకు ఉన్న కాస్మోపోలిటన్‌ సంస్కృతిని కూడా మరచిపోలేం. కాబట్టి ప్రాంతీయ జ్వాలని ఒక స్థాయికి మించి మండనిస్తే దానితో చాలా చిక్కులు ఉంటాయి.

బయటి ప్రాంతాల వారు వచ్చి రాష్ట్ర అభివృద్ధి యంత్రాంగానికి ఎంతో దోహదం చేశారన్న వాస్తవాన్ని గుర్తించాలి. కాబట్టి కన్నడ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాలకు మించి ఎదగనిస్తే అవాంఛనీయ పరిణామాలు తప్పవు. కర్ణాటక రాష్ట్ర ఆదాయ వివరాలను ఒకసారి పరిశీలించండి. అందులో 60 శాతం ఒక్క బెంగళూరు మహా నగరం నుంచే వస్తుంది. ఉత్తర కర్ణాటక వంటి చాలా వెనుకపడిన ప్రాంతాన్ని ఆదుకుంటున్నది ఆ ఆదాయమే. 

ఇక ఈ ఎన్నికలలో బీజేపీని కలవరానికి గురి చేసే విషయం ఏదంటే, ఆ పార్టీ మీద ఉన్న ఉత్తరాది ముద్ర. అంటే హరియాణా, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్‌ ప్రాంతాలకు పరిమితమైన పార్టీ అన్న అవగాహన. ఇదే బీజేపీ వాద వ్యతిరేక, హిందీ భాషా వ్యతిరేక అభిప్రాయాలకు ఆస్కారం ఇస్తున్నది. భాష కొన్నిసార్లు ఆధిక్యం ప్రదర్శించడానికి ఉపయోగపడే సాధనమవు తుంది. కానీ బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్‌ కొన్నిసార్లు భాషా వ్యతిరేక సెంటిమెంట్‌గా కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు జరగబోతున్న కర్ణాటక శాసన సభ ఎన్నికలలో భాష కీలకమైన అంశంగా మారింది. జాతీయవాద మనే బీజేపీ కార్డుకు పదును లేకుండా చేయడానికి కాంగ్రెస్‌ ప్రాంతీయ అస్తి త్వాన్ని ముందుకు తేవడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎన్నికల రథాన్ని నడిపిస్తున్న సిద్ధరామయ్య తన రాజకీయ జీవితంలో ఎక్కు వగా, ఆఖరికి జనతా పరివార్‌లో ఉండగా కూడా అస్తిత్వ రాజకీయాలనే ప్రధానంగా ఆశ్రయించారు. అదే ఆయన బలం. జాతీయ వాదం, ఒకే జాతి, ఒకే పతాకం అనే బీజేపీ భావనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయిలో కన్నడ అస్తిత్వం అనే కార్డును ప్రయోగి స్తున్నది. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాతీ అస్మిత కార్డును ప్రయోగించిన తీరులోనే సిద్ధరామయ్య కర్ణాటకలో తన ఆయుధాన్ని ఇప్పుడు ప్రయోగిస్తున్నారు. హిందీ, హిందూ, హిందుస్తానీ పార్టీగా బీజేపీకి ఉన్న ముద్రను ఉపయోగించుకుని సిద్ధరామయ్య కన్నడ ఆత్మగౌరవం అనే కార్డును రంగం మీదకు తెచ్చారు.

రాష్ట్ర పతాకం అన్న సిద్ధరామయ్య ఆలోచన కూడా మిగిలిన భారతదేశం కంటే కర్ణాటక ప్రత్యేక ఉనికిని ప్రకటించడానికేనని ఆయన ప్రత్యర్థులు చెబుతారు. నిజానికి కర్ణాటక తనకంటూ ఒక ప్రత్యేక పతాకాన్ని ఏర్పరచుకుంటే దాని గురించి మిగిలిన భారతదేశం కలతపడ వలసిన అవసరం ఉందా? క్రికెట్‌ రంగాన్ని చూడండి. అందులో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఉప జాతీయతను ప్రదర్శిస్తూ ఉంటుంది. దీనిని దేశానికి అతీ తంగా ప్రదర్శిస్తున్న ఆత్మగౌరవమని అంటామా? అది కాదు. పైగా తన నగరం నుంచి లేదా ప్రాంతం నుంచి తమ ఉనికిని ప్రదర్శించడం పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు ఆనందిస్తారు. చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైద రాబాద్‌– ఇలా. కర్ణాటక పతాకం కూడా ఇంతకంటే భిన్నమైనది కాదు. 

కర్ణాటక ప్రజలకు పరీక్షే
సిద్ధరామయ్య పన్నిన ఉచ్చులో తాము ఇరుక్కున్నామన్న వాస్తవాన్ని కర్ణాటక బీజేపీ నాయకులు గ్రహించారన్న సంగతి వారిని కలుసుకున్నప్పుడు నాకు అవగాహనకు వచ్చింది. దీనితోనే కన్నడిగ అస్తిత్వం కోసం కాంగ్రెస్‌ ఏ విధంగా పాటు పడుతున్నదో తాము కూడా అదే విధంగా పాటు పడతామన్న రీతిలో బీజేపీ వ్యవహరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. హిందీ, కన్నడ భాష అంశం ఈ స్థాయికి చేరుకోవడం శోచనీయం. ఇదే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య  నిధుల కేటాయింపు వివాదంలో ప్రతిఫలిస్తున్నది.

ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర నిధులను రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. దీనికి సిద్ధరామయ్య ఇచ్చిన సమాధానం ఇది– కేంద్రానికి  కర్ణాటక పన్నుల రూపంలో చెల్లిస్తున్న ప్రతి రూపాయికి తిరిగి పొందుతున్నది 47 పైసలేనని అన్నారు. ఉత్తరాది బీమారు రాష్ట్రాలు (బిహార్, ఎంపీ, రాజస్తాన్, యూపీ) తమ తమ పరిధుల లోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నిధుల కోసం తల్లడిల్లు తుండగా, వాటికి కర్ణాటక రాయితీలు కల్పిస్తున్నదని సిద్ధరామయ్య ఇక్కడ చెప్పదలిచారు. ఈ ఎన్నికలు కొన్ని చేదు వాస్తవాలను మనముందు పెడుతున్నాయి. ఎక్కువగా మాట్లాడని కర్ణాటక రాష్ట్రానికి బియ్యం సబ్సిడీని తగ్గిం చడం, గోరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రానికి ఆ సబ్సిడీని కేటాయించడం ఎంతవరకు సబబు? ఇది ఉత్తర భారత, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య వివక్ష చూపించడం కాదా?
ఈసారి కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు ఆ రాష్ట్ర ప్రజలకు పరీక్ష వంటివని నాకు అనిపిస్తున్నది. వారి అస్తిత్వానికి, వారి ఆత్మ గౌరవా నికి, వీటిలో వారు దేనిని ఆహ్వానించారు, దేనిని తిరస్కరించారన్నదానికి వారి ఎంపిక వ్యాఖ్యానం వంటిది. అలాగే ఈ విషయాలతో సంబంధం ఉన్న వారందరూ ఈ ఎన్నికల నుంచి నేర్చుకోవాలి.

టీఎస్‌ సుధీర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement