గతంలో చంద్రబాబు, మోదీల స్నేహ బంధం.. (ఫైల్ ఫోటో)
ఇప్పుడు దేశమంతా కర్ణాటక వైపే చూస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కర్ణాటకలో ఏం జరుగుతోందో చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు. తెలుగుదేశం నేతలు మరీ ‘టెన్షన్’తో ఉన్నారు, కాంగ్రెస్ నాయకుల కన్నా టీడీపీ నాయకులే బీజేపీ గెలవకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనేది వాస్తవం. గత ఎన్నికల్లో (2013) బీజేపీ అంతఃకలహాలతో కర్ణాటకలో ఘోరంగా ఓటమి పాలైంది. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో తన ప్రాభవాన్ని నిలుపుకుంది. ఈసారి ఎన్నికలు అటు కాంగ్రెస్‌కి ఇటు బీజేపీకి ఒక సవాలుగా మారాయి. మధ్యలో జనతాదళ్ (ఎస్) మాత్రం కింగ్ మేకర్ అవ్వాలని ఉవ్విళ్లూరుతోంది.
కుమారస్వామి మాత్రం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఇద్దరికీ మెజారిటీ రాకూడదని వెయ్యిదేవుళ్లకు మొక్కుతున్నారు. మరి ఈ ముక్కోణపు పోటీలో చివరకు కన్నడ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో అని దేశమంతా ఎదురుచూస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత 3 నెలల నుంచి కర్ణాటక ప్రచారాన్ని చేపట్టారు. అయితే రాహుల్, సిద్ధరామయ్య, ఖర్గే, డీకే శివకుమార్ తప్ప కాంగ్రెస్ ప్రచారంలో మిగతా నాయకులు ఎవరూ లేరనే చెప్పాలి. మరోవైపు బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ కన్నా 2 నెలల వెనుక మొదలు పెట్టింది. బీజేపీకి కాంగ్రెస్ కన్నా ఎక్కువమంది రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ప్రచారంలో ఉన్నారు. ముఖ్యంగా రాష్టంలో అన్ని వర్గాల్లో బీజేపీ నాయకులు ఉన్నారు.
ఈశ్వరప్ప (ఓబీసీ), మహేష్ జగజానీ (ఎస్సీ), యడ్యూరప్ప, అశోక్, సదానంద గౌడ్, జగదీష్ షెట్టర్, శ్రీరాములు (ఎస్టీ) మొదలైన నాయకులు ఉన్నారు. వీరు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలు ప్రచారంలోకి దిగారు. మోదీ ప్రచారం గత 4 రోజులుగా కర్ణాటక రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. మొదట ప్రచారంలో వెనుకబడిన బీజేపీ తర్వాత మోదీ సమావేశాలతో అమాంతం ముంచి ఊపుమీదికొచ్చిందని రాజ కీయ విశ్లేషకుల అంచనా. బలహీనంగా ఉన్న రామ్ నగర్, మాండ్యా చిక్‌బళ్లాపూర్‌లలో కూడా బీజేపీ పుంజుకున్నట్లు భావిస్తున్నారు. సహజంగానే బీజేపీ బెలగాం, బీజాపూర్, కోస్తా, కర్ణాటక, బెంగళూరు సిటీల్లో బలంగానే ఉంది. ఇంకా మోదీ ప్రచారం 4 రోజుల పాటు ఉంది. ఈ నాలుగు రోజుల్లో పరిస్థితి బీజేపీకి ఇంకా అనుకూలంగా మారవచ్చని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
అయితే సర్వేలపై ఆశపెట్టుకున్న కాంగ్రెస్‌కు మొదటి నుంచి సానుకూల అంచనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ 115 స్థానాల్లో గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పగా 129 స్థానాల్లో గెలుస్తుందని మరికొన్ని సర్వేలు చెప్పాయి. కానీ చివరి పదిరోజుల ప్రచారం కీలకంగా మారుతుందని బీజేపీ భావిస్తోంది. అయితే హంగ్ రాబోదని, మోదీ పర్యటన తర్వాత పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయని, 50 లక్షలకు పైగా ఉన్న తెలుగు ఓటర్లు కూడా తమకే అనుకూలంగా ఉన్నారని బీజేపీ నమ్మకం.
కర్ణాటకలో ఉన్న తెలుగువారు బీజేపీని ఓడించాలని తిరుపతి వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు. అంటే భవిష్యత్తులో తాను కాంగ్రెస్‌తో కలుస్తానని చెప్పకనే చెప్పారు. బహిరంగంగానే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునివ్వడం కన్నడనాట తెలుగువారిని ఆశ్చ ర్యానికి గురిచేసింది. నిజం చెప్పాలంటే కర్ణాటకలోని తెలుగువారు గత రెండు దశాబ్దాలుగా బీజేపీకి ఓటు వేస్తున్నారు. ఈసారి కూడా కమలం గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారని తెలుగు ప్రజల మధ్య ప్రచారంలో ఉన్న ఇరురాష్ట్రాల బీజేపీ నాయకులు చెప్పడం విశేషం.
వ్యాసకర్త పురిఘళ్ల రఘురాం, బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
ఈమెయిల్ : raghuram.delhi@gmail.com
Comments
Please login to add a commentAdd a comment