
దేశ చరిత్రలో తొలిసారిగా 160 పైగా రైతు, ప్రజాసంఘాలు ఏకమై ‘అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ’ ఏర్పడటం రైతాంగ సమస్యల పరిష్కారంలో మూల మలుపుగా చెప్పాలి.
ప్రపంచంలో న్యాయం కోసం జరిగే బలిదానాలు వృథా కావని మరోసారి రుజువైంది. జూన్ 6, 2017న మధ్యప్రదేశ్ లోని మందసౌర్ జిల్లా పిప్లియా వద్ద అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులు రుణమాఫీ కావాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కారు. కానీ రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాలనుకున్న ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం పాశవికంగా జరిపిన కాల్పుల్లో 6 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశంలోని రైతులను, రైతు సంఘాలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఏదో ఒకటి తేల్చుకోవాలని, రైతులను ప్రభుత్వాలు మోసగిస్తున్న విధానాన్ని తెలియజేసి వారిని ఉద్యమ బాట వైపు నడిపించాలని నిర్ణయించుకుని దేశంలోని 160కి పైగా రైతు, ప్రజాసంఘాలు ఏకమయ్యాయి. దీని ఫలితంగా ‘అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ’ ఏర్పడింది.
ఈ కమిటీ రైతులను చైతన్యపరచటానికి, నవంబర్ 20న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రైతు మహా ప్రదర్శనకు సన్నద్ధం చేయటానికి ‘కిసాన్ ముక్తి యాత్ర’ పేరుతో దేశవ్యాప్త యాత్రను ప్రారంభించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 16 వ తేదీన 24 రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి దక్షిణ భారత కిసాన్ ముక్తి యాత్రను హైదరాబాద్ లోని గన్ పార్క్ నుంచి ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే. ఆ యాత్రలో భాగంగా ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభకు దాదాపు 10 వేల మంది రైతులు సభకు తరలిరావడం విశేషం. ఖమ్మం రైతులలో ఈ స్థాయి చైతన్యానికి, ఆగ్రహానికి కారణం లేకపోలేదు. సరిగ్గా 5 నెలల క్రితం ఖమ్మం రైతులు మిర్చి పంటకు గిట్టుబాటు ధర అడిగితే లాఠీ ఛార్జి చేసి బేడీలు వేసి మరీ వీధుల వెంట తీసుకువెళ్లిన ఘటన వాళ్ళ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి దేశంలో రుణమాఫీ ఇంత ఘోరంగా అమలైన రాష్ట్రం ఇంకొకటి లేదని, ప్రభుత్వం వచ్చి నాల్గవ సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కాలేదని కమిటీ గుర్తించింది. రుణమాఫీ అంటే రైతులందరూ ఒక్కసారిగా రుణ విముక్తులు కావాలని అర్థం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రుణ మాఫీ వల్ల ఒక్క రైతు కూడా పూర్తి రుణ విముక్తుడు కాలేదని తెలుస్తోంది. రాజధాని పేరుతో రెండు పంటలు పండే భూములను దౌర్జన్యంగా లాక్కున్న విధానాన్ని పరిశీలిస్తే, అది పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిన భూసేకరణ తప్ప రాజధాని నిర్మాణం కోసం చేసిన భూసేకరణ కాదని తేలిపోయింది.
రైతులకు చిన్న రుణ మాఫీ చేసి ఎంతో చేసినట్టు చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ఈ పది సంవత్సరాలలో రైతులకు ఎంత మోసం చేసాయో రైతు యాత్ర ద్వారా అర్థం అయ్యింది. 2007 నుంచి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంట పెట్టుబడికి 50 శాతం అదనంగా ధర కల్పించి ఉంటే ప్రతి సంవత్సరం 2లక్షల కోట్ల రూపాయలు రైతులకు వచ్చి ఉండేది. అంటే ఈ పదేళ్ల కాలంలో రైతులు నష్టపోయిన డబ్బు 20 లక్షల కోట్ల రూపాయలు, మరి దేశం రైతులకు రుణపడి ఉన్నట్టా ? లేక రైతులు దేశానికి రుణపడి ఉన్నట్టా?
ఇక అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను చూసిన యాత్ర సభ్యులందరూ చలిం చిపోయారు. కనీసం వారిని ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలుగా గుర్తించి, వారిని ఆదుకోకపోవటం మరీ దారుణం. రాయలసీమలో ఉల్లి, టమాటా పంటలను ధరలేక రోడ్ల పైన పోసిన పరిస్థితిని రైతులు వివరిస్తుంటే యాత్ర సభ్యులు దిగ్భ్రాంతి చెందారు.
తమిళనాడులో యాత్ర సాగిన రెండు రోజులూ.. తమిళ రైతులు ఢిల్లీలో తమ హక్కుల కోసం ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలతో, ఎముకలతో చేసిన వీరోచిత పోరాటం మళ్లీ గుర్తుకొచ్చింది. తాము జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో పోరాడి తమ హక్కులు సాధించుకుంటామని తమిళ రైతులు ప్రతిన పూనారు. కాగా కేరళ ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు రుణ విముక్తి చట్టం కొంత సత్ఫలితాలనే ఇచ్చింది. అది దేశమంతటా అమలుచేస్తే కాస్త ప్రయోజనం చేకూరుతుంది.
కర్ణాటకలో జరిగిన సమావేశానికి వేల సంఖ్యలో మహిళా రైతులు తరలివచ్చారు. మాండ్యా జిల్లాలాంటి నీటిపారుదల సౌకర్యాలు ఉన్న జిల్లాలలో కూడా చెరుకు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని వీరు ఆరోపించడం గమనార్హం. ప్రధాన మంత్రి మోదీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రానికి రైతు రుణమాఫీ ప్రకటించిన విషయాన్ని వీరు ఎత్తి చూపుతూ, మరి మిగతా రాష్ట్రాల సంగతేమిటని ప్రశ్నించారు.
సెప్టెంబర్ 23న దక్షిణ భారతదేశ కిసాన్ ముక్తి యాత్ర బెంగుళూరులో ముగిసింది కానీ సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నప్పటికీ రైతుల హక్కుల కోసం వందలాది రైతు సంఘాలన్నీ ఒక్క తాటి పైకి రావటం విశేషం. ఈ యాత్ర ఉద్యమ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల రైతులు నవంబర్ 20న ఢిల్లీ చేరుకొని రైతుల సత్తా చాటి తమ హక్కులు సాధించుకోవాలి. నవంబర్ 20న జరగనున్న దేశ రైతుల ఢిల్లీ యాత్ర ప్రధాన డిమాండ్లు : 1. రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేయటం 2. పంట ఖర్చుపై 50% అదనంగా గిట్టుబాటు ధర కల్పించటం.
వ్యాసకర్త రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి
మొబైల్ : 99488 97734
Comments
Please login to add a commentAdd a comment