తప్పుడు నిర్ణయాలతోనే తిప్పలు పుల్వామాలో మన కేంద్రీయ రిజర్వ్ పోలీసు దళం జవాన్లు 40 మందిని బలిగొన్న టెర్రరిజం భూతానికి మూలాలు కనుగొని దాన్ని కూకటివేళ్లతో సహా పెరికివేయడానికి మార్గాలు వెతకవలసిన రోజులివి. భయంకరమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి విధ్వంసం సృష్టించే అవకాశాలున్నాయని జమ్మూకశ్మీర్ పోలీసులు ఫిబ్రవరి 8న హెచ్చరిక జారీ చేశారు. ‘మీరు వెళ్లే రోడ్డును పేలుడు పదార్థాలను పూర్తిగా ఏరిపారేసి శుధ్ధి చేయండి. ఎందుకంటే పేలుడు పదార్థాలు వాడే అవకాశాలున్నట్టు మాకు సమాచారం అందింది. చాలా అర్జంట్ విషయం’ అని జనరల్ పోల్ కశ్మీర్ జోన్ వారు పీసీఆర్ కశ్మీర్ ద్వారా సమాచారం పంపారు.
ఈ సమాచారం ముందే అందినా ఈ దారుణాన్ని ఎందుకు నివారించలేకపోయారు? 2,500 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించే మార్గంలోకి ఆ వ్యాన్ ఎలా రాగలిగింది? దాన్ని అడ్డుకోలేకపోయారా? అసలు చెక్‌పోస్ట్‌లే లేవా? పోనీ లేవనే అనుకుందాం. వేలాదిమంది జవాన్లను రోడ్ మార్గం ద్వారా తరలించే ముందు సెక్యూరిటీ కోసం అప్పుడైనా చెక్ చేయరా? జమ్మూ శ్రీనగర్ హైవేలో ఆర్‌డీఎక్స్ నింపిన వాహనాలను చెక్ చేయడానికి మూడు చోట్ల బారి యర్లు ఉండేవి. కానీ ఈ బారియర్లను మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో నడిచిన సంకీర్ణ ప్రభుత్వం తొలగించిందని, అందుకే పుల్వామా జవాన్లమీద దాడిచేసిన వాహనాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారని జేఎన్‌యూలో లా గవర్నెన్స్ అండ్ డిజాస్టర్ స్టడీస్ ప్రొఫెసర్ అమితా సింగ్ విమర్శిం చారు. ఆయనపై ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతకుముం దున్న బారియర్లను తొలగించారా లేదా అన్నది ప్రశ్న. తొలగిస్తే ఎందుకో చెప్పాలి. తొలగించకపోతే ఆ విషయం రూఢీగా చెప్పాలి. కానీ ప్రొఫెసర్‌ను దుర్భాషలాడి ఏం ప్రయోజనం? మేజర్ జనరల్ (రిటైర్డ్) జీడీ బక్షీ ఒక టీవీ చర్చలో పాల్గొంటూ ఆ రోడ్ మీద చెక్‌పోస్టులను, బారియర్లను ముఫ్తీ ఆదేశాలవల్ల తొలగించారని చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. అక్కడ బారియర్లను తొలగించడం వల్లనే ఉగ్రవాద దాడి జరిగిందని, దీనికి ఎవరు బాధ్యులని ఆయన తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.
పాలనాపరమైన నిర్లక్ష్యాల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల టెర్రరిస్టు ఘాతుకాలు ఆపగలిగి కూడా ఆపలేకపోతున్నారేమోనని ఈ రెండు వాదాలు విన్న తరువాత జనం అనుమానించవలసి వస్తుంది. ఫిబ్రవరి 16న సుబ్రమణ్య∙స్వామి ఒక ట్వీట్ చేశారు. ‘‘2014లో ఒక మారుతీ కార్ మూడు చెక్ పాయింట్లను దాటుకుని దూసుకు పోయిందని, ఆ కారుపైన కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్లను ప్రాసిక్యూట్ చేయడానికి ఎవరు అనుమతించారు? ఆ ఉత్తర్వు ఇచ్చిన వ్యక్తి జవాన్ల మరణానికి బాధ్యత వహించాలి. ఆ ఆర్మీ జవాన్లు ఇంకా జైల్లో ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు. ఇండియా టుడే వారి ఫేక్ న్యూస్ వ్యతిరేక వార్ రూం విభాగం వారు ఇందులో నిజానిజాలను పరిశోధించారు. బక్షీ చెప్పిన సంఘటన నవంబర్ 3, 2014 ఛట్టెర్గాం (బుద్గాం జిల్లా)లో జరిగింది. అయిదుగురు యువకులు ప్రయాణిస్తుండగా కాల్పులు జరిగాయనీ, 53వ రాష్ట్రీయ రైఫిల్ మెన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారనీ, ఈ సంఘటనపై భిన్నవాదాలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని ఉటంకిస్తూ ఇండియా టుడే వివరించింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నారని పీడీపీ అధికారంలోకి ఇంకా రాలేదని వివరించారు. కాల్పులు జరిపిన వారిపై చడూరా పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 231 – 2014లో నమోదయింది. ఆర్మీ అధికారులు కూడా కాల్పులు జరపడం పొరబాటే అని అంగీకరించారు. 9 మంది సైనికులమీద కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీలో ప్రాసిక్యూషన్ ప్రారంభించారు. కానీ ఎవరినీ జైలుకు పంపలేదు. ఈ విషయాన్ని బక్షీకి తెలియజేస్తే, ఆయనకూడా పొరబాటు తెలుసుకున్నారని తేలింది.
అయినా íపీడీపీ ప్రభుత్వం సెక్యూరిటీ చెకింగ్‌ను సడ లించడం వల్లనే కశ్మీర్ లోయలో కల్లోల సంఘటన జరిగిందని బక్షీ విమర్శించారు. తప్పుడు వార్తలను ఖండించి నిజానిజాలు తెలియజేయడం గొప్ప సేవ. టీవీ చర్చల్లో, ట్వీట్ వ్యాఖ్యల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. సెక్యూరిటీ చెక్ నిబంధనలు సడలించడం, బారియర్లు తొలగించడం తప్పుడు నిర్ణయాలు కావా? పేలుడు పదార్థాలు నింపుకున్న వాహనం సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొనడం నిజం, అందాకా ఆ వాహనాన్ని ఎవరూ చెక్ చేయలేదనేది నిజం. వేలాది మంది జవాన్లను తరలించడానికి రోడ్డు దారి భద్రం కాదని, హెలికాప్టర్ల ద్వారా పంపాలని కోరినా నిరాకరించడం కూడా నిజం. నిజానిజాలను పరిశోధించాల్సిన బాధ్యత, నిజాలను జనం ముందుంచాల్సిన బాధ్యత లేదా? పాలనా వైఫల్యాలు, తప్పుడు నిర్ణయాలు ఎంతటి దారుణాని కైనా దారితీస్తాయి. తప్పుడు వార్తలు ఆ దారుణాలను ఇంకా మండిస్తాయి.
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment