సమాచారం ఎవరి సొంతం? | madabhushi sridhar writes on rti act | Sakshi
Sakshi News home page

సమాచారం ఎవరి సొంతం?

Published Fri, Nov 24 2017 1:33 AM | Last Updated on Fri, Nov 24 2017 1:33 AM

madabhushi sridhar writes on rti act - Sakshi

ప్రభుత్వ నిధులు, ఇళ్లు, ఇతర సహాయాలను ఇస్తున్నప్పుడు పూర్తి సమాచారం ఇవ్వకపోతే ఆ రహస్యాల చీకటి వెనుక అవినీతి పెరిగిపోయే వీలు ఏర్పడుతుంది. అవినీతిని నిరోధించే చట్టం సమాచార హక్కు చట్టమే.

ఒక పథకం కింద ప్రభుత్వం ఎవరెవరికి ఇళ్లు ఇచ్చింది? వారు ఏ కార్యాలయాలలో పనిచేసేవారు? బ్యాంకు రుణాలు తీసుకున్నవారెవరు? బ్యాంకులతో త్రిపక్ష ఒప్పందం కుదుర్చుకుని వారికి టైటిల్‌ డీడ్‌ ఇచ్చిన వారెవరు? అని డాక్టర్‌ కె. వెంకటరావు గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖను అడిగారు. బ్యాంకుల సమాచారమంతా ఇవ్వడానికి వీల్లేదు కనుక, అవి సిస్టంలో అందుబాటులో సిద్ధంగా ఆ సమాచారం లేదు కనుక సెక్షన్‌ 8(1)(జె) ప్రకారం ఇవ్వజాలమని ప్రజా సమాచార అధికారి తిరస్కరించారు. ఆ నియమాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించడం చెల్లదంటూ వెంకటరావు సమాచార కమిషన్‌ ముందుకు వచ్చారు. 

సమాచారం అందుబాటులో లేదని అనడం కూడా విచిత్రమైన జవాబు. ఇళ్లు కేటాయించడం, వాయిదాల్లో డబ్బు వసూలు చేయడం, అప్పులు ఇవ్వడం, ఆ వివాదాలు కుదర్చడం మొదలైన వాటికి సంబంధించిన ఫైళ్లు, రికార్డులు లేకుండా ఉండడం సాధ్యమా? కొన్ని శాశ్వత రికార్డులు నిర్వహించడం అవసరం కాదా? ఆర్టీఐ కింద అడిగిన అంశాలలో ఏది వ్యక్తిగతం, ఏది ఇవ్వడానికి వీలైన అంశం అని ఆలోచించినట్టు కనిపించదు.  పార్లమెంట్‌ లేదా శాసనసభలు అడిగితే కాదనడానికి వీల్లేని సమాచారాన్ని ఆర్టీఐ కింద అడిగితే ఇవ్వాలని సెక్షన్‌ 8 కింద మినహాయింపులకు వర్తించే ఒక నియమం ఉందని దాన్ని అమలు చేయాలని అనిల్‌ కుమార్‌ వర్సెస్‌ డీఓపీటీæ కేసులో సీఐసీ 2006లో (CIC Appeal  No. 76/IC/ (A)/2006) లో వివరించింది. 

ఇంటికోసం వెంకటరావు కొంత అప్పు చేశారు. బ్యాంకుతో, ప్రభుత్వ సంస్థతో త్రిపక్ష ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు బ్యాంకుకు దరఖాస్తుదారు ఇంటి యాజమాన్య ధ్రువపత్రం టైటిల్‌ డీడ్‌ను పూచీకత్తు కింద బ్యాంకుకు ప్రభుత్వ విభాగం ఇవ్వాలి. కానీ అడ్మినిస్ట్రేటర్‌ బ్యాంకుకు ఆ టైటిల్‌ డీడ్‌ ఇవ్వకుండా అక్రమంగా జి. నిర్మల అనే ఒక మహిళ (తమిళనాడులోని ఏసీపీ గారి భార్య)కు ఇచ్చారని, దీని వల్ల తాను అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చిందని, తన ఇంటిని తాను సాధించడానికి నానా తంటాలు పడవలసి వచ్చిం దని వెంకటరావు వివరించారు. తనకు ఏ సమాచారమూ ఇవ్వవద్దని అధికారులమీద ఒత్తిడి తెచ్చారని, అందుకే పీఐఓ మొదటి అప్పీలు అధికారి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. 

దరఖాస్తుదారుడు ఈ కేసులో మొత్తం ఇళ్లు పొందిన వారి పేర్లు, వారి రుణాలు, బ్యాంకుల పేర్లు, టైటిల్‌ డీడ్స్‌ అడిగినప్పటికీ తన ఇంటి కేటాయింపు చెల్లింపులకు సంబంధించిన దస్తావేజు ఆయన పరిశీలనకు ఇచ్చినా, అందులో ఆయనకు కావలసిన పత్రాల ప్రతులను ఇచ్చినా సరిపోయేది. రెండో అప్పీలును సాధారణంగా కమిషన్‌ వీడియో అనుసంధానం ద్వారా విచారిస్తుంది. ఈ కేసు విషయంలో బెంగళూరులో ఉన్న అప్పీలుదారును ఢిల్లీకి రమ్మని నోటీసులు ఇచ్చారు. తాను రాలేనని, మరో తేదీన విచారించాలని, లేదా వీడియో సంధానం చేయాలని ఆయన కోరాడు. కానీ ఆ విషయం పట్టించుకోకుండా, విచారణ ముగించి కేంద్ర సమాచార కమిషన్‌ సమాచారం ఇవ్వరాదనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం న్యాయం కాదంటూ వెంకటరావు హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌ను స్వీకరించి, వెంకటరావు సమాచార అభ్యర్థనను పునఃపరిశీలించాలని కమిషన్‌కు పంపించారు. 

కేంద్ర మంత్రిత్వ శాఖ పేరులోనే గృహ నిర్మాణ పట్టణ పేదరిక నిర్మూలన అనే సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ అని ఉంది. ఎవరెవరికి ఇళ్లు ఇచ్చారు, ఎందరు రుణాలు తీసుకున్నారు, వారి టైటిల్‌ డీడ్స్‌ బ్యాంకులకు ఇచ్చారా లేదా అనే అంశాలలో ఎవరి సొంత సమాచారం ఉందో, ఆ వివరాలు ఇస్తే ఎవరి ప్రైవసీ గుట్టు రట్టు అవుతుందో వివరించే బాధ్యత ప్రభుత్వ సమాచార అధికారిపైన ఉంది. 

ప్రభుత్వ నిధులు, ఇళ్లు, ఇతర సహాయాలను ఇస్తున్నప్పుడు పూర్తి సమాచారం ఇవ్వకపోతే ఆ రహస్యాల చీకటి వెనుక అవినీతి పెరిగిపోయే వీలు ఏర్పడుతుంది. అవినీతిని నిరోధించే చట్టం ఏదయినా ఉంటే అది సమాచార హక్కు చట్టమే. ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని పూర్తిగా బహిర్గతం చేస్తే అక్రమాలు జరగవనడానికి ఈ కేసే ఒక ఉదాహరణ. ఆ కేసులో జరిగిన అక్రమాలను దాచడానికే సమాచారం దాస్తున్నారనే ఆరోపణలు కూడా అప్పుడే వస్తాయి. టైటిల్‌ డీడ్‌ కూడా ప్రయివేటు పత్రం కాదు. రిజిస్టర్‌ చేసిన టైటిల్‌ ఆస్తి మార్పిడికి సాక్ష్యం. అది రహస్యంగా ఉండే అవకాశమేలేదు. ఆ సమాచారం ఇవ్వాలని, నిరాకరించినందుకు సంజాయిషీ ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించింది.

(డాక్టర్‌ కె. వెంకటరావు, వర్సెస్‌ గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ CIC/KY/A/2014/901399 కేసులో 17 నవంబర్‌ 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా)

మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement