వరానిదేముందీ, నేను కాకపోతే దేవుడు అనుగ్రహిస్తాడు. వరాన్ని అందుకునే చేతులకే.. శక్తి ఉండాలి. శక్తి లేకపోతే వరమిచ్చిన దేవుడు గానీ, ఈ రామ్‌దేవ్ బాబా గానీ వరాన్ని వెనక్కు తీసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
వరం అందుకోడానికి చేతులకు మాత్రమే శక్తి ఉంటే సరిపోదు. అది వరం అని గుర్తించే మనోశక్తి కూడా ఉండాలి. ఎందరికి ఉంది ఈ దేశంలో వరాన్ని గుర్తించే మనోశక్తి.
వరం.. ‘మేడ్ బై దేవుడు’ అని ప్యాక్ మీద ఉన్నా, దేవుడి వరానికి అమెరికా వాళ్ల ఎఫ్.డి.ఎ. ఆమోదం ఉందా అని చూస్తారు. దేవుడిచ్చిన వరం జనంలోకి వెళ్లడానికి తిప్పలు పడటంలో అసహజం ఏమీ లేదు. ఆయన ఎక్కడో పైన ఉంటాడు. కింద ఉండే ఈ రామ్‌దేవ్‌కి కూడా ఇన్ని తిప్పలేమిటి చిన్న మెడిసిన్‌ని వరంలా విక్రయించుకోడానికి!
మూడు నెలలుగా ఎవరూ ఖాళీగా లేరు. ఎవరికి తోచిన వరాన్ని వారు ప్రసాదించే పనిలో ఉన్నారు. మాస్కుల వరం, పాలూ పండ్లూ కూరగాయల వరం, ఉడకేసిన బియ్యం వరం, ఉప్మా ప్యాకెట్‌ల వరం, టికెట్‌లు తీసి బస్సులు, రైళ్లు ఎక్కించే వరం.. ఇలా వరాలిచ్చే వారితో ఈ భూమి నిండి పోయింది. ఇక వరాలు తీసుకునేవారికి చోటెక్కడ ఉంటుంది?!
ఆచార్య బాలకృష్ణ వచ్చి కూర్చున్నాడు.
‘‘వరాలు ఎక్కువై ఈ మూర్ఖపు జనులకు వరం విలువ తెలియకుండా పోయింది బాబాజీ. మన కరోనిల్ కిట్‌లను ఐదు వందల నలభై ఐదు రూపాయలకే వరంగా ఇస్తున్నా ఎవరూ చెయ్యి పట్టడం లేదు. ఎవరైనా వరానికి ధరేంటని అనుమానంగా చూస్తారు. వీళ్లు వరాన్నే అనుమానంగా చూస్తున్నారు’’ అన్నాడు. అతడి చేతిలో కరోనిల్ కిట్ ఉంది. దానిని నా చేతుల్లోకి తీసుకున్నాను.
‘‘కోరుకోని వరం లభిస్తే ఎవరైనా ఆనందించకుండా ఎలా ఉండగలరో అర్థం కావడం లేదు ఆచార్యా’’ అన్నాను.
అర్థం కావడం లేదని ఆచార్యతో అన్నాను కానీ, బొత్తిగా అర్థం కాకుండా ఏమీ లేదు. కోరుకోని వరం కోరుకున్న చోటు నుంచి రావాలని వీళ్లంతా కోరుకుంటున్నారు. వీళ్లకు రెమ్‌డెసివిర్ కావాలి. రామ్‌దేవ్‌బాబా వద్దు.
‘‘ఆచార్యా.. మన కిట్‌ల మీద ‘టెస్టెడ్ అండ్ వెరిఫైడ్ ఫ్రం పతంజలి’ అని కాకుండా.. ‘అప్రూవ్డ్ బై.. ఎఫ్.డి.ఎ.’ అని వేయించడానికి వీలవుతుందా?’’ అని అడిగాను.
‘‘రెండు విధాలుగా వీలుకాకపోవచ్చు’’ అన్నాడు!
వీలుకాకపోవడం అన్నది ఒక విధంగా వీలు కాకపోయినా, రెండు విధాలుగా వీలుకాక పోయినా.. చివరికి వీలు కాకపోవడం ఒక్కటే మిగులుతుంది.
‘‘వీలయ్యే విధానాలు ఏమైనా ఉంటే చెప్పండి ఆచార్యా..’’ అని అడిగాను.
‘‘వీలు కాని విధాలను కొట్టేసుకుంటూ పోతే, వీలయ్యే విధానం ఎక్కడైనా పట్టుబడొచ్చు బాబాజీ’’ అన్నాడు.
నా సహచరుడు అతడు. ఆయుర్వేద ఆచార్యుడు. నేను హర్యానా నుంచి వస్తే, అతడు హరిద్వార్ నుంచి వచ్చాడు. నాది యోగా, అతడిది ఫార్మసీ. అతడు శుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని శాలువాగా కప్పుకుని కుర్చీలో ఆసీనుడై ఒక చేత్తో పుస్తకాన్ని, ఒక చేత్తో బాల్ పెన్ను పెట్టుకుని ఉంటే çపరిశోధనావస్థలో ఉండే యోగీశ్వరుడిలా ఉంటాడు.
‘‘వీలవని ఆ రెండు విధానాలేమిటి ఆచార్యా..’’ అని అడిగాను.
ఆచార్య బాలకృష్ణ మాట్లాడలేదు.
‘‘చెప్పండి.. ఆచార్యా..’’ అన్నాను.
‘‘వీలవనివి తెలుస్తూ ఉండి, వీలయ్యేవి ఏవో తెలియనప్పుడు.. వీలయ్యేవి ఏమిటో ముందు తెలుసుకుని అప్పుడు వీలవని వాటిని కొట్టేసుకుంటూ పోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను బాబాజీ’’ అన్నాడు!!
తెలియని ఆసనమేదో తెలియకుండా పడిపోయినట్లనిపించింది.
రామ్‌దేవ్ బాబా (యోగా గురువు) రాయని డైరీ
Published Sun, Jun 28 2020 12:54 AM | Last Updated on Sun, Jun 28 2020 9:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment