విశ్లేషణ
దశాబ్దికి ముందే ఆ వంతెన తట్టుకోగల సామర్ధ్యాన్ని మించి రద్దీ పెరిగిపోయింది. అయినా, విశాలమైన వంతెన గురించి 2015లో గాని ఆలోచించలేదు. ఇలాంటి దుర్ఘటన సంభవించవచ్చని అధికారుల కంటే ముందుగా ప్రజలు పసిగట్టారు.
ముంబైలోని ఎలిఫిన్‌స్టన్ స్టేషన్ కాలి నడక వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మన ప్రణాళికా రచన, నిర్వహణలను గుర్రానికి ముందు బండిని కట్టడమనే రుగ్మత పట్టి పీడిస్తోంది. అందుకు ఈ దుర్ఘటనే సాక్ష్యం. మూతపడ్డ జౌళి మిల్లుల స్థానంలో కొత్త వాణిజ్య ప్రాంతం ఆవిర్భావంతో ఆ దగ్గరలోని లోయర్ పరెల్, ఎలిఫిన్‌స్టన్ స్టేషన్లలో తొక్కిసలాటలు పెరుగుతాయని అందరికీ తెలిసిందే. ముంబై వాసులు, ఎవరికి వారే బతుకు తెరువు పోరాటంలో మునిగి ఉంటారు. కాబట్టి అది లేదని, ఇది కావాలని ఫిర్యాదు చెయ్యరు, కావాలని కోరరు. అంతేకాదు, బహిరంగ ప్రదేశాలన్నీ కిక్కిరిసి పోయి ఉండటం సహా అన్ని రంగాలలోని అధ్వాన నిర్వహణకు వారు అలవాటు పడిపోయారనేది కూడా వాస్తవమే. అంతమాత్రాన, రానున్న సంక్షోభాన్ని లేదా సంక్షోభం తలెత్తే పరిస్థితులను పరిష్కరించకపోవడానికి అది సంజాయిషీ కాజాలదు.
ప్రభుత్వ విధానాన్ని, మునిసిపల్ చట్టాలను అనుసరించి మూతపడ్డ మిల్లుల భూములను పునర్వినియోగించడం రెండు దశాబ్దాలుగా జరుగుతోంది. దశాబ్దికి ముందే ఆ వంతెన తట్టుకోగల సామర్థ్యాన్ని మించి రద్దీ పెరిగింది. మరింత విశాలమైన వంతెన గురించి 2015లో గాని ఆలోచన మొదలెట్టలేదు. అధికారులకంటే ఎంతో ముందుగా ఆ వంతెనను ఉపయోగించే వారు ఇలాంటి దుర్ఘటన సంభవించవచ్చని పసిగట్టారు. ఆవిర్భవిస్తున్న ఆ నూతన వాణిజ్య ప్రాంతంలోకి ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి అవసరమైన సదుపాయాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఆ స్థితికి తగ్గట్టుగా గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ మిల్లు భూములలో అసాధారణ వేగంతో పెంపొందుతున్న రియల్ ఎస్టేట్ వృద్ధిని నియంత్రించి ఉండాల్సింది. మిల్లు యజమానులు, బిల్డర్–డెవలపర్‌ల లాబీ, అధికార యంత్రాంగం, రాజకీయ ప్రయోజనాలు భూమి పునర్వినియోగం వేగంగా పెరగడాన్ని ప్రేరేపించారు. స్టేషన్ల వద్ద ప్రయాణీకుల రద్దీ పెరుగుతుండటాన్ని చూసి రైల్వే అధికారులు తదనుగుణంగా ప్రణాళికలను ప్రారంభించాల్సింది. వారు కళ్లు మూసుకున్నారు. లోయర్ పరెల్, ఎలిఫిన్‌స్టన్ స్టేషన్ల విషయంలో రెండు పెద్ద అధికార సంస్థల మధ్య తీవ్ర సమన్వయ లోపం ఉంది.
రైల్వే అధికారులు హఠాత్తుగా ఇప్పుడు మేల్కొని ఎంతో కాలంగా అవసరమైన పలు సదుపాయాలకు ప్రణాళికలను రూపొందించడం మొదలెట్టారు. నిర్ణయాధికారాలను దిగువ స్థాయిలకు వికేంద్రీకరించి. వాటి అమలుకు నిర్ణీత కాల వ్యవధులను నిర్ణయించారు. సదుపాయాలపై దృష్టిని కేంద్రీకరించగలిగేలా ఎగువ నుంచి పోయే రైల్వే లైన్ల వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రాధాన్యాలను తర్వాతికి మార్చారు. ఏమైతేనేం కుంభకర్ణుడు నిద్రలేచాడు. అయితే మధ్యలోనే తిరిగి ఆవలించడం మొదలెడతాడేమో ఎవరికీ తెలియదు. లోకల్ రైల్వే వ్యవస్థలోని రైళ్ల సంఖ్యను, ప్రయాణికులను చేరవేయగల వాటి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి కృషి నిస్సందేహంగా ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కాకపోతే, కోర్టులు ఆదేశించిన్పప్పుడే మౌలిక సదుపాయాలు కార్య రూపం ధరిస్తున్నాయి. న్యాయ జోక్యమే లేకపోతే ప్లాట్‌ఫారాలకు, బోగీలకు మ«ధ్య అంతరం సమస్యను పట్టించుకునే వారే కారు. మరిన్ని అదనపు బోగీలను చేర్చడానికి వీలుగా పొడిగించిన ప్లాట్‌ఫారాలకు పై కప్పు లేకపోవడం వానాకాలం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
ప్రభుత్వ ఛత్రం కింద పనిచేసే సంస్థలన్నిటికీ పెంపొందే అవసరాల వృద్ధి వల్ల తలెత్తే సమస్యలకు అనుగుణంగా ప్రణాళికలను మొదలెట్టగల ఊహాత్మకత కొరవడింది. ప్రణాళికావేత్తల, నిర్వాహకుల చేతుల్లో ఉందని అనే లోగానే మనలాంటి దేశాల్లో సప్లయ్, డిమాండ్‌ని మించి పోతుంది. పాతవాటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేంతగా రద్దీ పెరిగిపోయినప్పుడే కొత్త విమానాశ్రయాలకు ప్రణాళికలను రచిస్తున్నారు. అధికార యంత్రాంగంలో కాలయాపన, సోమరితనం రివాజుగా మారాయి. ఎలాంటి లోటుపాట్లనైనా పంటి బిగువున భరించడానికి ప్రజలు చూపే సుముఖతే సోమరితనం చూపే దోషులకు రక్షణ అవుతోంది.
చిన్న, విస్తరిస్తున్న పట్టణాలకు ఆనుకుని ఉన్న పంట భూములను ఇళ్ల నిర్మాణం కోసం ప్లాట్లు వేయడాన్ని, ఆ ప్రాంతం అంతా సమాధి రాళ్ల సముద్రంలా అనిపించడాన్ని మనం చూడలేదా? రోడ్లు, నీరు, పారిశుద్ధ్యం వంటి సేవలను అరకొరగా అందించడానికి సైతం పౌర సంస్థలు మహా మందకొడిగా కదులుతుంటాయి. సదుపాయాలను కల్పించలేనప్పడు నిర్మాణాలకు ఎందుకు అనుమతులను జారీ చేయాలి? లేక ఆవి పూర్తి అయ్యే వరకు ఆలస్యం చేయాలా? లోయర్ పరెల్–ఎలిఫిన్‌స్టన్ ప్రాంతం ఏదో ఒంటరి ఉదాహరణ కాదు. శిథిలమౌతున్న పాత ఆక్రమణలు లేదా తక్కువ ఎత్తు భవనాలు, శతాబ్దం క్రితం ప్రణాళికలు రూపొందించి, నిర్మించినప్పుడు సరిపడేవే అయినా ఇప్పుడు ఇరుగ్గా మారిన రహదారులను ఆకాశహర్మ్యాలుగా పునరాభివృద్ధి చేయడాన్ని అనుమతించారు. కానీ పౌర సదుపాయాల సరఫరా మాత్రం విస్తరింపజేయలేదు. అవే రోడ్లు, అవే నీటి పైపులైన్లు, కాలువలు ఈ పెరిగిన డిమాండును తట్టుకోగలవని ఆశిస్తారు.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మహేష్ విజాపృకర్
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com