ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభంజనాల్లో న్యూ సౌత్ వేల్స్ లోని కేప్ ఫియర్ ఒకటి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశం నలుమూలల్లో ఆవరించిన మోదీ ప్రభంజనాన్ని మాత్రమే దీనితో సరిపోల్చవచ్చు. నరేంద్రమోదీ, అమిత్ షాల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా యావత్ ప్రతిపక్షం పొందిన అనుభవం ఈ ప్రభంజనాన్ని నా కంటే బాగా వర్ణిస్తుంది. బీజేపీ ద్వయం చేతుల్లో ప్రతిపక్షం అక్షరాలా ఊచకోతకు గురైంది. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి ప్రాంతీయ దిగ్గజ నేతలు సైతం మోదీ కెమిస్ట్రీలో తేలిపోయారు. 80 పార్లమెంటు స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని 20 స్థానాలకు పరిమితం చేసినట్లయితే తమ కూటమికి విజయం దక్కినట్లేనని అఖిలేష్, మాయావతి భావించారు. కానీ తాజా ఫలి తాల బట్టి యూపీలో దాదాపు 61 స్థానాల్లో గెలుపు సాధించనున్న బీజేపీ (46 గెలుపు, 15 ఆధిక్యం) మహాఘట్ బంధన్ పనిచేయలేదని తేల్చేసింది. అఖి లేష్, మాయావతి, అజిత్ సింగ్ లోక్‌దళ్‌తో కూడిన మహాకూటమి బీజేపీని జాట్ ఓటర్లు తోసిపుచ్చుతారని బలంగా నమ్మారు. కానీ అలా జరగలేదు. నిజానికి ఉత్తరప్రదేశ్‌లో తాను కూడగట్టిన కుల సమీకరణాలను బీజేపీ నిలుపుకోవడమే కాదు. అదనపు ఓట్లను కూడా సాధించింది.
మాయావతి కుల ఓట్లుగా తమపై ముద్రవేయడాన్ని ఈ ఎన్నికల్లో యూపీ ఓటర్ సహించలేదు. యూపీలో మాయావతి బేరసారాల రాజకీయాలకు మారుపేరు అని అందరికీ తెలుసు. తానెవరితో జట్టు కడితే వారికి తన దళిత ఓట్లను బదలాయించగలనని ఆమె ప్రగాఢ విశ్వాసం. కానీ అది కూడా ఈసారి పనిచేయలేదు. తాను పోటీచేసిన 27 స్థానాల్లో 12 సీట్లలో ఆమె ఆధిక్యతలో ఉండవచ్చు కానీ ఆమె కులానికి చెందిన జాతవ్ ఓట్లను మినహాయిస్తే, యూపీలో ఇతర దళితుల ఓట్లను ఆకర్షించడంలో బీజేపీ ఈసారి విజయం సాధించింది. ఇక అఖిలేష్ పరిస్థితి మరీ ఘోరం. 2014లో మాదిరే తన కుటుంబ కంచుకోటల్లో కేవలం ఏడుస్థానాల్లో మాత్రమే అఖిలేష్ ఆధిక్యతలో ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రధాని పదవిపై మాయావతి పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. యూపీలో కూటమి కొనసాగుతుందనుకుంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దానికి కష్టకాలం తప్పదనిపిస్తుంది.
ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ మోదీ వర్సెస్ ప్రత్యర్థి ఎవరు అనే కొలమానంతో చాలా తెలివిగా ముందుకెళ్లింది. ఇది అధ్యక్ష తరహా ఎన్నికల ప్రచార శైలి. ఈ వ్యూహం ముందు రాహుల్ గాంధీ ప్రతిరోజూ కుంచిం చుకుపోతూ వచ్చారు. ఈ తరహా ప్రచారంలోని ప్రమాదాన్ని రాహుల్ పసిగట్టారు కానీ చౌకీదార్ చోర్ హై (కాపలాదారే దొంగ) అంటూ రఫేల్ అవినీతిని పూర్తిగా వ్యక్తిగత స్థాయికి తీసుకుపోయారు. తనపై సాగుతున్న ఈ వ్యక్తిగత దాడిని మోదీ అందిపుచ్చుకుని తన మంత్రిమండలిని, బీజేపీనీ, దాని మద్దతుదారులందరినీ చౌకీదారులుగా మార్చేశారు.
పుల్వామా, బాలాకోట్ తర్వాత మోదీ జాతీయ భద్రతను ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు. ఘర్ మై ఘుస్ కే మారా (ఓడించడానికి పాకిస్తాన్ లోకే ప్రవేశించాము) అని ప్రకటిస్తూ తన్ను తాను శక్తిమంతుడైన నేతగా ప్రచారంలో పెట్టారు. యూపీలో మోదీ ప్రభంజనానికి హిందూ ఓటరే ప్రధాన కారణం. ముస్లింలకు వ్యతిరేకంగా సమీకృతులైన వీరు మోదీని గుడ్డిగా సమర్థించారు. దానికి తగ్గట్లుగానే మోదీ తన ప్రభుత్వ ఘన విజయాలను, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను ఎత్తి చూపడానికి బదులుగా పాకిస్తాన్‌కి గుణపాఠం చెప్పడం అనే అంశంపైనే కేంద్రీకరించారు. పాకిస్తాన్‌ను రెండు భాగాలు చేసి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి వీలుకల్పించిన తన ఘనతను ఇందిరాగాంధీ 1971 ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న స్థాయిలో మోదీ ముందుకెళ్లారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో కీలకాంశం మోదీనే. 2014లో ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మోదీ తన కలల తీర్పును ప్రజలముందు పెట్టారు. సాధించుకున్నారు కూడా.
గత డిసెంబరులో హిందీ ప్రాబల్య ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. రాష్ట్ర ఎన్నికలకు, జాతీయ ఎన్నికలకు ఇవ్వాల్సిన తీర్పు విషయంలో ఓటరు చాలా స్పష్టమైన వైఖరిని కలిగి ఉన్నట్లుంది. ఉదా.కు రాజస్థాన్‌లో ఓటరు నమ్మిన నినాదం ఒక్కటే. ‘‘వసుంధరా రాజే నిన్ను భరించలేం... కానీ మోదీతో మాకెలాంటి శత్రుత్వమూ లేదు’’ ఇది ఎంత ప్రభావం వేసిందంటే రాజస్తాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, కమల్‌నాథ్‌లకు పీడకలను మిగిల్చింది.
ఈ క్రమంలోనే బీజేపీ 2014లో తాను సాధించిన స్థానాలను నిలబెట్టుకోవడమే కాదు పశ్చిమ బెంగాల్ వంటి తనకు ప్రవేశమే లేని రాష్ట్రాల్లోను అది ఘనవిజయాన్ని నమోదు చేసింది. తన ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన మమతా బెనర్జీ కంచుకోటలో బీజేపీ డబుల్ డిజిట్ సాధించేలా ఉంది. ఒడిశాలో కూడా ఇదే కథ కొనసాగి బీజేపీ అక్కడ కూడా ప్రవేశించింది కానీ నవీన్ పట్నాయక్ చాలా గట్టి పోటీని ఇచ్చారు. మోదీ ప్రభావాన్ని తట్టుకుని నిలిచిన ఏకైక రాష్ట్రం ఉత్తరాదిలో పంజాబ్ మాత్రమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మోదీని ఎదురొడ్డి నిలిచిన చివరి జనరల్‌గా నిలిచిపోయారు. ఇక అమిత్ షా నియమించిన ఈశాన్య ప్రాంత ఇన్‌చార్జి హిమంత బిశ్వా శర్మ బీజేపీ ఆధిపత్యాన్ని నిలబెట్టారు. ఇక అనితర సాధ్యమైన విజయంతో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్‌మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ తప్పుడు పంథాను సమర్థవంతంగా మరోసారి నిరూపించారు.
కానీ రాహుల్ గాంధీని ఈరోజు మరీ అంత తేలిగ్గా తీసిపారేయవలసిన పనిలేదు. ఈ ఎన్నికల్లో తాను నిజం గానే చాలా కష్టపడి పనిచేశారు కానీ అమేథీలో తన సొంత స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఈ మొత్తం పరిణామాలను చూసిన తర్వాత ఒక విషయం మనకు స్పష్టంగా బోధపడుతోంది. మనం మళ్లీ ఏకపార్టీ పాలనవైపుకు తిరిగిపోయాం కానీ రాజవంశాల పాలనకు తావులేదన్నదే నేటి వాస్తవం. నవభారత ఓటరును అయిదో తరం గాంధీ వంశం ఆకర్షించలేకపోయింది. నూతన తరం ఓటర్లకు తమవైన ఆకాంక్షలంటే ఇష్టం. వాటిని సాధించుకునే మార్గంలో నడవడం కూడా వారికి అంతే ఇష్టం.
స్వాతి చతుర్వేది
వ్యాసకర్త రచయిత, జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment