చరిత్ర సారాంశంతో సంభాషణ | Nobel winner Kazuo Ishiguro from Nagasaki | Sakshi
Sakshi News home page

చరిత్ర సారాంశంతో సంభాషణ

Published Fri, Oct 6 2017 1:30 AM | Last Updated on Fri, Oct 6 2017 1:30 AM

Nobel winner Kazuo Ishiguro from Nagasaki

సాహిత్యంలో నోబెల్‌ విజేత కజువో ఇషిగురో

చరిత్ర గమనంలో ఎదురయ్యే ఘటనలలో మన మనసుకు నచ్చేవి ఉంటాయి. అనిష్టమైనవీ ఉంటాయి. కానీ రెంటినీ మానవాళే పోషిస్తూ ఉంటుంది. చాలా మలుపులలో వారి ఇష్టాయిష్టాలు అప్రస్తుతమైపోతాయి.

భూగోళం మీద అణుబాంబు సృష్టించిన విధ్వంసాన్ని తొలిసారి చూసిన నేల నాగసాకిలో ఆయన పుట్టి పెరి గారు. ఈ సంవత్సరం నోబెల్‌ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ ఆయన తన రచనలలో అణుబాంబు విస్ఫోటనం గురించి చెప్పరు. బాహ్య ప్రపంచానికీ, దాని మీద అంతరంగంలో మనిషి చేసే ఆలోచనలకీ మధ్య ఉన్న అగాధాన్ని ఆవిష్కరిస్తారు. ఆయనే కజువో ఇషిగురో. పోటీలో ఉన్న గూగీ వా థియాంగ్‌ (‘మట్టికాళ్ల మహారాక్షసి’ నవలాకారుడు), మార్గరెట్‌ అట్‌వుడ్‌ (కెనడా రచయిత్రి), హరుకీ మురాకమి (జపాన్‌ కవి)లను కాదని ఈ ఏటి పురస్కారం ఇషిగురోను వరించింది.

పాశ్చాత్య సాహితీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే మ్యాన్‌ బుకర్‌ను 4 సార్లు స్వీకరిం చారు ఇషిగురో. జేన్‌ ఆస్టిన్, ఫ్రాంజ్‌ కాఫ్కాల సృజన శైలులను కలిపి, దానికి మార్సెల్‌ ప్రాస్ట్‌ను అద్దితే అదే ఇషిగురో రచన అవుతుందని అంటారు. దోస్త్‌యేవ్‌స్కీ ప్రభావం కూడా ఆయన మీద ఉంది. ఇష్‌ ఉత్తమ పురుషలో నవల చెప్పడంలో అఖండుడని ఖ్యాతి. ‘ఏ పేల్‌ వ్యూ ఆఫ్‌ హిల్స్‌’, ‘ది అన్‌కన్సోల్డ్‌’, ‘నెవర్‌ లెట్‌ మి గో’, ‘యాన్‌ ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఫ్లోటింగ్‌ వరల్డ్‌’, ‘వెన్‌ వియ్‌ వర్‌ ఆర్ఫన్స్‌’వంటి నవలలన్నింటిని ఆయన ఉత్తమ పురుషులోనే రాశారు. చివరి నవల ‘ది బరీడ్‌ జెయింట్‌’(2015) మాత్రం ఇందుకు భిన్నం. ‘ది ఫ్యామిలీ సప్పర్‌’, ‘ది సమ్మర్‌ ఆఫ్టర్‌ ది వార్‌’మొదలైన కథా సంపుటాలను ప్రచురించారు. ఆయన గీత రచయిత కూడా.

ఉత్తమ పురుషలో నవలను అమోఘంగా నడిపించగల ఇషిగురో రాసినదే–‘ది రిమెయిన్స్‌ ఆఫ్‌ ది డే’. సమకాలీన సమాజంతో, దాని పోకడలతో మనసు చేసే పోరాటాన్నీ, వాటితో రాజీపడే తీరునీ ఇందులో ఎంతో సమర్థంగా అక్షరబద్ధం చేశారు ఇషిగురో. లార్డ్‌ డార్లింగ్టన్‌ హాలులో మూడున్నర దశాబ్దాల పాటు బట్లర్‌గా పనిచేసిన స్టీవెన్స్‌ అనుకోకుండా చేసిన ఆరురోజుల యాత్రలో తన అనుభవాలను గుర్తు చేసుకునే క్రమం ఈ నవలలో ఇతివృత్తం. 1950లలో జరిగే కథాకాలానికి ఆ హాలు డార్లింగ్టన్‌ అధీనంలో లేదు. ఫారడే అనే అమెరికన్‌ ధనవంతుడు దానిని కొనుగోలు చేశాడు. తన వైవాహిక జీవితం సజావుగా లేదంటూ మిస్‌ కెంటన్‌ రాసిన ఉత్తరం అందిన తరువాత ఆమె నివాసం ఉంటున్న కార్న్‌వాల్‌కు బయలుదేరతాడు స్టీవెన్స్‌. మిస్‌ కెంటన్‌ గతంలో డార్లింగ్టన్‌ హాలులోనే పనిచేసేది. స్టీవెన్స్‌ కలల రాణి. కానీ ఈ విషయం ఏనాడూ వ్యక్తం చేయకపోవడంతో ఆమె వేరే వివాహం చేసుకుని వెళ్లిపోయింది. స్టీవెన్స్‌ ఏదో ఆశించి వెళతాడు. ఆ ఉత్తరం అలాంటి ఆశలు రేపింది. కానీ నిరాశకు గురై తిరుగు ప్రయాణమవుతాడు. ఇదే ఇతివృత్తం.

కానీ ఆ బట్లర్‌ జ్ఞాపకాలలో రెండు ప్రపంచ యుద్ధాల మధ్య చరిత్ర, ఇంగ్లిష్‌ సమాజంలోని వైరుధ్యాలు, అపోహలు, భ్రమలు, చారిత్రక తప్పిదాలు.. వంటింట్లో నుంచి పదార్థాల కంటే ముందే వచ్చే ఘాటు వాసనల్లా పాఠకులకు తగులుతూ ఉంటాయి. పాత యజమాని డార్లింగ్టన్‌కి, కొత్త యజమాని ఫారడేకి కూడా స్టీవెన్స్‌ మానసికంగా సుదూరంగా ఉండిపోయాడు. పాత యజమాని కాలంలో విన్‌స్టన్‌ చర్చిల్‌కి, జర్మనీ నుంచి వచ్చిన నాజీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి జాచిమ్‌ వాన్‌ రిబ్బెన్‌ట్రాప్‌కీ కూడా ఆ ఇంట్లో వడ్డించాడు. బ్రిటిష్‌ యూనియన్‌ ఆఫ్‌ ఫాసిస్ట్‌ బృందం నాయకుడు సర్‌ ఆస్వాల్డ్‌ మోస్లే (లేబర్‌ పార్టీ)కు కూడా వడ్డించాడు. డార్లింగ్టన్‌ ఫాసిజం మీద సానుభూతి కలిగి ఉండడం స్టీవెన్‌ను బాధిస్తూ ఉంటుంది. అయినా అదే వినయంతో సేవిస్తూ ఉంటాడు. కొత్త యజమాని వ్యంగ్యోక్తులు కూడా రుచించవు. అయినా స్టీవెన్స్‌ ఏనాడైనా తన ప్రాణం కంటే తన విధినే ఎక్కువ ప్రేమించాడు.

నిజానికి మిస్‌ కెంటన్‌ మీద ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేయకపోవడానికి కారణం కూడా అదే. మిస్‌ కెంటన్‌ను కలుసుకున్నాక ఆమె, ‘నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం ఇంతకంటే ఎంతో బాగుండేది’ అని అంటుంది. కానీ తన భర్తను వదిలి రాదు. తీవ్ర నిరాశతో తిరుగు ప్రయాణమవుతాడు స్టీవెన్స్‌. అంతా నిర్వేదమే. మళ్లీ ఆ నిర్వేదం మధ్యలోనే కొత్త యజమానికి మరింత విశ్వాసంతో పని చేసి మెప్పు పొందాలని తీర్మానించుకుంటాడు. నిజమే, చరిత్ర గమనంలో మనకు ఎదురయ్యే ఘటనలలో మన మనసుకు నచ్చేవి ఉంటాయి. అనిష్టమైనవీ ఉంటాయి. కానీ రెంటినీ మానవాళే పోషిస్తూ ఉంటుంది. చాలా మలుపులలో వారి ఇష్టాయిష్టాలు అప్రస్తుతమైపోతాయి.

ఇషిగురో ఐదో ఏటనే ఇంగ్లండ్‌ వచ్చాడు. అందుకే తన స్వదేశం అంటే అతడికి ఒక సుదూర జ్ఞాపకం. అయినా అతడు తుడిచిపెట్టలేదు. ‘యాన్‌ ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఫ్లోటింగ్‌ వరల్డ్‌’ నవల రెండో ప్రపంచ యుద్ధానంతరం జపాన్‌లో బతికిన ఒక కళాకారుడి మథనను చిత్రించింది. ‘ది బరీడ్‌ జెయింట్‌’ నవలలో ఒక వృద్ధజంట ప్రయాణంతో గతానుభవాలను వర్ణిస్తాడు. వర్తమానానికీ చరి త్రకీ మధ్య విడదీయలేని ఒక బంధం ఉందని ఆయన నిర్ధారిస్తారు. ఇషిగురో తన పాత్రలకు, నిజానికి నవలలకు కూడా ప్రత్యేకమైన ముగింపును ఇవ్వరు. జనం స్మృతిపథం నుంచి పోతున్న కొన్ని వాస్తవాలను చెప్పించడానికే ఆయన వాటిని సృష్టిస్తారని విశ్లేషకులు చెబుతారు. అందుకే ఆయన ప్రతి నవల చరిత్ర చెక్కిలి మీద కన్నీటి చారికను గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఆయన పూర్తిగా చరిత్రనే అంటిపెట్టుకోలేదు. ‘నెవర్‌ లెట్‌ మి గో’ నవల అందుకు సాక్ష్యం. శరీరాంగాలను తీసి అమ్మడానికి ఉద్దేశించిన పిల్లలను సృష్టించే ఒక రాక్షస యుగం వస్తుందని ఈ నవలలో చెబుతారు. ఇది సైన్స్‌ ఫిక్షన్‌. ఫ్యూచరిస్టిక్‌ శైలి కలిగినది కూడా. ‘ది రిమెయిన్స్‌ ఆఫ్‌ ది డే’ కంటే ఇదే గొప్ప నవలని చాలామంది భావిస్తారు.
– సత్యగిరీశ్‌ గోపరాజు

కజువో ఇషిగురో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement