
అటల్ బిహారీ వాజపేయిని అభిమానించని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. భారతదేశ కీర్తిని ఖండాం తరాలకు వ్యాపింప చేసిన మహా నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అటల్జీ. జర్నలిస్టుగా, కవిగా, రచయితగా, ఎడిటర్‌గా, శాంతిదూతగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, ఆధునిక భారతదేశ నిర్మాతగా ప్రతి భారతీ యుడి హృదయంలో తనదైన ముద్రను వేసుకున్న నిజమైన నాయకుడు అటల్జీ. చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌లో చురుకైన పాత్రను పోషిస్తూ.. జనసంఘ్ విస్తరణలో, భారతీయ జనతాపార్టీ విస్తరణలో కీలక పాత్ర వహించారు. తన వాక్పటిమతో నిజాయితీ, నిబద్ధతలతో, వ్యాసాలతో, రచనలతో, కవితలతో, స్నేహంతో లక్షలాది కార్యకర్తలకు మార్గదర్శకుడిగా దిశానిర్దేశకుడిగా ప్రేరణనిచ్చారు.
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ప్రతిపక్షంలో ఉన్న అటల్జీని పంపడం ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం. అలాగే ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించి మన దేశ ఔన్నత్యాన్ని చాటిన నాయకుడు అటల్జీ. చిన్నవయసులోనే భావి ప్రధాని అని నెహ్రూతోనే కితాబు అందుకున్న వ్యక్తి అటల్జీ. ప్రధానులతో, సమకాలీన నేతలతో రాజకీయాలకు అతీతంగా పనిచేసిన నేత.
ప్రధానిగా ఒక్క ఓటుతో పదవీచ్యుతుడైనా, హుందాగా ఓటమిని అంగీకరించి ప్రజాస్వామ్య విలువలను పెంచిన నాయకుడిగా వేనోళ్ళ ప్రశంసలు అందుకున్నారు అటల్జీ. ప్రధానిగా 23 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు నడిపించిన కాంగ్రెస్సేతర ప్రధానిగా చరి త్రలో నిలిచారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బాధ్యతలు చేపట్టి నూతన భారతదేశ ఆవి ష్కరణకు కృషిచేశారు. పొరుగుదేశాలకు స్నేహహస్తం అందించి నూతన విదేశీ విధానానికి తెరలేపారు. కార్గిల్ ద్వారా పాకిస్తాన్‌కి గట్టి సమాధానం చెప్పినప్పటికీ ఆ దేశానికి స్నేహహస్తం అందించి శాంతి చర్యలకు పూనుకున్నారు. 1998 వరకు సామాన్యులకి దూరంగా ఉన్న టెలిఫోన్, గ్యాస్ వంటి వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత అటల్జీదే.
అగ్రరాజ్యాలు ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ వాటిని అధిగమించి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన దృఢమైన నాయకుడు అటల్జీ. ఆధునిక భారతదేశాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు నడిపించడానికి, ఉద్యోగకల్పనకు సాఫ్ట్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి అనేక కంపెనీలను ప్రారంభింపజేశారు. పట్టణ ప్రాంత ప్రజల కోసం వాంబే గృహనిర్మాణ పథకం లాంటివి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో రహదారుల కోసం గ్రామీణ సడక్ యోజనను ప్రారంభించారు. స్వర్ణ చతుర్భుజి పేరున దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అనుసంధానం చేశారు. జాతీయ రహదారుల ద్వారా ఆటోమొబైల్ రంగం, సిమెంట్ రంగం, ఇనుము మొదలైన రంగాలను విస్తరింప చేసి వాటి ద్వారా కొన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించారు. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణ, ప్రైవేటు రంగాల ప్రవేశం ద్వారా వాటిని పురోగమింపజేసి ఆ రంగంలో ప్రయాణ సౌకర్యం, ఉద్యోగాల కల్పన చేశారు. రైల్వేల ఆధునీ కరణ, రైలు ప్రయాణ వేగం పెంచడం, రైలుస్టేషన్ల అభివృద్ధి ఈయన హయాంలోనే జరిగింది. పంచాయతీలను పటిష్టపరిచారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించినది వాజ్‌పేయి. పోఖ్రాన్ అణు పరీక్ష ద్వారా ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటిచెప్పారు.
దేశంలో మెట్రోరైలును ప్రవేశపెట్టిన ఘనత వాజ్‌పేయిది. మొట్టమొదటి ఢిల్లీ మెట్రోని ప్రారంభించారు. దేశంలో పట్టణాలు పెరగడం, పట్టణ రహదారుల సమస్య, నిత్యం ట్రాఫిక్‌తో సతమతమవుతున్న ప్రజలకు మెట్రో రైలు ద్వారా పట్టణ రవాణా వ్యవస్థల తీరును మార్చారు అటల్జీ. అటల్జీ చిన్ననాడు క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లినా, 1977 ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లినా దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం మాత్రమే. జీవితాంతం ఆదర్శంగానే జీవించారు. ప్రజలతో ఎప్పుడూ మమేకమయ్యే ఉండేవారు. తన మంత్రివర్గంలో ఉన్న అందరు మంత్రులకు స్వేచ్ఛనిచ్చారు వాజ్‌పేయి.
ముఖ్యంగా అద్వానీతో కలిసి పని చేసిన తీరు అద్భుతం. వీరిద్దరూ 50 ఏళ్లకు పైగా కలిసి సహచరులుగా పనిచేసి ఏనాడూ ఎలాంటి స్పర్ధలు, మనస్పర్ధలు రానీయకుండా పార్టీలోని మిగతావారికి, తర్వాతి తరానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు. అవినీతి మచ్చలేని ప్రధానిగా, రాజకీయ నాయకుడిగా ప్రజాజీవితం సాగించారు అటల్జీ. భారతదేశ రాజకీయాల్లో కలియుగ భీష్మాచార్యులు అటల్ బిహారీ వాజ్‌పేయి.
(మాజీ ప్రధాని, బీజేపీ అత్యున్నత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి అస్తమయం సందర్భంగా)
పురిఘళ్ల రఘురాం
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
ఈ–మెయిల్ :raghuram.delhi@gmail.com