విపక్ష వ్యూహమేది? | Ramachandramurthy Writes On Federal Front | Sakshi
Sakshi News home page

విపక్ష వ్యూహమేది?

Published Sun, Mar 4 2018 1:53 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

Ramachandramurthy Writes On Federal Front - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

త్రికాలమ్‌
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ గురించి ఆలోచిస్తున్నారనీ, దానికి తానే స్వయంగా నాయకత్వం వహించాలని తలపోస్తున్నారనీ ‘సాక్షి’ పతాక శీర్షికగా ప్రచురించిన శనివారంనాడే ఆ వార్తను కేసీఆర్‌ స్వయంగా ధ్రువీకరించడం విశేషం. దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనీ, అస్పష్టత రాజ్యమేలుతోందనీ, ప్రగతి మందగించిందనీ చెబుతూ, పరిస్థితులు మారాలనీ, పరివర్తన సాధించాలనీ, అవసరమైతే అందుకు తాను చొరవ తీసుకుంటాననీ ముఖ్యమంత్రి ప్రకటించారు.

మూడు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ ప్రాబల్యం అసాధారణ స్థాయికి పెరిగి, కాంగ్రెస్, వామపక్షాలు కోలుకోలేని దెబ్బతిన్నట్టు ఎన్నికల ఫలితాలు వెల్ల డించిన రోజే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దూకుడుగా మాట్లాడటం కాకతాళీయం కాకపోవచ్చు. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందేనని విమర్శిస్తూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థానంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినంత మాత్రాన ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదనీ, నూతన రాజకీయ వ్యవస్థ ఆవశ్యకత ఉన్నదనీ ఉద్ఘాటించారు.

ఆత్యయిక పరిస్థితి అనంతరం జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ విజయం సాధించినట్టు, 1983లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం స్థాపించిన తర్వాత తొమ్మిది మాసాలకే కాంగ్రెస్‌ను మట్టికరిపించి అధికారంలోకి అట్టహాసంగా వచ్చినట్టు, తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికలలో విజయఢంకా మోగించినట్టు ఏదో ఒక కొత్త పరి ణామం సంభవించి విప్లవాత్మకమైన పరివర్తన రావలసిన అగత్యం ఉన్నదని ఉద్ఘోషించారు.

బీజేపీ విజయపరంపర కొనసాగిస్తూ దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలోనూ 21 రాష్ట్రాలలో అధికారం చెలాయిస్తున్న దశలో కేసీఆర్‌ ఇటువంటి అసాధారణ ప్రకటన చేయడం ఆశ్చర్యకరం. ఇటీవల కరీంనగర్‌ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ నరేంద్రమోదీని అమర్యాదగా సంబోధించడంపట్ల రాష్ట్ర బీజేపీ నాయకులు అభ్యంతరం చెప్పడం, రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌ తీవ్రంగా ఆక్షేపించడం, నోరు జారి (స్లిప్‌ ఆఫ్‌ ద టంగ్‌) ఉండవచ్చునంటూ కేసీఆర్‌ కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) కేంద్రమంత్రికి సంజాయిషీ ఇచ్చినట్టు వార్తలు రావడం, ప్రధాని పట్ల కేసీఆర్‌కు అపారమైన గౌరవభావం ఉన్నదంటూ ముఖ్యమంత్రి కుమార్తె కవిత వ్యాఖ్యానించడం పత్రికలు చదివేవారికీ, టీవీ న్యూస్‌చానళ్ళు చూసినవారికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో తనకు ప్రధాని పట్ల గౌరవాభిమానాలు ఉన్నాయనీ, ఆయనతో స్నేహం కూడా ఉన్నదనీ, వ్యక్తిగతంగా మోదీ పట్ల వీసమెత్తు వ్యతిరేకత లేదనీ చెప్పడం మాత్రమే ఉద్దేశమైతే కేసీఆర్‌ మీడియా గోష్ఠి అంతవరకే పరిమితమై ఉండేది. జాతీయ రాజకీయాల గురించి శషభిషలు లేకుండా మాట్లాడటం, 64 ఏళ్ళ వయసున్న తాను శేష జీవితాన్ని దేశప్రజల సేవకు అంకితం చేయడంలో తప్పు ఏమున్నదంటూ వాదించడం చర్చోపచర్చలకు తావు ఇస్తుంది.

ఎన్నికలకు ఏడాది మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో తాను జాతీయ స్థాయిలో పని చేస్తానంటూ ప్రకటించడం దేనికి సంకేతం? రాష్ట్రంలో పగ్గాలు కేటీఆర్‌కు అప్పజెప్పడానికి భూమిక సిద్ధం చేస్తున్నారనే అనుమానం కొంతమందికి రావచ్చు. 2019 ఎన్నికల నాటికి బీజేపీ ప్రభావం తగ్గితే, కాంగ్రెస్‌ పుంజుకోకపోతే ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

అటువంటి కూటమికి నాయకత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటే ఒక అడుగు ముందు ఉండటం ఉద్దేశం కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి అయిదారు కంటే ఎక్కువ దక్కే అవకాశం లేదనీ, తెలంగాణలోని 17 స్థానాలలో అత్యధిక స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందనీ ఆయన అంచనా కావచ్చు. రెండు సర్వేలు జరిపించినట్టు చెబుతున్నారు కానీ వివరాలు వెల్లడించలేదు. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి.

చారిత్రక సందర్భం
తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలలో విజయాలు సాధించే అవకాశం ఉన్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ, మహారాష్ట్ర నాయకుడు శరద్‌పవార్‌ కానీ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రస్తావన చేయలేదు. ఒకానొక చారిత్రక సందర్భంలో జాతీయ స్థాయిలో కీలకమైన పాత్ర పోషించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం ద్వారా కేసీఆర్‌ ప్రమాదపుటంచుల్లో విన్యాసాలు చేసే స్వభావాన్ని మరోసారి వెల్లడించారు.

మోదీని ప్రత్యక్షంగా విమర్శించకుండా సంయమనం ప్రదర్శించారు. ఇదే వైఖరి కొనసాగిస్తే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడవలసి రావచ్చు. పరిస్థితులను బట్టి ఎవరిపైన దాడి చేయాలో నిర్ణయించుకుంటారు. కారు గేరు మార్చి వేగం పెంచినప్పుడు ఎవరు అడ్డు వస్తే వారిని ఢీ కొంటుంది. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉంటూనే నేషనల్‌ ఫ్రంట్‌ నడక నచ్చని ప్రతిసారీ భారతదేశం పార్టీని జాతీయ స్థాయిలో నెలకొల్పుతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించేవారు. అంత పని చేయలేదు.

కేసీఆర్‌ కూడా తన ప్రతిపాదనకు ప్రతిస్పందన ఎట్లా ఉంటుందో తెలుసుకునేందుకు ఈగ వదిలే ఉద్దేశంతో (కైట్‌ ఫ్లయింగ్‌) ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి మాట్లాడి ఉండవచ్చు. ఆ ప్రస్తావన మళ్ళీ చేయకపోతే ఆయనను ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు. జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పడే అవకాశాలు నిజంగా ఉన్నాయా? రెండు జాతీయ పార్టీల వైఖరి గమనించినట్లయితే అటువంటి అవకాశాలు లేవని చెప్పడం కష్టం. ఇటీవల రాజస్థాన్‌ ఉప ఎన్నికలలో బీజేపీ పరాజయం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ.

కాంగ్రెస్‌కి మంచి ఊపు ఇచ్చిన సందర్భం. కానీ కాంగ్రెస్, సీపీఎంలు వ్యవహార శైలిని మార్చుకోకుండా పాత పద్ధతులనే కొనసాగిస్తే బీజేపీకి ఓటమి భయం ఉండదు. ప్రస్తుతం మూడున్నర రాష్ట్రాలకు (కర్ణాటక, పంజాబ్, మిజోరం, పుదుచ్చేరి) పరిమితమైన కాంగ్రెస్‌ రేపు కర్ణాటకలో అధికారం నిలబెట్టుకుంటే, ఈ యేడాది జరగబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించగలిగితే 2019లోజరిగే సార్వత్రిక ఎన్నికలలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది.

ఏడేళ్ళ కిందట పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ వామపక్ష సంఘటనను ఓడించినప్పుడే ఆ నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకొని, లోపాలను గుర్తించి, వాటిని అధిగమించి, సృజనాత్మకంగా వ్యవహరించి ఉంటే త్రిపురలో పరాభవం తప్పేది. కాంగ్రెస్‌ పాత నాయకులతో, పాత పద్ధతులతోనే కొనసాగితే పర్యవసానం ఎట్లా ఉంటుందో త్రిపుర, నాగాలాండ్‌ ఎన్నికల ఫలి తాలు స్పష్టం చేశాయి. ఓట్ల లెక్కింపునాడే కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేశంలో లేకుండా ఇటలీ వెళ్ళడం ఒక ప్రహసనం. విదేశీ పర్యటనలూ, విరామ విహా రాలూ పూర్తిగా మానివేసి ఈ యేడాది పూర్తిగా పార్టీ పునర్నిర్మాణంపైన దృష్టి పెట్టకపోతే కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు. అన్ని రాష్ట్రాలలో కీచులాడుకుంటున్న ముఠాలను ఏకం చేసి చావోరేవో తేల్చుకోవలసిందిగా కట్టడి చేయకపోతే కాంగ్రెస్‌కు నిష్కృతి లేదు.

బీజేపీ రణతంత్రం
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులలో ఉన్న సంకల్ప బలం, దీక్షాదక్షతలు కాంగ్రెస్‌ నాయకులలో కనిపించవు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక వెంటనే బీజేపీ నాయకులకు మోదీ, అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. తూర్పు రాష్ట్రాలపైనా, ఈశాన్య రాష్ట్రాలపైనా దృష్టి కేంద్రీకరించాలంటూ ఆదేశించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అప్పటి నుంచి ఏకాగ్రచిత్తంతో ఈశాన్య రాష్ట్రాలలో పార్టీ విజయావకాశాలు పెంపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

వారణాసిలో మోదీ ఎన్నికలను పర్యవేక్షించిన సునీల్‌ దేవ్‌ధర్‌ను త్రిపుర వ్యవహారాల పర్యవేక్షకుడిగా పంపించారు. ఆయన త్రిపురలో 500 రోజులు మకాం ఉండి క్షేత్ర వాస్తవికతను అధ్యయనం చేసి, ఆదివాసీలనూ, ఇతరులనూ ఐకమత్యంగా పని చేసే విధంగా ప్రోత్సహించారు. పార్టీ నియమించిన అన్ని కమిటీలలో ఆదివాసీలకు ప్రాతినిధ్యం కల్పించి తామూ పార్టీలో భాగస్వాములమనే విశ్వాసం కలిగించారు. మణిక్‌ సర్కార్‌ సచ్ఛీలుడు. నిరాడంబరుడు. ప్రతిప క్షాలు సైతం గౌరవించే మచ్చలేని వ్యక్తిత్వం ఆయనది. కానీ దిగువ స్థాయి సీపీఎం నాయకులలో, కార్యకర్తలలో అలసత్వం, నిరంకుశ ధోరణి ప్రబలి ప్రజ లను పార్టీకి కొంత దూరం చేశాయి.

అయినప్పటికీ కాంగ్రెస్‌తో పోల్చితే సీపీఎంది అంత ఘోరమైన పరాజయం కాదు. పాతికేళ్ళ ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి పేరుకుపోవడం సహజం. సీపీఎంకు గత ఎన్నికల కంటే ఈసారి ఆరు శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. కాంగ్రెస్‌ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. పార్టీ నాయకులు కట్టకట్టుకొని బీజేపీలో చేరుతుంటే కాంగ్రెస్‌ అధిష్ఠానం నిమ్మకు నీరెత్తినట్టు చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర పోషించిందే కానీ వలసలను అరికట్టే ప్రయత్నం చేయలేదు. అస్సాం నుంచి త్రిపుర వరకూ బీజేపీ ఒకే వ్యూహాన్ని జయప్రదంగా అమలు చేసింది. దాన్ని తిప్పికొట్టడానికి అవసరమైన నేర్పు, సమయస్ఫూర్తి కాంగ్రెస్‌ నాయకత్వంలో లేదు.

ఆ పార్టీలో ఒక రాంమాధవ్, ఒక దేవ్‌ధర్, ఒక విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ వంటి నాయకులు మచ్చుకైనా లేరు. మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలుగా ప్రతిపక్షంలో కూర్చున్నా ముఠా రాజకీయాలకు స్వస్తి చెప్పి పని చేయాలన్న సద్బుద్ధి సీని యర్‌ కాంగ్రెస్‌ నేతలకు లేదు. రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తూ ప్రతి రాష్ట్రాన్నీ ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించి, అక్కడి కుల సమీకరణాలనూ, మతాల ప్రభావాలనూ, సామాజికాంశాలనూ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఇతర పార్టీలలో సమర్థులుగా పేరు తెచ్చుకున్న నాయకులను అరువు తెచ్చుకొని, కేంద్ర ప్రభుత్వానికి సహజంగా ఉండే అపారమైన ప్రాబల్యాన్నీ, వనరులనూ వినియోగించి విజయాలు సాధిస్తోంది బీజేపీ.

యుద్ధంలోనూ, ప్రేమలోనూ ఏమి చేసినా చెల్లుతుందనే సూత్రాన్ని బీజేపీ ఎన్నికలకూ వర్తింపజేస్తున్నది. గతంలో మెజారిటీ లేకపోయినా గోవా, మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాలు నెలకొల్పడం ఆ వైఖరి ఫలితమే. కాంగ్రెస్‌లో మంచి పేరున్న అస్సాం నేత హేమంత్‌ విశ్వాస్‌ శర్మను బీజేపీ ఆకర్షించింది. రాజకీయ కౌశలం దండిగా కలిగిన శర్మ ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్‌ భరతం పడుతున్నారు.

ప్రతిపక్షాలు గుణపాఠం నేర్చుకుంటాయా?
కాంగ్రెస్, సీపీఎంలు గుణపాఠాలు నేర్చుకొని పార్టీల పునర్నిర్మాణానికి సకాలంలో సరైన చర్యలు తీసుకుంటేనే బీజేపీ రథాన్ని నిలువరించే అవకాశం ఉంటుంది. వామపక్ష వ్యతిరేక శక్తులన్నింటినీ సమీకరించడం ద్వారా బీజేపీ త్రిపురలో విజయం సాధించిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. అదే యుద్ధనీతిని ప్రతిపక్షాలు సైతం అనుసరించకపోతే బీజేపీకి తిరుగుండదు. కాంగ్రెస్‌తో పొత్తుపైన సీïపీఎంలో సాగుతున్న చర్చకు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక అర్థవంతమైన ముగింపు పలుకుతాయేమో చూడాలి.

త్రిపురలో 2013లో ఒకే ఒక్క నియోజకవర్గంలో ధరావతు దక్కించుకున్న బీజేపీ ‘శూన్యం నుంచి శిఖరం’(మోదీ మాట) దాకా ఎదిగింది. బీజేపీని నిందించడం కంటే బీజేపీ రణనీతిని అర్థం చేసుకొని దానికి తగినట్టు ప్రతివ్యూహాలు రూపొందించుకొని ప్రజలతో మమేకమై అంకితభావంతో కృషి చేయవలసిన బాధ్యత ప్రతిపక్షాలపైన ఉంది. కాంగ్రెస్‌లో పరివర్తన రాకపోతే కేసీఆర్‌ ప్రతిపాదించిన ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’కు అవకాశం ఉంటుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ భవిష్యత్తుపైన ఒక అవగాహన రావచ్చు.

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement