
కేవలం ఒక్క రోజు మినహా గత మూడు వారాలుగా అదే పనిగా పైపైకి పోతున్న పెట్రో ధరలు దేశ పౌరుల్ని హడలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వరస లాక్‌డౌన్‌లు, ఆ తర్వాత కూడా కొనసాగుతున్న అనేక రకాల ఆంక్షలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో సొంత వాహనాల దుమ్ము దులిపి బయటకు తీయడం మొదలు పెట్టారు. ఇదే అదునుగా చమురు సంస్థలు నిలువుదోపిడీకి దిగుతున్నాయి. ఈ నెల 7 నుంచి రోజూ ధరల్ని పెంచడం రివాజుగా పెట్టుకున్నాయి. ఆదివారం ఒక్కరోజూ ఎందుకో అవి కనికరించాయి. ధరల పెంపు ప్రక్రియకు ఇక బ్రేకు పడినట్టేనని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 24 గంటలు గడవ కుండానే సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ పెరుగుదల ఎంత వింతగా వుందంటే లీటర్ పెట్రోల్‌కన్నా లీటర్ డీజిల్ ధరే ఇప్పుడు అధికంగావుంది! లాక్‌డౌన్ కాలంలో తమకొచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి మొదటి పదిరోజులూ చమురు సంస్థలు ధరల్ని పెంచాయి. అటు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పెంచడంతో ఆ భారాన్ని చమురు సంస్థలు వినియోగదారులకు బదిలీ చేయడం మొదలుపెట్టాయి. పర్యవసానంగా పెట్రో ధరలు యధేచ్ఛగా పెరుగుతున్నాయి.
లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్, డీజిల్ వినియోగం 66 శాతం పడి పోయిందన్నది వాస్తవం. అయితే లాక్‌డౌన్ వల్ల నష్టపోయింది చమురు సంస్థలు ఒక్కటే కాదు. దేశంలో అన్ని రంగాలూ, సంస్థలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిపై ఆధారపడే కోట్లాదిమంది కూలీలు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఎనలేని నష్టాన్ని చవిచూస్తున్నారు. తమ కొచ్చిన కష్టాల నుంచి వారింకా కోలుకోలేదు. ఇప్పట్లో కోలుకునే అవకాశం కూడా లేదు. ఇంతగా అగచాట్లు పడుతున్నవారిపై రోజూ ధరల దరువు వేయడం ఎంతవరకూ సమంజమన్న స్పృహ కూడా ఎవరికీ లేకుండా పోయింది. పెట్రో ధరలపై విధిస్తున్న నియంత్రణ వల్ల చమురు సంస్థలకు ప్రభుత్వాలు భారీగా చెల్లించాల్సి వస్తున్నదని, దీన్ని తొలగించదల్చుకున్నామని 2002లో తొలిసారి వాజపేయి నేతృత్వంలోని అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలుండాలి. అయితే దీన్ని గట్టిగా వ్యతిరేకించిన కాంగ్రెస్...తన నేతృత్వంలో 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడగానే తిరిగి నియంత్రణ విధానాన్ని తీసుకొచ్చింది.
కానీ 2010లో పెట్రోల్ ధరలపై మాత్రం నియంత్రణ తొలగించింది. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ అధికారంలోకొచ్చాక డీజిల్ ధరలపై వున్న నియంత్రణ కూడా పోయింది. వాస్తవానికి ఇలా నియంత్రణ తొలగించడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వినియోగదారులు లాభపడాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఎప్పుడూ లేనంత తక్కువగా వున్నాయి. నిరుడు డిసెంబర్ నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ఆ ధరలు క్షీణించడం మొదలుపెట్టాయి. మొన్న మార్చిలో రష్యాకూ, సౌదీ అరేబియా నేతృత్వంలోని చమురు దేశాల కూటమి ఒపెక్ కూ మధ్య వచ్చిన విభేదాల వల్ల అవి మరింత పతనమయ్యాయి. ఆ తర్వాత కాలంలో కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌లో ఉండటంవల్ల ఏర్పడ్డ సంక్షోభంతో డిమాండ్ పడిపోయి పతనమవుతున్నాయి. ఈ పతనావస్థ సోమవారం కూడా కొనసాగింది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 40 డాలర్లుంది. అమెరికా ఉత్పత్తి చేసే ముడి చమురు బ్యారెల్ ధర 37.77 డాలర్ల వద్ద నిలిచిపోయింది. అయితే చమురు ధరల్ని డాలర్ రేటుతో పాటు మరికొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి.
మనం కొనుగోలు చేసే ముడి చమురుకు డాలర్లలో చెల్లించాల్సి వుంటుంది గనుక డాలర్ రేటు అధికంగా వున్నప్పుడు ముడి చమురు ధర తగ్గడం వల్ల కలిగే లాభం ఆవిరయ్యే మాట నిజమే. అలాగే చమురు శుద్ధి ప్రక్రియ, దేశంలోని వివిధ ప్రాంతాలకు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ పంపిణీ వగైరాలకు అదనంగా ఖర్చవుతుంది. కానీ వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నాక సైతం తగ్గాల్సిన పెట్రో ధరలు కూడా కేంద్రం విధిస్తున్న సుంకాల కారణంగా పైపైకి పోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడల్లా తమకు అంతక్రితం ఏర్పడ్డ నష్టాలను పూడ్చుకోవడానికి వచ్చిన అవకాశంగా అటు చమురు సంస్థలూ, ఇటు కేంద్ర ప్రభుత్వమూ భావిస్తున్నాయి. వీటికితోడు రాష్ట్రాల స్థాయిలో విధిస్తున్న పన్నులు సరేసరి. ఆదాయానికీ, వ్యయానికీ మధ్య వుండే ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతం మించరాదన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. కరోనా వైరస్ బీభత్సం పర్యవసానంగా రాబడి గణనీయంగా పడిపోవడం... ఉద్దీపన ప్యాకేజీల కింద అదనంగా ఖర్చుపెట్టాల్సిరావడం వంటి కారణాల వల్ల ఆ సంకల్పానికి చిల్లుపడే ప్రమాదం వచ్చిపడింది.
పర్యవసానంగా ద్రవ్యలోటు ఈసారి 7 శాతం వరకూ ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. అది ఏమేరకు తగ్గించుకోగలమన్నదానిపైనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇతరత్రా ఆదాయాలన్నీ పడిపోయిన నేపథ్యంలో ఉన్నంతలో చమురు వినియోగం ద్వారానే లోటు పూడ్చుకోవడం సాధ్యమన్న నిర్ణయానికొచ్చింది. కనుకనే అంత ర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా మన దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో అధిక ధరలున్నప్పుడు సబ్సిడీల యుగానికి కాలం చెల్లిందని మాట్లాడటం... అవి తగ్గినప్పుడు సుంకాల పేరుతో భారీగా వడ్డిస్తూ ఆ లాభాన్ని వినియోగదారులకు దక్కకుండా చేయడం కేంద్రంలో ఎవరున్నా చేస్తున్న పనే. పెట్రో ధరల పెంపువల్ల ద్రవ్యోల్బణం విజృంభించి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామాన్యులు నిస్సహాయంగా వుండిపోతున్నారు. దీన్నంతటినీ మౌనంగా భరిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. పెట్రో ధరలపై ఇప్పుడనుసరిస్తున్న విధానాలు మార్చాలి.
Comments
Please login to add a commentAdd a comment