అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆవిర్భవించిన సందర్భానికి ఒక బలమైన సాహిత్య నేపథ్యం ఉంది. ఆ నేపథ్యానికి ఆధునిక తాత్విక పునాది ఉంది. నూతన ప్రాపంచ దృక్పథం ఉంది. అందువల్లనే అరసం అనేక విజయాలు సాధించగలిగింది. ప్రజల పక్షాన, ప్రజాకంటక పాలకులను ప్రశ్నించే పక్షాన గళమెత్తుతోంది. ప్రశ్నించే శక్తుల్ని ప్రోత్సహిస్తోంది. స్వయంగా నిలదీస్తోంది. 82 ఏళ్ళనాటి మాట. ‘‘గత సాహితి ఆవేశం ఉన్మాదం లాంటిది. ఫలితం మాత్రం ఇంకొకరిది. కాని మన సాహిత్య ఉద్దేశం వేరు. మన గీటురాయి మీద సాహిత్యానికి మెరుగుపెట్టాలి. ఉన్నత భావాలు, స్వతంత్ర ఆలోచనలు, సౌందర్యారాధన, ఆత్మవికాసం జీవిత యదార్థ ఘటనలు, అందులో ఉంటాయి. అవే మనలో ఉత్తేజాన్ని సంఘర్షణల్ని, ఆదర్శాల్ని సృష్టిస్తాయి. అవి నిద్రపుచ్చడానికి ప్రయత్నించకూడదు. అధిక నిద్ర మృత్యువుతో సమానం కదా?’’ మనుషులపట్ల ప్రేమ, జాతి పట్ల బాధ్యత, రచనల్లో నిబద్ధత ఉన్న ఒక మహా రచయిత సమకాలీన రచయితలకు చేసిన కర్తవ్య బోధ ఇది. సర్వకాలాలకూ వర్తించే అక్షర సత్యాలు ఇవి.
1936 ఏప్రిల్ 9, 10 తేదీల్లో లక్నోలో ఒక మహా సభ జరిగింది. ప్రగతి లేఖక్ సంఘ్ (అభ్యుదయ రచయితల సంఘం) తొలి మహాసభ అది. ఆ సభకు అధ్యక్షులు సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్‌చంద్. ఆ అధ్యక్ష ప్రసంగంలోని అంశాలే పైన పేర్కొన్నవి. యుద్ధోన్మాదానికి, ఫాసిజానికీ వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌తో అరసం సంబంధాలు పెట్టుకుంది. అవే అంశాలపై పనిచేస్తున్న కమ్యూనిస్టులు ఈ రచయితల సంఘానికి మద్దతుగా నిలిచారు. దాని ప్రభావం తెలుగు నాటకూడా పడింది.
అప్పటికే శ్రీశ్రీ మరోప్రపంచపు మహాప్రస్థాన సింహ గర్జనలు ప్రారంభం అయ్యాయి. సంప్రదాయ సాహిత్య సంకెళ్ళు, భావకవిత్వ పరిష్వంగనలను జగన్నాథ రథచక్రాలు పటాపంచలు చేశాయి, చెల్లాచెదురు చేశాయి. అంతకు ముందు వీరేశలింగం, గిడుగు, గురజాడల సంఘసంస్కరణ ఉద్యమం, వాడుకభాషా ఉద్యమం, ఆధునిక సాహిత్య ఉద్యమాలు నూతన ఆలోచనాధోరణులకు బాటలు వేశాయి. ఆంధ్రలో అభ్యుదయ సాహిత్యం పురుడుపోసుకోవడానికి అవి దోహదపడ్డాయి. అభ్యుదయ సాహిత్యం సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలన్నింటినీ ప్రభావితం చేసింది. ఉద్యమ రూపం ధరించింది. ‘‘ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం’’గా సంస్థాగత రూపం తీసుకొంది. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో గుంటూరు జిల్లా తెనాలిలో ప్రథమ మహాసభలు జరిగాయి.
ఉపన్యాసాలకే పరిమితం కాకుండా అరసం కార్మికవర్గ అస్తిత్వాన్ని బలంగా ఆవిష్కరించింది. అణగారిన వర్గాల వాణి అయింది. స్వాతంత్య్రోద్యమంలోనే గాక జమీందారీ వ్యతిరేక పోరాటాలకు, నిజాం నిరంకుశ పాలనకు, వ్యతిరేకంగా జరిగిన రైతాంగ సాయుధ పోరాటాలకు ఉద్యమ గేయం అయింది. నిషేధాలు నిర్బంధాలకు గురైంది. తిరగబడింది. తిప్పికొట్టింది. బలహీనపడింది. తిరిగి నిలదొక్కుకుంది. ఇది 75 ఏళ్ల ‘‘అరసం ఘనమైన గతం’’. ఆత్మగౌరవాన్ని పిడికిలెత్తి చాటుకుంటున్న వారి సొంత గొంతుకలే అస్తిత్వవాదాలు అయ్యాయి.
స్త్రీవాదం, దళితవాదం వంటి ఉద్యమాల పరిణామాన్ని అరసం నిండుమనస్సుతో ఆహ్వానించింది. తొలినాళ్లలో అందర్నీ తోసిరాజన్న అస్తిత్వవాదులు అభ్యుదయ రచయితలు తమ సహజ మిత్రులని విశ్వసిస్తున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఐక్యఉద్యమాల అనివార్యతను అంగీకరిస్తున్నారు. అందుకోసం సోదర సాహితీ సంస్థలకు అరసం స్నేహ హస్తాన్ని అందిస్తోంది. తిరిగి మరో బలమైన సాహిత్య సాంస్కృతిక ఉద్యమ అవసరాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ఒక దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 18వ రాష్ట్ర మహాసభలు గుంటూరులో డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్నాయి. ఆ వేదిక నుండే వజ్రోత్సవాలు జరుగుతాయి. ఇవి కేవలం ‘అరసం’ మహాసభలే కాదు, తెలుగువారి సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు.
కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ వ్యాసకర్త, సీనియర్ పాత్రికేయుడు
మొబైల్ : 94911 28554
Comments
Please login to add a commentAdd a comment