నిప్పుతో చెలగాటం ప్రమాదకరం! | Shekhar Gupta Article On Assam BJP Issue | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 4 2018 1:26 AM | Last Updated on Sat, Aug 4 2018 1:26 AM

Shekhar Gupta Article On Assam BJP Issue - Sakshi

‘వికాస్‌’ వాగ్దానంతో చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే అయినప్పుడు ‘జాతీయవాదం’ పేరుతో ప్రజలను చీల్చి ఓట్లు సంపాదించడమే అత్యంత ఆకర్షణీయంగా బీజేపీకి కనిపించడం సహజమే. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి ఇది చక్కటి మార్గం. 2019 ఎన్నికల వరకూ అస్సాం ‘మంటలు’ ఆరిపోకుండా బీజేపీ చూసు కుంటుంది. ఈ క్రమంలో బీజేపీ లక్షలాది మందిని ‘చొరబాటుదారుల’నే ముద్ర వేస్తుంది. అంటే, దేశంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలందరికీ ఈ మాట వర్తించేలా చూస్తుంది. ‘లౌకిక’ ప్రతిపక్షాలను ఈ బెంగాలీ ముస్లింలను సమర్థించేలా చేయడమే బీజేపీ వ్యూహం.

2019 ఎన్నికల్లో బీజేపీకి అస్సాం సమస్య కీలకమౌతుంది. అయితే, ఇది చివరికి హిందువులకు కూడా హాని చేసే విషపూరిత అంశంగా మారే ప్రమాదం లేకపోలేదు. 35 ఏళ్ల క్రితం అస్సాంలోని నెల్లీ మారణకాండ ఇంకా గుర్తుంది. అస్సాంలో విదేశీయులను గుర్తించడానికి రూపొందించిన జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్నా ర్సీ)పై రేగుతున్న చర్చ సందర్భంగా బ్రహ్మపుత్రా నది ఉత్తర తీరంలోని ఖోయిరాబారీ, గోహ్‌పూర్, సిపాజార్‌ వంటి ప్రాంతాల్లో ఏం జరిగిందీ మరవ కూడదు. 1983లో బ్రహ్మపుత్రా లోయలో జరిగిన ఘర్షణల్లో దాదాపు ఏడు వేల మంది మరణించారు.  పైన చెప్పిన మూడుచోట్ల దాదాపు హిందువులే ప్రాణాలు పోగొ ట్టుకున్నారు. అదీ సాటి హిందువుల చేతుల్లోనే వారు హతులయ్యారు. అస్సాంలో ‘విదేశీ పౌరుల’ (ముస్లింలని భావించాలి)పైనే జనంలో కోపముంటే హిందువులను హిందువులే ఎందుకు చంపుకుంటున్నారు? ఈశాన్య భారతంలోని అనేక విషయాల మాదిరిగానే ఇది కూడా సంక్లిష్ట సమస్య. ఇక్కడ దాడిచేసే హిందువులు అస్సామీ మాట్లాడే వారైతే మారణకాండల్లో చనిపోయేది బెంగాలీలు. ఇద్దరూ ఒక మతానికి చెందినవారే అయినా రెండు వర్గాల మధ్య భాష, జాతిపరమైన విద్వేషాలు విషపూరితంగా మారాయి. అలాకాకుండా నెల్లి వంటి ప్రదేశాల్లో బెంగాలీ ముస్లింలను అస్సామీ హిందు వులు చంపారు. బీజేపీ, మంచి జరుగుతుందని ఆశించిన సుప్రీంకోర్టు ఈ పాత విద్వేషాలను మళ్లీ రగిలేలా చేస్తున్నాయి.

40 లక్షల మందికి దొరకని చోటు!
ఎన్నార్సీ తుది ముసాయిదాలో 40 లక్షల మంది ప్రజల పేర్లు లేవు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇది తాత్కాలిక తొలి జాబితా అన్నారు. పేర్లు లేని లక్షలాది మంది ప్రజలను ‘చొరబాటుదారులు’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పార్లమెంటులో అభి వర్ణించారు. ఈ 40 లక్షల మందిలో మూడో వంతు హిందువులేనని అస్సాం ఆర్థిక మంత్రి (వాస్తవానికి ఈయనే నిజమైన ముఖ్యమంత్రి) హిమంతా బిశ్వ శర్మ వెల్లడించారు. ఈ సమస్యకు పరిష్కారంగా బీజేపీ కొత్త పౌరసత్వ బిల్లు రూపొందించింది. దీని ప్రకారం పొరుగు దేశాలకు చెందిన హిందువులు, సిక్కులు వంటి భారత మతాలకు చెందినవారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించారు. ఒకవేళ ఈ బిల్లు చట్టమైనా ‘భూమిపుత్రులైన’ అస్సా మీలు దీనిపై ఎలా స్పందిస్తారు? ఈ స్థానిక అస్సా మీలకు తమ ప్రాంతంలో హిందువులైనా, ముస్లిం లైనా బెంగాలీలతో కలిసి జీవించడం అసలేమాత్రం ఇష్టం లేదు. 1983లో రెండు వర్గాల బెంగాలీలను వారు ఊచకోతకోశారు.

కొత్త పౌరసత్వ బిల్లును ఇప్పటికే మాజీ సీఎం, ప్రస్తుత బీజేపీ సంకీర్ణ సర్కారు భాగస్వామి ఏజీపీ నేత ప్రఫుల్లకుమార్‌ మహంతా వ్యతిరేకిస్తున్నారు. చివరకు పౌరుల జాబి తాలో చోటు దక్కనివారు ఈ 40 లక్షల మందిలో ఐదు లక్షల మందికి మించకపోవచ్చని అంచనా. పౌరసత్వానికి సాక్ష్యంగా చూపించడానికి గ్రామ పంచాయతీలు జారీచేసే పత్రాలు చెల్లవని గువా హటీ హైకోర్టు నిర్ణయించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా హైకోర్టు ఉత్తర్వును తిరస్కరించింది. అంతే గాక, ఈ పంచాయతీలు ఇచ్చే ధ్రువీకరణపత్రాలు చెల్లుబాటు కావడానికి వాటిని ఏ పద్ధతిలో జారీ చేయాలో కూడా నిర్ణయించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు బాధ్యత అప్పగించింది. ఈ గందరగోళం మధ్య ఎన్నార్సీ ముసాయిదా జాబితా రూపొందిం చారు. మారిన పద్ధతిలో పంచాయతీలు జారీచేసే ధ్రువీకరణ పత్రా లన్నీ చెల్లుబాటయితే ‘విదేశీయు లు’గా తేలే జనం దాదాపు ఉండరనే చెప్పవచ్చు. ఇలా జరగడం బీజేపీకి ఇష్టం లేదు.

అస్సాం ఒప్పందమే ఆధారం!
విదేశీయులను తేల్చే ప్రక్రియ విషయంలో 1985 నాటి రాజీవ్‌గాంధీ, ఆసు/ఆల్‌ అస్సాం గణ సంగ్రామ పరిషత్‌ శాంతి ఒప్పందం స్ఫూర్తితో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అస్సాం పౌరు లెవరో తేల్చడానికి రాష్ట్రంలో 1971 మార్చి 25 నాటికి ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుని ఎన్నార్సీ రూపొందించాలని కోరింది. అంటే, ఈ తేదీకి ముందు ఇండియాలోకి వచ్చినవారెవరైనా చట్టబద్ధ మైన పౌరుల కిందే లెక్క. 1971 మార్చి 26న అవ తరించిన బంగ్లాదేశ్‌ తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్, ప్రధాని ఇందిరాగాంధీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అప్పటికి ఇండియాలోకి ప్రవేశిం చిన కోటికి మందికి పైగా బంగ్లా శరణార్థులను వెనక్కి తీసుకోవడానికి బంగ్లాదేశ్‌ అంగీకరించింది.

ఈ ఒప్పందం ఆధారంగా 1971 మార్చి 25 అనే తేదీని పౌరసత్వానికి గీటురాయిగా నిర్ణయించారు. ఈ శరణార్థుల్లో దాదాపు 80 శాతం మంది హిందు వులే. కాని, హిందువులైనా, ముస్లింలైనా ఈ బంగ్లా శరణార్థులందరూ వెనక్కి పోవాలనే ఇందిరాగాంధీ కోరుకున్నారు. 33 ఏళ్ల తర్వాత విదేశీయుల సమ స్యకు పరిష్కారంగా అస్సాం ఉద్యమకారులతో ఆమె కొడుకు రాజీవ్‌గాంధీ 1985లో ఒప్పందం చేసుకుని, ఈ ప్రాతిపదికన ఎన్నార్సీ రూపొందిస్తామని వాగ్దా నం చేశారు. అనేక కారణాల వల్ల ఎన్నార్సీ ఇంత వరకు తయారు కాలేదు. రెండు తరాల జనం పుట్టి పెద్దయ్యాక ఇప్పుడు విదేశీయులంటూ వారిని ఎలా బయటకు పంపాలి లేదా వారి ఓటు హక్కు రద్దు చేయాలి? ఇది జరగని పనని బీజేపీకి కూడా తెలుసు.

అమిత్‌షా ప్రసంగం ఏమి సూచిస్తోంది?
ఇందులో రాజకీయమేమీ లేదని బీజేపీ నేతలెవరైనా అంటే, అమిత్‌షా ప్రసంగం వినలేదా? అని వారిని నిలదీయవచ్చు. 2019 ఎన్నికల ప్రచారానికి పునాది వేసినందుకు ఆయనకు పూర్తి మార్కులు ఇవ్వవచ్చు. ఆయన ప్రసంగం అంత సూటిగా, పారదర్శకంగా ఉంది. ‘వికాస్‌’ వాగ్దానంతో చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే అయినప్పుడు ‘జాతీయవాదం’ పేరుతో ప్రజలను చీల్చి ఓట్లు సంపాదించడమే అత్యంత ఆకర్షణీయంగా బీజేపీకి కనిపించడం సహ జమే. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడా నికి ఇది చక్కటి మార్గం. ఎన్నిక వరకూ అస్సాం ‘మంటలు’ ఆరిపోకుండా బీజేపీ చూసుకుంటుంది. ఈ క్రమంలో బీజేపీ లక్షలాది మందిని ‘చొరబాటు దారుల’నే ముద్ర వేస్తుంది. అంటే, దేశంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలందరికీ ఈ మాట వర్తించేలా చూస్తుంది.

‘లౌకిక’ ప్రతిపక్షాలను ఈ బెంగాలీ ముస్లింలను సమర్థించేలా చేయటమే బీజేపీ వ్యూహం. ఈ ప్రతిపక్షాలు ముస్లిం అనుకూలమేగాక, జాతివ్యతిరేక మనే భావం ప్రజల్లో కలుగుతుందనేది బీజేపీ అంచనా. ముస్లింలకు అనుకూలమా లేదా వ్యతిరేకమా అనేది  2019 పార్ల మెంటు ఎన్నికల్లో ప్రధానాంశం అయితే బీజేపీకే విజయం సొంతమౌ తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ‘జాతీయవాదుల’ను బీజేపీకి అనుకూలంగా మలచుకోవడానికి అస్సాం ‘విదేశీయుల’ సమస్య అమిత్‌షా చేతిలో పదునైన ఆయుధంలా మారింది. దేశంలో ఎన్నికల రాజకీ యాలు అమిత్‌షాకు, బీజేపీకి తెలిసినంతగా మరెవ రికీ తెలియవు. అయితే, బీజేపీకి అస్సాం గురించి తెలుసా? ఏళ్లు వెనక్కిపోయి, నేను గువాహటీ నగ రంలోని నందన్‌ హోటల్‌లో బసచేసిన ఓ చిన్న గది గురించి చెప్పాలి. ఈ రూమ్‌కు వచ్చిన నలుగురు అతిథులు శక్తిమంతులే కాదు మర్యాదస్తులు కూడా. అక్కడ పరిస్థితులు వారిని ఆందోళనకు గురిచేశాయి. వారి నాయకుడు కేఎస్‌ సుద ర్శన్‌. అప్పుడాయన ఆరెస్సెస్‌ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ (మేధో విభాగం అధిపతి). తర్వాత ఆయన ఆరెస్సెస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ (అధి పతి) అయ్యారు.

35 ఏళ్ల క్రితం ఫిబ్రవరి నెలలో అస్సాంలో అంతమంది బెంగాలీ హిందువులు ఎలా మారణకాండ బారినపడ్డారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే వీరు అప్పట్లో నన్ను కలిశారు. ముస్లిం చొరబాటుదారులకు, హిందూ శరణార్థులకు మధ్య ఉన్న తేడాను ఈ అస్సామీయులు ఎందుకు గుర్తించలేకపోయారు? ఖొయిరాబారిలో వారు ఇంతమంది హిందువులను ఎలా చంపగలిగారు అని సుదర్శన్‌ నన్ను ప్రశ్నిం చారు. అస్సాంలోని జాతి, భాషాపరమైన సంక్లిష్టతలే ఈ మారణకాండను ఇంత పాశవికంగా కొనసాగించారని నేను ఆయనకు వివరించాను. కానీ హిందువులకు రక్షణ లేకపోయింది కదా అని సుదర్శన్‌ వాపోయారు.
ఆ తర్వాత ఆరెస్సెస్‌ అస్సామీ ఆందోళనకారులను పున చైతన్యపరిచేందుకు సహనంతో కూడిన ప్రచారాన్ని చేపట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేను రాసిన ‘రైటింగ్స్‌ ఆన్‌ ది వాల్‌‘ రచన వారి విజయానికి అద్దం పట్టింది. ఇప్పుడు అస్సాంలో బీజేపీ అంటే మాజీ ఏఏఎస్‌యు, ఏజీపీ సంస్థల నుంచి పరివర్తన చెందిన కార్యకర్తలు, నేతలు మాత్రమే. చివరకు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన సహ మంత్రులు కూడా వీరిలో భాగమే కావడం గమనార్హం.

కానీ 1983లో వారి యవ్వనప్రాయంలో చేసినట్లుగానే, ఎన్‌ఆర్‌సీపై ఆర్‌ఎస్‌ఎస్‌/బీజేపీ పెట్టే షరతులను పాటించేందుకు వీరు తలొగ్గుతారా? ఆ షరతులేమిటి అంటే బెంగాలీ ముస్లింలను లక్ష్యంగా చేసుకోండి, హిందువులను కౌగలించుకోండి. 2019 సార్వత్రిక ఎన్నికలలో అస్సాంను తన కీలకాంశంగా ఉపయోగించుకోవాలని బీజేపీ దాదాపుగా నిర్ణయిం చుకుంది. రాజకీయ లబ్ధికోసం ఆర్ధిక నష్టాన్ని పణంగా పెట్టడం అనేది ఒక అంశం కాగా, సంక్షుభిత అస్సాలో పాత జ్వాలలను మళ్లీ రగుల్కొల్పడం అనేది మరొక అంశం. పరిస్థితులు ప్రశాంతంగా ఉంటే ఇది సంభవమే కానీ అశాంతి చెలరేగిందంటే మాత్రం ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు, బెంగాలీలకు వ్యతిరేకంగా అస్సామీయులు, హిందూ లేక ముస్లింలు, హిందువుకు వ్యతిరేకంగా హిందువు, ముస్లింకు వ్యతిరేకంగా ముస్లిం ఇలా పెను విద్వేషం రకరకాల రూపాలుగా తయారయ్యే ప్రమాదం మాత్రం పొంచి ఉంది.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement