హిందుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్‌ బలహీనత | Shekhar Gupta Guest Column On Veer Savarkar | Sakshi
Sakshi News home page

హిందుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్‌ బలహీనత

Published Sun, Oct 20 2019 12:50 AM | Last Updated on Sun, Oct 20 2019 12:50 AM

Shekhar Gupta Guest Column On Veer Savarkar - Sakshi

వీర సావర్కర్,  జాతీ యవాదంపై సోనియా, రాహుల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేర్చుకోవల్సిందేమిటి? వీర సావర్కర్‌ పట్ల కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అయోమయం మరోసారి జాతీయవాదంపై దాని ద్వైదీభావాన్ని బట్టబయలు చేసింది. సావర్కర్‌కు భారతరత్న అవార్డుపై తాజా వివాదం కాంగ్రెస్‌ని బట్టలూడదీయించినంత పనిచేసింది. సావర్కర్‌ని  నాజీగా, గాంధీ హత్యకు కుట్రదారుగా ఖండించడానికి, ‘మేం సావర్కర్‌జీని గౌరవిస్తాం కానీ ఆయన భావజాలంతో ఏకీభవించలేం’ అంటూ మన్మోహన్‌ సింగ్‌ సూక్ష్మభేదంతో చెప్పడానికి మధ్య కాంగ్రెస్‌ పార్టీకి ఒక సున్నితమైన అంశంపై తన పంథా గురించి ఏమీ తెలీదని అనిపిస్తోంది.మన్మోహన్‌ వివేకంతో కూడిన ప్రకటన చేసిన 24 గంటల తర్వాత, కాంగ్రెస్‌ పార్టీ సింగ్‌ ప్రకటన నుంచి దూరం జరగడానికి ప్రయత్నించింది.

సింగ్‌ ప్రకటనను తేలికపర్చడానికి కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జీవాలా చేసిన ప్రయత్నం నిస్పృహతోనూ కూడి ఉంది. మన్మోహన్‌ ప్రకటనలో కుతర్కం గానీ, సందిగ్ధత గానీ లేదు. నిజానికి ఆయన చేసిన ప్రకటన ప్రారంభం నుంచి తన పార్టీ వైఖరిగా ఉండి ఉండాలి. అప్పుడే ఆ పార్టీ స్వీయ విధ్వంసంవైపు పోకుండా అది కాపాడి ఉండేది. ప్రత్యేకించి సావర్కర్‌ వీరాభిమానులు 1970లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సావర్కర్‌ గౌరవార్థం పోస్టేజీ స్టాంప్‌ విడుదల చేసిన చిత్రాన్ని, సావర్కర్‌కి ఇందిర అందించిన నివాళిని గుర్తు చేస్తూ ఫాసిమైల్‌ పంపుతున్న ప్రస్తుత సందర్భంలో కాంగ్రెస్‌ తనవైఖరిని పునరాలోచించుకోవలసింది. సావర్కర్‌ జీవితంపై డాక్యుమెంటరీకి ఇందిర ప్రోత్సాహమివ్వడమే కాకుండా ఆయన స్మారక నిధికి రూ.11,000 (నేటి విలువలో రూ. 5 లక్షలు) డొనేషన్‌ కూడా ఇచ్చారు.  మరి కాంగ్రెస్‌ తన ప్రస్తుత వైఖరిని ఇందిరతో పోల్చుకోగలదా?

ఇందిర, పీవీ నరసింహారావు లాంటి వ్యక్తి కాదు. హిందుత్వకు సన్నిహితుడు కానప్పటికీ మెతక లౌకికవాదం ప్రదర్శించడమే కాకుండా తన ‘ధోవతీలో కాకీ నిక్కర్‌ ధరించినందుకు’గాను పీవీని కాంగ్రెస్‌ పార్టీ తృణీకరించింది, పార్టీలో ఆయనకు స్థానం లేకుండా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు మళ్లీ పార్టీ పాత తరహా కరడుగట్టిన లౌకికవాదానికి మళ్లాలని డిమాండు చేస్తున్నారు. లౌకికవాదంపైగానీ, హిందుత్వపైగానీ ఇందిర మెతకవైఖరితో వ్యవహరించారని కాంగ్రెస్‌ పార్టీలో ఎవరూ ఆరోపించలేరు. సైద్ధాంతికత కంటే రాజకీయానికే ఆమె ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆర్‌ఎస్‌ఎస్‌/జనసంఘ్‌ను అసహ్యించుకున్నప్పటికీ, వారిని దేశపటం నుంచి పరిత్యజించాలని ఆమె అనుకోలేదు. ఆరెస్సెస్‌పై ఆమె  ఆరోపణ ఏమిటంటే, అది స్వాతంత్య్రోద్యమంలో భాగం కాకుండా బ్రిటిష్‌ వారితో కుమ్మక్కయిందనే. వీరసావర్కర్‌ని ఆరెస్సెస్‌ చేతిలో పెట్టాలని ఇందిర భావించలేదు. ఆరెస్సెస్‌కి ఒక పెద్ద సమస్య ఉంది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న నిజమైన హీరోలు ఎవరూ ఆ సంస్థకు లేరు. కాంగ్రెసేతర నేతలైన భగత్‌ సింగ్, సుభాష్‌ చంద్రబోస్‌ను కూడా వారి భావజాలం నుంచి ఆరెస్సెస్‌ తొలగించివేసింది.

గాంధీ, నెహ్రూ వంశానికి చెందని ఎవరినైనా కౌగిలించుకోవడానికి ఆరెస్సెస్‌ సిద్ధంగా ఉంది. మోదీ ప్రభుత్వం ఇప్పుడు నెహ్రూ కంటే సర్దార్‌ పటేల్‌ని భారత గణతంత్ర రాజ్య సంస్థాపకుడిగా ఎత్తిపట్టాలని చూస్తోంది. కానీ పటేల్‌ ఎన్నడూ ఆరెస్సెస్‌ అభిమాని కాదని, గాంధీ హత్య తర్వాత ఆ సంస్థను పటేల్‌ నిషేధించారని మర్చిపోవద్దు. ఆరెస్సెస్‌ పట్ల ఆయనకు వ్యతిరేకత ఉన్నప్పటికీ, నెహ్రూతో పటేల్‌ విభేదాలు మరింత బలంగా ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్‌ నుంచి బీజేపీ లాగేసుకున్న తొలి ప్రముఖ వ్యక్తిగా పటేల్‌ నిలిచారు.ఆరెస్సెస్‌ మేధావి, దాని అధికార వాణి ఆర్గనైజర్‌ సంపాదకుడు శేషాద్రి ఒక ముఖ్యమైన రాజ కీయ అంశాన్ని లేవనెత్తారు. ఇందిర జనసంఘ్‌ /బీజేపీలను హిందుత్వపార్టీగా ఎన్నడూ వర్ణించలేదు. తన రాజకీయాలను హిందూయిజానికి వ్యతిరేకంగా ఆమె ఎన్నడూ నిలపలేదు లేదా మెజారిటీ ప్రజానీకం విశ్వాసాన్ని తన ప్రధాన ప్రత్యర్థులకు ఆమె ఎన్నడూ అప్పగించలేదు. బనియా పార్టీగా మాత్రమే వారిని ఆమె కొట్టివేసేది. జనసంఘ్, బీజేపీలను హిందూ పార్టీగా పిలిస్తే హిందువుల నుంచి రాజకీయ మద్దతు వారికి లభిస్తుంది. బనియాలు అని ముద్రిస్తే వారు ఓట్లపరంగా అతి చిన్న బృందానికి పరిమితం అవుతారు. పైగా జనసంఘ్, బీజేపీలు సంపన్నులకు, వడ్డీవ్యాపారులకు, లాభాపేక్షగల వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినందున, గ్రామీణ ప్రాంతంలో చాలామంది హిందువులు బీజేపీ పట్ల పెద్దగా అనుకూలంగా ఉండేవారు కాదు. అందుకే ఇందిర వారిని సమాజానికి ఏమాత్రం మంచి చేయని ఫక్తు వ్యాపారులుగా, బనియాలుగా ముద్రించి తృణీకరించేవారు.

సోనియా గాంధీ హయాంలో కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని బని యాలపై కాకుండా హిందుత్వపై, హిందూయిజం పైకి మళ్లించిందని శేషాద్రి వ్యాఖ్యానించారు. ఇందిర కాంగ్రెస్‌కు, నేటి కాంగ్రెస్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. ఇందిర వామపక్ష మేధావులను తన దర్బారులో చేర్చుకుని, తన రాజకీయాలకోసం వారి ఆలోచనలను వాడుకున్నారు. కానీ సోనియా మాత్రం వామపక్షాలను, వారి మేధావులను దూరం పెట్టి తన రాజకీయాలను నడిపారు. ఇందిర వారసులు జాతీయవాదం, మతం, సోషలిజం వంటి అంశాలపై భీకర రాజకీయ త్రిశూలధారులైన మోదీ, షాల బీజేపీని ఎదుర్కొంటున్నారు. వీరిని సోనియా–రాహుల్‌ కాంగ్రెస్‌ ఎలా ఎదుర్కోగలుగుతుంది? శబరిమల, ట్రిపుల్‌ తలాక్, అయోధ్య వంటి ప్రతి అంశంలోనూ కాంగ్రెస్‌ ఓడిపోయింది. కరడుగట్టిన సోషలిజాన్ని మాత్రమే కాంగ్రెస్‌ తిరిగి పాటిస్తూ జాతీ యవాదాన్ని, మతాన్ని, సంస్కృతిని బీజేపీకి అప్పగించేటట్లయితే లోక్‌సభలో 52 స్థానాలు దానికి దక్కడం కూడా అదృష్టమేనని చెప్పాలి. రాజకీయ వేత్తకాని మన్మోహన్‌ సింగ్‌ దాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఆయన పార్టీ మాత్రం సింగ్‌ మాటల్ని ఎన్నడూ వినలేదు.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement