ఉదయాన్నే జ్యోతిష్కుడు వచ్చి కూర్చున్నాడు! అమిత్‌షాకు నుదుటి మీద పెద్ద బొట్టు పెట్టి, మెడలో రుద్రాక్ష మాల వేసి, చేతిలో కొన్ని తాళపత్రాలను పెడితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఆ జ్యోతిష్కుడు.
‘‘అమ్మగారు పిలిపించారు స్వామిగారూ’’ అన్నాడు లే చి నిలబడి!
చెయ్యి చూసేవాడు పైచెయ్యిగా ఉండాలి. పైకి లేచి నిలబడకూడదు. డౌటొచ్చింది నాకు. తెలిసే చేతులు చూస్తున్నాడా? తెలుసుకోడానికి చేతులు చూస్తున్నాడా?
‘‘కూర్చోండి’’ అన్నాను.
‘మీరు కూర్చున్నాకే..’ అన్నట్లు నిలబడిపోయాడు!
జ్యోతిష్కుడికి అతి వినయం, మిత భాషణం పనికిరావు. అతడి దగ్గర రెండూ ఉన్నాయి.
నా చెయ్యి ఇవ్వకూడదని డిసైడ్ అయిపో యాను. ‘‘ఢిల్లీలో అప్పుడే చలి మొదలైనట్లుంది’’ అంటూ చేతుల్ని లాల్చీలో పెట్టుకుని కూర్చున్నాను.
‘‘అవునవును స్వామిగారూ’’ అంటూ తనూ చేతుల్నీ రుద్దుకుంటూ కూర్చున్నాడు! చలి లేకుండానే నాకోసం చేతులు రుద్దుకుంటున్నాడంటే.. నా సంతోషం కోసం లేనివి కూడా ఉన్నట్లు చెప్పేస్తాడు.
‘‘బాగా నిద్ర పట్టేసింది. లేవడం కొద్దిగా ఆలస్యం అయింది’’ అన్నాను.
‘‘అమ్మగారు చెప్పారు స్వామిగారూ.. మీరు మంచి నిద్రలో ఉన్నారని’’ అన్నాడు.
‘‘చెప్పండి జ్యోతిష్కుడు గారూ నా ఫ్యూచర్ ఎలా ఉంది’’ అని అడిగాను. ‘‘ఫ్రెష్‌గా ఉంది’’ అన్నాడు!
‘‘నా ముఖం ఎలా ఉందని కాదు నేను అడిగింది జ్యోతిష్కుడు గారూ.. నా ఫ్యూచర్ ఎలా ఉందీ అని..’’ అన్నాను.
‘‘ముఖం ఫ్రెష్‌గా ఉంటే, ఫ్యూచరూ ఫ్రెష్‌గా ఉంటుంది స్వామిగారూ.. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ఫ్యూచర్’’ అన్నాడు! అని, తన చేతిని చూసుకుంటూ ఉండిపోయాడు!
‘‘నా చెయ్యి ఇమ్మంటే ఇస్తాను జ్యోతిష్కుడు గారూ.. మీ చెయ్యెందుకు చూసుకుంటున్నారు’’ అని అడిగాను.
‘‘చూసుకోవడం కాదు స్వామిగారూ.. కాలిక్యులేషన్స్ వేసుకుంటున్నాను’’ అని నావైపు చూసి నవ్వాడు.
‘‘రాహువు మీ జన్మస్థానాన్ని వదిలిపెట్టే రోజు దగ్గరపడింది. జీవితం దేదీప్యమానంగా ఉండబోతోంది’’ అన్నాడు!
‘‘ఆల్రెడీ దేదీప్యమానంగానే ఉంది కదా జ్యోతిష్కుడు గారూ.. డెబ్భయ్ ఎనిమిదేళ్ల వయసులో హాయిగా నిద్రపట్టడం కన్నా జీవితానికి దేదీప్య మానం ఏముంటుంది?’’ అని అన్నాను.
జ్యోతిష్కుడు నవ్వాడు. మీకు నిద్రపట్టడం గురించి కాదు స్వామిగారూ నేను చెబుతున్నదీ.. మీరు మీ పార్టీకి నిద్రపట్టనివ్వక పోవడం గురించి’’ అన్నాడు.
అతడిపై నమ్మకం కుదిరింది.
చేతులు జోడించి నమస్కరించాను.
- మాధవ్ శింగరాజు
సుబ్రహ్మణ్యం స్వామి (బీజేపీ) రాయని డైరీ
Published Sun, Sep 24 2017 12:57 AM | Last Updated on Sun, Sep 24 2017 12:57 AM
Advertisement