ఒక్క ఉద్యోగీ బాబుకు ఓటెయ్యడు..! | Single Employe Did Not Vote For Chandrababu Naidu Says EX IPS | Sakshi
Sakshi News home page

ఒక్క ఉద్యోగీ బాబుకు ఓటెయ్యడు..!

Published Wed, Jun 13 2018 12:48 AM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

Single Employe Did Not Vote For Chandrababu Naidu Says EX IPS - Sakshi

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఉద్యోగీ, అధికారీ చంద్రబాబుకు ఓటేసే ప్రసక్తే లేదని, బాబుకు దక్కేదల్లా అశోక్‌ బాబు ఓటు మాత్రమేనని మాజీ ఐపీఎస్‌ అధికారి, వైఎస్సార్‌సీపీ నేత మహమ్మద్‌ ఇక్బాల్‌ తేల్చి చెప్పారు. టెలి కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, సీఎం మీటింగులు, మంత్రుల మీటింగులతో ఉద్యోగుల శక్తి పూర్తిగా డస్సిపోతోందని, బాబు వ్యవహారంతో ఏపీ ఉద్యోగులు విసిగిపోయారని పేర్కొన్నారు. ఊహాలోకాల్లో విహరించే నేత సీనియర్‌ అయినా, అనుభవం ఉన్నా ఇక మనకు వద్దని ఆంధ్ర ప్రజానీకం తేల్చేసుకున్నారని, విద్య, ఆరోగ్యం అందరికీ అందిస్తానంటున్న జననేత జగన్‌కు ఈ దఫా ఎన్నికల్లో తిరుగులేకుండా పట్టం కట్టనున్నారంటున్న మహమ్మద్‌ ఇక్బాల్‌ అభిప్రాయం ఆయన మాటల్లోనే...

వైఎస్సార్‌సీపీలో చేరాలని మీరెందుకు భావించారు?
ఇప్పుడు సింగపూర్‌లు, ఊహాలోకాలు కాదు మనకు కావలసింది. వైఎస్‌ జగన్‌ ఏపీ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టి వెళుతున్నారు. చదువు, ఆరోగ్యం, రైతుల, గ్రామాల భవితమీద ఈ నాయకుడు దృష్టి పెడుతున్నాడు. దీనికి భిన్నంగా బాబు ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు. ఆయన కాళ్లు భూమ్మీద లేవు. 2022, 2030, 2050 ఇలా సంఖ్యల వల్లింపును జనం నమ్ముతారని నేననుకోవడం లేదు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే నాయకుడు ఇక్కడ ఉన్నాడు. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరాను.

వైఎస్సార్, బాబు పాలనలో తేడా ఏమిటి?
వైఎస్సార్‌ ఎప్పుడు, ఏది మాట్లాడినా 25 నిమిషాలకు మించి మాట్లాడేవారు కాదు. బాబు మాత్రం ఎప్పుడు మాట్లాడినా రిపోర్టర్లు సైతం స్విచాఫ్‌ చేసుకుని కూర్చుంటారు. ఎక్కడ మాట్లాడినా, ఏది మాట్లాడినా సేమ్‌ స్పీచ్‌. అదే ప్రసంగం. వైఎస్సార్‌ మాట్లాడేది తక్కువ, పనిచేసేది ఎక్కువ. పైగా ఆయన ఉద్యోగులకు, అధికార్లకు స్వేచ్ఛ ఇచ్చేవారు. అదే బాబు ప్రభుత్వంలో మంత్రులకు కూడా ఫ్రీడమ్‌ లేదు. ఈరోజు మంత్రులు చేసే పనేమిటంటే, బాబు చెప్పినప్పుడల్లా ప్రతిపక్షనాయకుడినీ, ఇతర పార్టీలను తిట్టడం మాత్రమే. వైఎస్సార్‌ హయాంలో ఫలానా అధికారి, ఉద్యోగి టీడీపీ మద్దతుదారు. అన్నా కాస్త చూడండి అని ఎవరైనా పార్టీ మనుషులు రిపోర్ట్‌ చేస్తే వైఎస్‌ వెంటనే నో అనేవారు. అధికార్లు ఏ ప్రభుత్వం ఉంటే దానివద్ద పనిచేయాల్సిన వాళ్లు. వాళ్ల వద్ద మనం పనిచేయించుకోవాలి అనేవారు. అంత స్వేచ్ఛను ఇచ్చారు కాబట్టే అధికారులందరూ వైఎస్‌ హయాంలో తమ హృదయంతో పనిచేశారు.

జన నాయకుడిగా జగన్‌పై మీ అభిప్రాయం?
ఆయన ప్రజల ప్రాథమిక  సమస్యలపై దృష్టి పెట్టిన మనిషి. పేదరికాన్ని ఎలా తొలగించాలి? సంక్షేమ పథకాలను అందరికీ ఎలా అందించాలి? అట్టడుగున ఉన్నవారిని ఏవిధంగా పైకి తీసుకురావాలి? వీటిపైనే జగన్‌ దృష్టి పెడుతున్నారు. అంతేతప్ప హేతుబద్ధత, నైతికత  ఏమాత్రం లేని వాగ్దానాలు చేయడం లేదు. సింగపూర్‌ని నిర్మిస్తాను. ప్రపంచ పటంలో న్యూయార్క్‌ని తలదన్నే సుందర నగరం నిర్మిస్తా అని అనటం లేదు. ఇంత తక్కువ కాలంలో మరో ఢిల్లీని ఏపీలో ఎలా నిర్మిస్తారు? నాలుగేళ్లలో రెండు బిల్డింగులు కూడా సరిగా కట్టలేకపోయారు. ఇంకో నాలుగేళ్లలో మరో రెండు బిల్డింగులు కట్టగలరు తప్ప.. దేశంలోనే తలదన్నే నగరాన్ని ఎలా కడతారు?

వచ్చే ఎన్నికల్లో పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ప్రజలు మార్పును బలంగా కోరుకుంటున్నారు. 2014లో బాబుకు అనుభవం ఉంది జగన్‌కు ఆ అనుభవం లేదుకదా.. కాబట్టి ఈసారికి బాబుకే ఓటేద్దాం అని జనం భావించారు. కానీ ఆ అనుభవం ఏమిటో జనాలకు బాగానే తెలిసి వచ్చింది. మైత్రీబంధం ఉన్న కేంద్రం వద్ద నుంచే నిధులు తేలేకపోయారు. ప్యాకేజీ ముద్దు అని మొదలు పెట్టి ఇప్పుడు హోదాకు మారి యూటర్న్‌ తీసుకోవడం చూశారు. నాలుగేళ్లుగా భవంతుల నిర్మాణంపైనే దృష్టి పెట్టారు తప్ప పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలు గురించి ఆలోచించిన పాపాన పోకపోవడం కూడా జనం చూశారు. అందుకే వచ్చే ఎన్నికల పట్ల జనం చాలా స్పష్టంగానే ఉన్నారు. సందేహమే లేదు. 

బాబు పాలనపై అధికారులు ఏమనుకుంటున్నారు?
ఒక్క అధికారి కూడా బాబు ప్రభుత్వ పనివిధానం పట్ల సంతృప్తితో లేరు. ఎందుకంటే వాళ్లు తాము చేసే పనిని ఆస్వాదించడం లేదు. రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. ఒక్క ఉద్యోగి కూడా టీడీపీ ప్రభుత్వానికి ఓటేయరు. ఈ విషయాన్ని నేను తేల్చి చెబుతున్నాను. అశోక్‌బాబు రాజకీయాల్లోకి వస్తే ఆయన ఒక్కరే టీడీపీకి ఓటేయవచ్చు. ఆయన తప్ప ఏ ఉద్యోగీ బాబుకు ఓటేయరు. ఎందుకంటే ఉద్యోగులు పని చేయాలనుకుంటున్నా ఈ ప్రభుత్వంలో పనిచేయలేక పోతున్నారు. సేవ చేయాలన్నా సేవ చేయించుకునే వాతావరణం లేక వాళ్లకు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. ఉద్యోగులు, అధికారులు  మొత్తంగా ఇలాగే ఫీలవుతున్నారు. వాళ్లు పనిచేసే వాతావరణమే లేదు. ఒకరు ఆఫీసర్‌ టెలీకాన్ఫరెన్స్‌ అంటారు. ఇక సీఎం దగ్గరనుంచి టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, మీటింగులు, తర్వాత పబ్లిక్‌ మీటింగులు, సీఎం మీటింగులు.. ఇవన్నీ అయిపోతే మంత్రుల మీటింగులు. ఈ స్థితిలో ప్రభుత్వ సేవకులుగా తాము ఎప్పుడు ఫలితాలు ఇవ్వగలుగుతాము అనే తీవ్ర ఒత్తిడిలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. 

2019లో ఏపీలో వచ్చేది ఏ ప్రభుత్వం?
ఏ నాయకుడు మన సమస్యలు తీర్చగలరో వారిదే ప్రభుత్వం. మీ సింగపూర్‌లు, మీ రియల్‌ ఎస్టేట్‌లు, మీ దళారీ పనులు, మీ జన్మభూమి వ్యవస్థలు, ఈ దోపిడీలు వద్దు అని జనం విసిగిపోయి ఉన్నారు. పాలక పార్టీ నాయకులకు మేలు చేసే నీరు–మట్టి తరహా పథకాలు మాకొద్దు. మాకు కావలసింది విద్య, ఆరోగ్యం. వాటిని కల్పిస్తానని చెబుతున్న నాయకుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మాండంగా పట్టం కట్టబోతున్నారని నా అభిప్రాయం.

ఆంధ్రప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
ఇప్పుడు మనకు కావలసింది సీనియారిటీ, అనుభ వం కాదు. ఇప్పుడు మనకు కావలసింది ప్రజల మౌలిక అవసరాలు తీర్చి, ప్రజల సంక్షేమాన్ని కోరే నాయకుడు కావాలి. ప్రజావసరాలను తీర్చడం అనే అంశంపైనే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మొత్తంలో ఆలోచిస్తున్నారు. ప్రజల ప్రాథమిక, మౌలిక అవసరాలను తీర్చే నాయకుడినే మనం ఎన్నుకుందాం. ఎక్కడో ఊహాలోకాల్లో విహరించే నాయకుడు సీని యరైనా, అనుభవం ఉన్నవాడైనా మనకు వద్దు.

(ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://bit.ly/2y1bVrA
https://bit.ly/2JCdJsA

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement