రజాకార్ల దురాగతాలు జరుగుతున్న రోజులవి. హైదరాబాద్‌తో సహా పరిసర గ్రామాలు కూడా భయాందోళనలలో గడుపుతున్న చీకటి రోజులవి. రజాకార్ల హింసను భరిం చలేక మునగాల పరగ ణాలలోనూ అల్లర్లు చెలరేగాయి. మునగాల పర గణా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమే. వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్ నందిగామ తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండేవారు. ఆంధ్ర రాష్ట్రావతరణ జరిగిన తరువాత విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ఏర్పాటుకు కృషి జరుగుతున్న కాల మది, ప్రకాశం పంతులు గారు జగ్గయ్యపేట చేరుకున్నారు.
దుర్గాసదాశివేశ్వర ప్రసాద్ ప్రకాశం గారికి ఆ ప్రాంత ప్రజల స్థితిగతులు వివరించారు. పంతులుగారు ఆ వివరణతో తృప్తి చెందక మునగాలకు పోదామన్నారు. తాను స్వయంగా అక్కడి వారిని కలిసి బాగోగులు తెలుసుకోవాల న్నారు. ఆ రోజులలో నిజాం రాష్ట్రంలో ప్రయాణ మంటే ఆత్మహత్యే అని, రజాకార్లు దారి దోపిడీ చేస్తారని, హత్యలు కూడా చేస్తారని స్థానిక ఎస్‌ఐ వచ్చి పంతులు గారిని వారించారు. ఏమి జరిగినా సరే వెళ్లి తీరవలసిందే. అక్కడ మనవాళ్లు అగచాట్లు పడుతూఉంటే మనం ఇక్కడ ఉబసుపోక మాటలు చెప్పుకుంటు ఉంటామా.. వెళ్లి తీరాలి అన్నారు.
కారు బయలుదేరి పోలేటి (నిజాం సరిహద్దు) వద్ద ఆగింది. ఆవలివైపు రోడ్డుకు అడ్డంగా పెద్ద మోకు ఉంచారు. రజాకార్లు కత్తులతో పచార్లు చేస్తున్నారు. పంతులుగారు పరిస్థితి అంతా గమనించి డ్రైవర్‌తో ‘నీ నైపుణ్యం చూపవలసిన సమయమిది.. రివ్వున వారి మధ్యనుంచే కారు పోనీ.. నేనున్నానుగా,’ అని గర్జించాడు. డ్రెవరు కూడా సింహం పక్కనుండగా సాహసంతో కారు ను మెరుపులా దూసుకు పోనిచ్చాడు. మోకు తెగి దూరంగా పడిపోయింది. రజాకార్లు హాహాకారాలు చేస్తూ కొద్ది దూరం వెంబడించారు. కారు దూసుకు పోయింది. కోదాడ చేరినారు. మళ్ళీ అక్కడ కూడా రజాకార్లు అడ్డగించారు. కారు దిగమన్నారు. బెది రించారు. పంతులుగారు దిగలేదు. వాళ్ళ ప్రశ్న లకు సమాధానం కూడా చెప్పలేదు.ప్రకాశం గారిని కిందకు లాగడానికి రజాకార్లు యత్నించారు.
ఇదంతా గమనించిన కలెక్టరు.. ప్రకాశంగారి దగ్గరకు వచ్చి అయ్యా నేను మీ శిష్యుడ్ని. మాది కర్నూలు, మీరు ప్రాక్టీసు చేస్తుండగా మీ వద్ద పని చేశాను. లోనికి వచ్చి టీ తీసుకోండి అని మర్యా దగా ఆహ్వానించాడు. టీ తాగుతుండగా కలెక్టరు గారు పంతులుగారిని వెనక్కు తిరిగి వెళ్లిపొమ్మని ప్రాధేయపడ్డాడు. మాటతప్పడం, వెనుతిరగడం ప్రకాశం పంతులుగారి నైజం కాదు. ప్రమాదమె క్కడో ప్రకాశం అక్కడ. రజాకార్ల మధ్యనుంచే కారులో పంతులుగారు మునగాల చేరుకుని వారి సమస్యలను తెలుసుకుని. త్వరలో మీ కష్టాలు పోతాయి. హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ (విశాలాంధ్ర) ఏర్పడబోతోంది. రజాకార్లను పార దోలే రోజులువచ్చాయని వారికి ధైర్యం చెప్పారు. ఇంతటి తెగింపు, సాహసం, ధైర్యంలోనూ ఆయ నలోని శాంతికపోతం, సుస్పష్టంగా గోచరిస్తుంది.
బ్రిటిష్ గుండుకు తన గుండె చూపిన, రజా కార్లను ఎదిరించి వారి సెల్యూట్ స్వీకరించిన ఏకైక తెలుగు తేజం ప్రకాశం పంతులు. ఆజన్మాంతం ప్రకాశంగారు ప్రజల క్షేమం, సర్వ తోము ఖాభి వృద్ధిని కోరి సర్వస్వాన్ని త్యాగం చేసిన ధన్య జీవి. అందుకే ఆయన్ని ప్రజల మనిషి ప్రజా బంధు, దీనజనోద్ధారకుడు అని ప్రజలు కొనియాడారు. ఈ చిరస్మరణీయ సాహస కృత్యంలో ప్రకాశంగారితో పాటు స్వయంగా పాల్గొన్న సదా శివేశ్వర ప్రసాద్ గారంటారు ‘‘పంతులుగారి యశస్సు చిరస్థాయి. ఆయన ధన్య జీవి. ప్రకాశం గారి అనుచరుడుగా వర్తించగల భాగ్యం కలిగినందుకు గర్విస్తున్నాను.’’
(23–08–2019న ప్రకాశం పంతులు గారి 148వ జయంతి సందర్భంగా)
టంగుటూరి శ్రీరాం
వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి,
ప్రకాశం అభివృద్ధి, అధ్యయన సంస్థ
హైదరాబాద్.
మొబైల్ : 9951417344
Comments
Please login to add a commentAdd a comment