
విశ్లేషణ
లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారిలో చెల్లించలేకపోయినవారు 7 శాతం ఉండగా, కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగగొట్టిన వారు 93% ఉన్నారు. ఇప్పుడు వారి ప్రతినిధులే బ్యాంకుల ప్రైవేటీకరణ డిమాండ్ చేయటం విచిత్రం. ఈ బ్యాంకుల కుంభకోణాలన్నీ డిపాజిటర్ల, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను పణంగా పెట్టి జరుగుతున్నవే. ఈ ఆర్థిక నేరాలన్నీ బ్యాంకుల అత్యున్నత అధికారులు రుణాల ఎగవేతదారులతో చేతులు కలుపడంవల్ల జరిగినవే.
నోట్ల రద్దు కుంభకోణాన్ని భారత ప్రజలు ఇంకా మరచిపోలేదు. ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఆ చర్యను నల్లధనంపై ఆకస్మిక దాడిగా అభివర్ణించారు. ఈ వ్యవహారాన్ని చాలా రహస్యంగా ఉంచినట్లు, మంత్రులకు సైతం తెలియదన్నట్లు ఒక విధమైన అభిప్రాయాన్ని కలిగించారు. కాని పెద్దనోట్ల కట్టలు, కట్టలు తెంచుకొని ప్రవహించినట్టు స్వయంగా అధికార పార్టీకే చెందిన శాసనసభ్యుడు ప్రకటించడం అందరనీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సామాన్య ప్రజలు నోట్లు మార్చుకోవడానికి చేంతాడు లాంటి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. అనేక మంది ఆ క్యూలలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
కొంతమంది బ్యాంకుల ఖాతాదారులు ఏటీయంల ద్వారా గాని, చెక్కుల ద్వారా గాని తాము దాచుకున్న ధనాన్ని పొందలేకపోతున్నారు. దీని ప్రభావం ఇంకా సగటుజీవిని పీడిస్తూనే ఉన్నది. నల్లధనం మాత్రం బయటపడలేదు. మొన్న హర్షద్ మెహతా, నిన్న మద్యం చక్రవర్తి విజయ్ మాల్యా కేవలం ఒకే ఒక్క భారతీయ స్టేట్ బ్యాంక్‌కు రూ. 7,000 కోట్లు ఎగగొడితే, ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాక్ నుంచి నీరవ్ మోదీ తదితర గణం రూ. 14,000 కోట్లు ఎగగొట్టిన సంగతి వెల్లడైంది. ఈ బ్యాంకులోని అనేక అవకతవకలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
కార్పొరేట్ దిగ్గజాలు, ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఈ కుంభకోణాలకు సామాన్య గుమాస్తాలను (చిరుద్యోగులను) బాధ్యులను చేయాలని చూస్తున్నారు. కార్యాలయ ఉన్నతాధికారికి తెలియకుండా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం సాధ్యం కాదనేది నిర్వివాదాంశం. పరిశ్రమాధిపతుల సంఘం సైతం కుంభకోణాల ఆరోపణలను గుమాస్తాల మీదకు ¯ð డుతున్నారు. గ్యారంటీలను ఇచ్చినప్పటికి, ఒక లక్ష రూపాయల రుణం పొందటం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు. రిజర్వ్‌బ్యాంక్ ప్రతి బ్యాంక్ నిర్వహణ, నిర్వాకాలపై తనిఖీ చేయాలి. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఈ తనిఖీ జరగడం లేదనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
అందరి జాతకాలు ఉన్నాయి
అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం, అధికారుల సంఘాలు ఒక పుస్తకాన్ని ప్రచురించాయి. ఎంతమంది కార్పొరేట్ దిగ్గజాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఏ బ్యాంకు నుండి ఎన్ని కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకొన్నారు? వారు ఎన్ని సంవత్సరాల నుండి ఎంత చెల్లించాల్సి ఉంది వంటి వివరాలు అందులో వెల్లడించారు. ఈ పారు బాకీలు దాదాపు రూ. 15 లక్షల కోట్లకు చేరుకొన్నాయి. ఇవన్నీ నిరర్ధక ఆస్తులుగా ప్రకటించే అవకాశముంది. వీటితోపాటు కార్పొరేట్ దిగ్గజాలు ప్రతి సంవత్సరం ఆరులక్షల కోట్ల రూపాయల రాయితీలు పొందుతున్నాయి.
ఈ కార్పొరేట్ సంస్థలే కుంభకోణాలకు చిరుద్యోగులను బాధ్యులుగా చిత్రీకరిస్తూ, ఈ సమస్యకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణే శరణ్యమని వాదిస్తున్నారు. రుణాల ఎగవేతదారుల పట్ల కఠినవైఖరి అవలంబించని వారంతా ఈనాడు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని గగ్గోలు పెడుతున్నారు. బ్యాంకులకు రుణాల ఎగవేతదారుల పట్ల సౌమ్యంగా వ్యవహరించే అధికారులే ఈనాడు బ్యాంకులకు నష్టాలు తేవడానికి బాధ్యులు.
ఆర్థిక శాఖ, రిజర్వుబ్యాంక్, ప్రభుత్వం, ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్యాంకు నష్టాలకు, అవకతవకలకు వీరందరి మౌనమే ప్రధాన కారణం. వీరంతా సామాన్య క్లర్కుల మీద తప్పిదాలను నెట్టివేయడానికి అసలు కారణమేమిటంటే బ్యాంక్ ఉద్యోగుల తరచు ఆందోళనలలో ఇలాంటి అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేయాలని, వీరిని అరెస్టు చేయాలని, పాస్‌పోర్టులను రద్దు చేయాలని, కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేయటమే.
దిగ్భ్రాంతి కలిగించే విషయమేమిటంటే ఒక్క బ్యాంకుకే రూ. 7,000 కోట్లు ఎగవేసిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు బీజేపీ రాజ్యసభ సీటు కేటాయించడం. మాల్యా, నీరవ్ మోదీ, ఆయన సోదరునితో సహా కుటుంబం మొత్తం దేశ సరిహద్దులను సౌకర్యంగా దాటి పోవడం దేశాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. నీరవ్ మోదీ అయితే, ‘మీకు చేతనైంది చేసుకోండి’ అని ప్రభుత్వానికి సవాలు విసరడం మరొక ఆశ్చర్యకరమైన విషయం.
2016 లోనే బెంగళూరుకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి నీరవ్ మోదీ బ్యాంకులకు రుణాలు ఎగగొట్టాడని, అతన్ని అరెస్టు చేయాలని, పాస్‌పోర్ట్ రద్దు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినా ఫలి తం లేకపోయింది. నీరవ్ ఈ జనవరిలోనే దేశం వదిలి పారిపోవడంతోపాటు, అదే నెల 23–26 తేదీలలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో నరేంద్ర మోదీతో గ్రూపు ఫొటోకు పోజు ఇవ్వడం అనేక అనుమానాలకు దారితీస్తున్నది.
చిరుద్యోగులను బలి చేస్తారా?
కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకోవడానికి చిరుద్యోగులే ఈ కుంభకోణానికి కారణమని, అందుకే ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని గోలపెడుతున్నది. అదే నిజమైతే బ్యాంకుల జాతీయీకరణకంటే ముందు 200 ప్రైవేటు బ్యాంకులు ఎందుకు మూతపడ్డాయి? అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్‌తో సహా అనేక కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు మూత పడ్డాయి. అమెరికాలో సైతం, లేమాన్ బ్రదర్స్, మెర్రిల్ లించ్, ఏఐడి, ఫ్రెడ్డి, మాక్ ఫాన్న్‌మాక్, హెచ్‌బీఓఎస్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ మూత పడ్డాయి.
ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకులే. అందువల్ల అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ కుదుటపడటానికి ఫెడరల్ గవర్నమెంట్ 236 బిలియన్ల (1 బిలియన్=100 కోట్లు) డాలర్లను వెచ్చించింది. ఈ అర్థశతాబ్దకాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు అత్యద్భుతంగా అభివృద్ధి చెందాయి. దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం శాఖలు విస్తరించాయి. ఈ బ్యాంకులు సన్నకారు రైతాంగానికి, చిరువ్యాపారులకు రుణాలిచ్చి ఆదుకుంటే కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం ఉమ్మడిగా వీటిపై దుమ్మెత్తి పోస్తున్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకులు, రాజకీయ జోక్యంతో, రుణమేళాలు పెట్టి బ్యాంకులను దివాలా తీయించారని ఆరోపిస్తున్నారు.
లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారిలో చెల్లించలేకపోయినవారు 7శాతం ఉండగా, కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగగొట్టిన వారు 93% ఉన్నారు. ఇప్పుడు వారి ప్రతినిధులే బ్యాంకుల ప్రైవేటీకరణ డిమాండ్ చేయటం విచిత్రం. ఈ బ్యాంకుల కుంభకోణాలన్నీ డిపాజిటర్ల, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను పణంగా పెట్టి జరుగుతున్నవే.
ఈ ఆర్థిక నేరాలన్నీ బ్యాంకుల అత్యున్నత అధికారులు రుణాల ఎగవేతదారులతో చేతులు కలుపడంవల్ల జరిగినవే. ప్రభుత్వరంగ బ్యాంకులలో అప్పులు తీసుకునే వారికి 90 రోజుల గడువుతోనే అవగాహనా పత్రాలను అందజేస్తారు. బ్యాంక్ నియమావళికి విరుద్ధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాజ మాన్యం 365 రోజులకు ఈ అవగాహనా పత్రాన్ని అందజేసింది. ఈ బ్యాం కులో ఈ తతంగం అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నది. నిర్ధారిత కాలంలో అప్పుతీసుకొన్న వ్యక్తి డబ్బు చెల్లించకపోతే విదేశాలలోని బ్యాంక్ శాఖలు తిరిగి అప్పు ఇచ్చి ఉండాల్సిందికాదు.
రుణం తీసుకొన్న వారి ఆస్తుల విలువ మొత్తం రుణం మొత్తం కంటే ఎక్కువ ఉందా లేదా అనేది సాధారణమైన పరిజ్ఞానంతో అంచనా కడతారు. దానివల్ల బ్యాంకుకు ఏమైనా నష్టం వస్తుందా అనే అంశంపై అంచనా వేస్తారు. ఆస్తుల రహస్యమేమిటంటే బ్యాంక్‌లో జరిగే ఆర్థిక నేరాన్ని అరికడితే మేనేజర్‌కు వచ్చే ప్రోత్సాహకాలు లేవు. కాబట్టి మేనేజర్ అప్పు తీసుకొన్నవారితో చేతులు కలిపితే అతనికి ముడుపులు ముట్టడం ఖాయం.
ఆ బిల్లుతో ప్రజల డిపాజిట్లకు ఎసరు
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పైనాన్షియల్ రిజల్యూషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లును ముందుకు తీసుకొస్తున్నది. ఇదొక మోసపూరిత నల్లచట్టం. పార్లమెం ట్‌లో చెవులు, కళ్లు మూసుకొని మందబలంతో ఒకసారి ఈ బిల్లును ఆమోదిస్తే పట్టపగలు డిపాజిటర్ల సొమ్మును ప్రభుత్వం లాగేసుకొని డిపాజిటర్లను వీధిన పడేస్తుంది.
డిపాజిటర్ల సొమ్ము నుండి కార్పొరేట్లకు రుణాలను అందజేస్తే వీరు విదేశాలకు వెళ్లి తందనాలాడుతుంటే తద్వారా బ్యాంక్‌లకు నష్టం వాటిల్లితే, ఆ బ్యాంక్ డిపాజిటర్ల సొమ్ముతో, పన్ను చెల్లింపుదార్ల సొమ్ముతో ఆదుకోవడం ఈ బిల్లు లక్ష్యం. వీటినే ‘బేల్ ఇన్’ అని అంటారు. ఇలాంటి బ్యాంకులను ప్రభుత్వ ఖజానా నుండి గాని డిపాజిటర్ల సొమ్ము నుండి గాని ఆదుకోవడానికి ఈ బిల్లు అధికారాన్ని ఇస్తుంది. ప్రభుత్వమే చెల్లిస్తే ‘బేల్ అవుట్’ అంటారు. ఈ వార్త బయటికి పొక్కగానే బ్యాంకుల నుండి డిపాజిట్లు ఉపసంహరించుకోవటం చకచకా జరిగిపోయింది. ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకొనే యంత్రాలలో డబ్బులు లేని పరిస్థితి దాపురించింది. ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కానీ, ఫైనాన్షియల్ బిల్లు కానీ జవాబు కానేరదు.
కానీ ఇలాంటి రుణ ఎగవేతదారుల పాస్‌పోర్టులను రద్దు చేయడం, వాళ్ల ఆస్తులను జప్తు చేయడం జరగాల్సిందే. రుణ ఎగవేతదారులందరిని వెంటనే అరెస్టు చేయాలి. వారిని జైళ్లకు పంపి కఠినంగా శిక్షించాలి. విదేశాలకు పారిపోయిన వీరిని వెంటనే ఇంటర్‌పోల్ సహకారంతో వెనక్కి రప్పించాలి. వారికి సహకరించిన బ్యాంకు ఉన్నతాధికారులను, బాధ్యతలను విస్మరించిన వారందరిని కఠినంగా శిక్షించాల్సిందే. ప్రభుత్వరంగ బ్యాంకులను పరిరక్షించాలి. ప్రైవేటీకరణ డిమాండ్‌ను నిరాకరించాలి.
సురవరం సుధాకరరెడ్డి
వ్యాసకర్త గౌరవాధ్యక్షులు, ఎ.పి., తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, భారత కమ్యూనిస్టుపార్టీ మాజీ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment