ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల్ని అప్పుగా తెచ్చి అమరావతిలో చేసే కాంక్రీట్ నిర్మాణాల వల్ల.. పరిశ్రమలు వస్తాయా? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయా? వ్యవసాయరంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతాయా? రాజధాని ప్రాంతంలో బలవంతంగా రైతులనుండి ‘‘ల్యాండ్ పూలింగ్’’ పేరున భూములు పోగొట్టుకొన్న రైతాంగానికి కడుపు నింపుతుందా లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం. కానీ, ఒక్కటి మాత్రం నిజం. తెలుగుదేశం ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న ఈ అప్పులు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారి, భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు, ప్రభుత్వాలకు పెనుశాపాలుగా కానున్నాయి.
ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తల్లా వ్యవహరించాలన్నది ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. ప్రజలు కట్టే పన్నులే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయవనరులు కనుక ప్రభుత్వ నిర్వహణలో ఎటువంటి దుబారా లేకుండా ఆచితూచి ఖర్చు చేస్తూ... పొదుపు చర్యలు పాటించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు విషయానికి వస్తే ఇతర దేశాలు, రాష్ట్రాలు అనుసరిస్తున్న పొదుపు పంధాకు విరుద్ధంగా ఇక్కడి పాలకులు వ్యవహరించడం గత నాలుగున్నరేళ్ళుగా గమనిస్తున్నాం. రాష్ట్రం విడిపోయాక.. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయం తగ్గింది. రోజువారీ ఖర్చులక్కూడా తడుముకోవాల్సి వస్తున్నదని తొలిరోజు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చెప్పుకొచ్చారు. అధికారం చేపట్టిన రెండో మాసంలోనే.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని ప్రజల ముందుంచింది.
2014 జూలైలో ఆర్థిక రంగంపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం 22వ పేజీలో ఉదహరించిన అంకెల ప్రకారం 2014 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 1,61,014 కోట్లు. అందులో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సంక్రమించిన అప్పు రూ. 92,461 కోట్లు. ఈ మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో 19. 4%గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ. 15,850 కోట్ల మేర అప్పులు స్వీకరించే అవకాశం ఉందని కూడా అందులో పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి’’ అని స్పష్టం చేశారు. నిజానికి, 2004–2014 మధ్య పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా అంచులకు చేరిందని, సహేతుకమైన రీతిలో రాష్ట్రాన్ని విభజించనందువల్ల ఆర్థిక కష్టాలు పెరిగాయని ప్రచారం చేయడానికే ‘శ్వేతపత్రం’ విడుదల చేశారన్నది నిర్వివాదాంశం.
ఇక, శ్వేతపత్రంలో పేర్కొన్నట్లు వట్టిపోయిన ఏపీ ఖజానాను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు.. ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారని, పొదుపు మంత్రం జపిస్తారని, ఆర్థిక పరిస్థితిని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దారని, పరిపాలన పారదర్శకంగా ఉంటుం దని అందరూ భావించారు. కానీ, అధికారం చేపట్టిన తొలిరోజునుంచే చేతికి ఎముకేలేదన్నట్లు నూతన ప్రభుత్వం ధారాళంగా దుబారా చేయడం చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి పరిపాలన మొదలుపెట్టిన ప్రారంభంలోనే సెక్రటరియేట్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు చాంబ ర్లను వందల కోట్లు ఖర్చుచేసి ఆధునీకరణ పనులు చేపట్టారు. హైదరాబాద్ సెక్రటరియేట్‌లో సీఎం, మంత్రుల చాంబర్లు ముస్తాబయిన కొద్ది రోజుల వ్యవధిలోనే ‘ఓటుకు కోట్లు’ ఉదంతం బయటపడింది. ‘‘పదేళ్లకు ఒక్క రోజు తక్కువ కాకుండా హైదరాబాద్‌లోనే ఉంటాం.. ఎవరేమి చేస్తారో చూస్తాం’’ అని టీఆర్‌ఎస్ నేతలకు సవాళ్లు విసిరిన ఏపీ మంత్రులు సీఎం ఆదేశాలతో మూటాముల్లె సర్దుకొని మారు మాట్లాడకుండా విజయవాడకు తరలివెళ్లిపోయారు. అమరావతిలో తాత్కాలిక సెక్రరియేట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెక్రటేరియేట్‌లో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఏపీ సీఎం, మంత్రుల చాంబర్లు వినియోగంలో లేక బూజులు పట్టాయి. కానీ, వాటికి గత నాలుగేళ్లుగా కరెంట్, నీళ్లు ఇతరత్రా సౌకర్యాలకు బిల్లులు మాత్రం చెల్లిస్తూనే ఉన్నారు.
ప్రాధాన్యతల విస్మరణ
రాష్ట్ర ప్రభుత్వం చేసే దుబారా ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. సాగునీటి రంగంలో ప్రాజెక్టులకు పెంచేసిన అంచనాలు, చేస్తున్న ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే. ఏపీ విభజన బిల్లు ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉండగా దానిని రెండున్నరేళ్లపాటు పక్కనపెట్టి.. తమ పార్టీ మేనిఫెస్టోలోగానీ, ఎన్నికల ప్రచార సభల్లో గానీ కనీస ప్రస్తావనలేని పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. పట్టిసీమ అంచనాలు రూ. 1300 కోట్లుగా నిర్ధారించి.. సకాలంలో దానిని పూర్తిచేస్తే కాంట్రాక్టర్‌కు ప్రాజెక్టు అంచనాల మీద 22% అదనంగా బోనస్ ఇస్తామన్న నిబంధన పెట్టి.. నిర్ణీత గడువులోగా.. ప్రాజెక్టు పేర్తి అయినట్లు చూపించడానికి పాత పంపులు రెండు తెచ్చి బిగించి.. వాటి ద్వారా నీళ్లు వదిలి.. కాంట్రాక్టర్‌కు బోనస్‌గా దాదాపు రూ. 300 కోట్లు చెల్లించేశారు. సహజంగా సకాలంలో కాంట్రాక్టర్ పనిపూర్తి చేయకపోతే పెనాల్టీ నిబంధన ఉంటుంది గాని, పూర్తిచేస్తే ‘‘బోనస్ ఇస్తాననడం, ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఇది ప్రజాధనాన్ని దుబారా చేయడం కాదా! ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇలా చేయడం సబబా? ఇటీవల ‘కాగ్’ తన నివేదికలో ‘పట్టిసీమ ప్రయోజనం శూన్యం’ అని తేల్చిన విషయం
గమనార్హం!
అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అప్పులు చేస్తున్నది. అమరావతి రాజధానిని 3 దశల్లో నిర్మించడానికి రూ. 48,110 కోట్లుగా అంచనావేసి.. అందులో 36 పనుల్ని రూ. 26,600 కోట్లతో చేపట్టారు. ప్రభుత్వ వివరాల ప్రకారం ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్, విజయబ్యాంక్‌ల నుంచి రూ. 2,060 కోట్లు; హడ్కో నుంచి రూ. 14,050 కోట్లు అప్పులు తీసుకున్నారు. బాండ్ల ద్వారా రూ. 2,000 కోట్లు సేకరించారు. కేంద్రం ఇచ్చింది రూ. 1500 కోట్లు. ఇవికాక ప్రపంచ బ్యాంకు నుండి మరో రూ. 8,300 కోట్లు, హడ్కో నుంచి రూ. 6,200 కోట్లు, వివిధ బ్యాంకుల నుంచి రూ. 10,000 కోట్లు మొత్తం రూ. 24,500 కోట్లు అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ అప్పుల వివరాల సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉంచడం లేదు. అప్పులు తెచ్చి చేస్తున్న వ్యయానికి లెక్కలు లేవు. రాజధాని నిర్మాణం పనులకోసమని తెస్తున్న అప్పులతో చేపట్టిన పనులను కేవలం 5 సంస్థలకే కట్టబెట్టారు.
ఇన్ని అప్పులు చేసి చేస్తున్న పనులను చూస్తే.. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్లు, 7 ప్రయార్టీ రోడ్లు, 3 అడిషినల్ ప్రయార్టీ రోడ్లు, బ్రిడ్జి, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియేట్ భవనాలను నిర్మిస్తున్నారు. ఎక్కడాలేని విధంగా ఒక్కో కిలోమీటర్ రోడ్డుకు అత్యధికంగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. దొండపాడుఉండవల్లి రోడ్డుకు కిలోమీటర్‌కు రూ. 12 కోట్లు; కృష్ణాయపాలెంనెక్కల్ని రోడ్డుకు కిలోమీటర్‌కు రూ. 18 కోట్లు; ఉద్దండరాయపాలెంనిడమర్రు రోడ్డుకు కిలోమీటర్‌కు రూ. 17 కోట్లు చొప్పున చెల్లిస్తున్నారు. పప్పు బెల్లాలు పంచినట్లు ఇష్టానుసారం పనుల్ని అప్పజెప్పారు. ఎక్కడా పారదర్శకత లేదు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో తెలియదు.
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ !
అనుభవజ్ఞుడైన వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే విభజిత ఆంధ్రప్రదేశ్ త్వరలో కోలుకోగలుగుతుందన్న ఏకపక్ష వాదనను ఒక వర్గం మీడియా సహకారంతో తెరపైకి తెచ్చి ప్రజలు భావోద్వేగాలను సొమ్ము చేసుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు.. నాలుగేళ్లల్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనేది ఈనాటి ప్రజాభిప్రాయం. బాబు సీఎంగా అయ్యేనాటికి విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 92,461 కోట్లు ఉండగా.. 2018 మార్చి నాటికి మొత్తం అప్పు రూ. 2,25,234 కోట్లుకు చేరింది. నాలుగేళ్లల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం రూ. 1,32,773 కోట్లు. విభజన నాటికి అప్పు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 19.4% ఉండగా ప్రస్థుతం అది 28.79% నికి పెరి గింది. ‘‘ఎఫ్‌ఆర్‌బిఎం’’ నిబందనల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏటా చేసే అప్పుల శాతం 3% మించరాదు. కానీ, ఆ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. ఈ అప్పులతోనే రాష్ట్రం సరిపెట్టుకోవడం లేదు.
అమరావతి బాండ్ల రూపంలో ఇప్పటికే రూ. 2,000 కోట్లు సేకరించింది. తాజాగా మొత్తం రూ. 20,000 కోట్ల మేర సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తమే కాక.. రాజధాని కోసం ప్రత్యేకంగా బాండ్ల పేరుతో రుణాలు సేకరణకు శ్రీకారం చుట్టారు. వాటి వివరాలను బయట పెట్టడం లేదు. పరిమితంగా అప్పులు తెచ్చి వాటిని ఆస్తుల కల్పనకు ఉపయోగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, తెచ్చిన అప్పులను సహేతుకంగా ఖర్చు చేయకుండా మితిమీరిన దుబారా చేయడాన్ని ఆర్థిక నిపుణలు తప్పు పడుతున్నారు. అమరావతి బాండ్ల ద్వారా నిధులను సేకరించడం కోసం 10.32% వడ్డీ చెల్లించాలని నిర్ణయించడంతో అసలు కంటే వడ్డీ ఎక్కువయ్యే ప్రమాదం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ విడుదల చేసిన బాండ్లపై 8.9% వడ్డీ చెల్లిస్తుండగా, పూణే మున్సిపల్ బాండ్లపై 7.59% మాత్రమే చెల్లిస్తున్నారు. కాగా, అమరావతి బాండ్లను విడుదల చేసిన సిఆర్‌డిఐకు ఆదాయం ఏవిధంగా లభిస్తుందన్నది ప్రశ్నార్థకం. చంద్రబాబునాయుడు నిర్మించ తలపెట్టిన రాజధానిలో అడుగడుగునా ప్రజలపై పన్నులు విధిస్తారని అర్థమవుతూనే ఉంది.
ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల్ని అప్పుగా తెచ్చి అమరావతిలో చేసే కాంక్రీట్ నిర్మాణాల వల్ల.. రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటన్నది ప్రశ్నార్థకం. ప్రపంచస్థాయి రాజ ధాని వల్ల పరిశ్రమలు వస్తాయా? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయా? వ్యవసాయరంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతాయా? రైతుల ఆదాయం పెరుగుతుందా? గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాలు మెరుగవుతాయా? గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయా? రాజధాని ప్రాంతంలో బలవంతంగా రైతుల నుండి ‘‘ల్యాండ్ పూలింగ్’’ పేరున భూములు పోగొట్టుకొన్న రైతాంగానికి కడుపు నింపుతుందా లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం. కానీ, ఒక్కటి మాత్రం నిజం. తెలుగుదేశం ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న ఈ అప్పులు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారి, భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు, ప్రభుత్వాలకు పెనుశాపాలుగా మారనున్నాయి.
- డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు
మొబైల్ : 99890 24579
Comments
Please login to add a commentAdd a comment