ఇప్పటికీ నెరవేరని స్వప్నం | Vakulabharanam Krishnamohan writes on appointments of BC commissions | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ నెరవేరని స్వప్నం

Published Wed, Dec 6 2017 3:47 AM | Last Updated on Wed, Dec 6 2017 3:48 AM

Vakulabharanam Krishnamohan writes on appointments of BC commissions - Sakshi

బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించడానికి డా‘‘ అంబేడ్కర్‌ చేసిన తీవ్ర ప్రయత్నం గత 52 ఏళ్లుగా బీసీ కమిషన్ల నియామకాలకే పరిమితం కావడం విషాదం. బీసీలపై శీతకన్ను విషయంలో జాతీయ ప్రతిపక్షానిదే ప్రధానపాత్ర.

దాదాపు 70 ఏళ్ల తరువాత బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు లభించే చారిత్రక ఘట్టంలోనూ.. నాడు అధికారపక్షంగా, నేడు ప్రతిపక్షంగా తన ఆలోచనా విధానంలో, దృక్పథంలో, వైఖరిలో ఎలాంటి మార్పును తెచ్చుకోకపోవడంతో ఆ జాతీయ పార్టీ నైజం ఏమిటో బీసీలు గమనిస్తూనే ఉన్నారు. భారత రాజ్యాంగపిత డా‘‘ బి.ఆర్‌. అంబేడ్కర్‌ బీసీల కోసం చేసిన కృషి మధ్యలోనే ఆగిపోయింది.

సెప్టెంబర్‌ 27, 1951 నాడు నాటి కేంద్రప్రభుత్వంలో తొలి న్యాయశాఖ మంత్రిగా తన పదవికి రాజీనామా చేసిన అనంతరం బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆవిష్కరించిన ప్రసంగం పాఠంలోని మాటలు..  ‘‘ప్రభుత్వం పట్ల నేను అసంతృప్తి చెందిన మరొక విషయం గురించి ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను. అది వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్‌ కులాలకు సంబంధించినది. వెనుకబడిన వర్గాల కోసం ఎలాంటి రక్షణలను కూడా రాజ్యాంగం పొందుపర్చనందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఈ అంశాన్ని రాష్ట్రపతి నియమించిన కమిషన్‌ ప్రతిపాదనల ప్రాతిపదికపై కార్యనిర్వాహక ప్రభుత్వానికి వదిలిపెట్టడం జరిగింది. మనం రాజ్యాంగాన్ని ఆమోదించి సంవత్సరం పైబ డింది. కాని కమిషన్‌ నియామకం గురించి ప్రభుత్వం కనీసం ఆలోచించడమే లేదు’’.

ఎంతగా కృషి చేసినప్పటికీ బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించలేక పోయినందుకు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తీవ్రంగా మథనపడ్డారు. 26 జనవరి 1950లో అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ సామాజికంగా విద్యా, ఉపాధి రంగాలలో వెనుకబడిన తరగతులను గుర్తించడానికి ఎలాంటి చర్యలను చేపట్టకపోవడం పట్ల అసహనాన్ని ప్రదర్శించారు. ఆర్టికల్‌ 340 ద్వారా కనీసం బీసీ కమిషన్‌ని కూడా ఏర్పాటు చేయించలేకపోయినందుకు ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇలా జరగడం పట్ల తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.

డా‘‘ అంబేడ్కర్‌ రాజీనామా అనంతర రాజకీయ పరిణామాలు, ఒత్తిడుల నేపథ్యంలో 1953లో జాతీయ స్థాయిలో మొదటి బీసీ కమిషన్‌ (కాకా కాలేల్కర్‌)ను నియమించడం జరిగింది. ఆ కమిషన్‌ 1955లో తన నివేదికను సమర్పించింది. కాగా సిఫారసులు ఏకగ్రీవంగా లేవని నాటి నెహ్రూ ప్రభుత్వం ఈ ప్రక్రియను పక్కన పెట్టింది. తదనంతర పరిణామాలలో 26 ఏళ్ల తరువాత 1979లో జాతీయ స్థాయిలో 2వ బీసీ కమిషన్‌ (బీపీ మండల్‌)ను మొరార్జీదేశాయ్‌ నాయకత్వంలోని జనతాపార్టీ నియమించింది. మండల్‌ కమిషన్‌ 31 డిసెంబర్‌ 1979న నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌కు నివేదికను సమర్పించింది. కానీ ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది. పదేళ్ల తరువాత 1990లో వీపీ సింగ్‌ నాయకత్వంలోని జనతాదళ్‌ ప్రభుత్వం మండల్‌ సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్‌లను అమలులోకి తెచ్చింది. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడానికి ఉద్దేశించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలలో లోక్‌సభలో తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్రమంత్రిమండలి నిర్ణయించడం శుభ పరిణామం. గత చేదు అనుభవం నేపథ్యంగా సమావేశాల ఆరంభానికి ముందు సంశయాల నివృత్తికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఆ దిశగా నరేంద్రమోదీ ప్రత్యేక చొరవ తీసుకుంటే ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లు పార్లమెంట్‌ ఉభయసభలలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమోదం పొందే వీలు కలుగుతుంది.

ఈ బిల్లును మోదీ ప్రభుత్వం గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టడం, ఆమోదింపజేయడం జరిగింది. అయితే అక్కడ కూడా బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించిన జాతీయ ప్రతిపక్షానికి మెజారిటీ లేకపోవడం వల్ల చేష్టలుడిగి విఫలమైంది. బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాన ప్రతిపక్షం మినహా అన్ని రాజకీయ పార్టీలు అనుమానాలను నివృత్తి చేసుకొని బిల్లుకు సంపూర్ణంగా మద్దతునిచ్చాయి. ప్రధాన ప్రతి పక్షం మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంలో ఒక కీలక ఘట్టాన్ని గమనిం చాలి. ప్రభుత్వానికి నిజాయితీగా పేద వర్గాలకు ఏదైనా చేయాలని సంకల్పం ఉంటే రాజకీయాలతో పనిలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడుగులు ముందుకు వేయడం గమనించాలి. ఇవాళ దేశ మంతా ఈ గొప్ప పరిణామాన్ని తెలంగాణలో చూడవచ్చు. పార్టీ జెండాలకు, ఎజెండాలకు భిన్నంగా బీసీల సమగ్ర వికాసానికి ఎవరు ఎలాంటి సూచనలు చేసినా స్వీకరించి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తారు.

ఎలాగూ తిరిగి ఉభయసభలు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాల్సి ఉన్నందున ఆమోదయోగ్యమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవడం సముచితం. ఇందుకు జూలై 7, 2017న బెంగళూరులో జరి గిన దక్షిణాది రాష్ట్రాల బీసీ కమిషన్‌ల సమావేశం నిర్దిష్టంగా చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలి.

ఈ సమావేశాలలోనైనా బిల్లు ఉభయ సభలలో ఆమోదింపచేయడానికి కేంద్రప్రభుత్వం అంకితభావంతో కృషి చేసినప్పుడే బీసీల చిరకాల స్వప్నం సాకారమవుతుంది.
(డిసెంబర్‌ 6న డా‘‘ బి.ఆర్‌. అంబేడ్కర్‌ వర్ధంతి)


- డా‘‘ వకుళాభరణం కృష్ణమోహనరావు

వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు మొబైల్‌ : 98499 12948

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement