Vakulabharanam krshnamohan
-
త్వరలో దక్షిణాది బీసీ కమిషన్ల సదస్సు
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోని బీసీ కమిషన్లతో త్వరలో సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ దిశగా ఏర్పాట్లు వేగవంతం చేశామన్నారు. కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే నేతృత్వంలోని బృందం గురువారం రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణ బీసీ కమిషన్ కార్యా లయాన్ని సందర్శించింది. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల సదస్సును విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇటీవల జారీ చేసిన టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆధారంగా నిర్ధిష్టమైన పద్దతిలో అధ్యయనం ప్రారంభించామన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీలకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరించారు. అనంతరం టీ–బీసీ కమిషన్ సభ్యులు కిషోర్‌గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్ తదితరులు కర్నాటక ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. -
బీసీ కమిషన్ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్‌గా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిషన్‌కు సభ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ వ్యవహరించనుం డగా..కమిషన్ సభ్యులుగా సీహెచ్. ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్, కె.కిషోర్‌గౌడ్‌లు ఉంటారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. పూర్తిస్థాయి ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత తొలి బీసీ కమిషన్‌లో సభ్యులుగా వకుళాభరణం సేవలందించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్‌ని నియమించింది. -
ఇప్పటికీ నెరవేరని స్వప్నం
బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించడానికి డా‘‘ అంబేడ్కర్ చేసిన తీవ్ర ప్రయత్నం గత 52 ఏళ్లుగా బీసీ కమిషన్ల నియామకాలకే పరిమితం కావడం విషాదం. బీసీలపై శీతకన్ను విషయంలో జాతీయ ప్రతిపక్షానిదే ప్రధానపాత్ర. దాదాపు 70 ఏళ్ల తరువాత బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు లభించే చారిత్రక ఘట్టంలోనూ.. నాడు అధికారపక్షంగా, నేడు ప్రతిపక్షంగా తన ఆలోచనా విధానంలో, దృక్పథంలో, వైఖరిలో ఎలాంటి మార్పును తెచ్చుకోకపోవడంతో ఆ జాతీయ పార్టీ నైజం ఏమిటో బీసీలు గమనిస్తూనే ఉన్నారు. భారత రాజ్యాంగపిత డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ బీసీల కోసం చేసిన కృషి మధ్యలోనే ఆగిపోయింది. సెప్టెంబర్ 27, 1951 నాడు నాటి కేంద్రప్రభుత్వంలో తొలి న్యాయశాఖ మంత్రిగా తన పదవికి రాజీనామా చేసిన అనంతరం బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆవిష్కరించిన ప్రసంగం పాఠంలోని మాటలు.. ‘‘ప్రభుత్వం పట్ల నేను అసంతృప్తి చెందిన మరొక విషయం గురించి ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను. అది వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినది. వెనుకబడిన వర్గాల కోసం ఎలాంటి రక్షణలను కూడా రాజ్యాంగం పొందుపర్చనందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఈ అంశాన్ని రాష్ట్రపతి నియమించిన కమిషన్ ప్రతిపాదనల ప్రాతిపదికపై కార్యనిర్వాహక ప్రభుత్వానికి వదిలిపెట్టడం జరిగింది. మనం రాజ్యాంగాన్ని ఆమోదించి సంవత్సరం పైబ డింది. కాని కమిషన్ నియామకం గురించి ప్రభుత్వం కనీసం ఆలోచించడమే లేదు’’. ఎంతగా కృషి చేసినప్పటికీ బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించలేక పోయినందుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ తీవ్రంగా మథనపడ్డారు. 26 జనవరి 1950లో అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ సామాజికంగా విద్యా, ఉపాధి రంగాలలో వెనుకబడిన తరగతులను గుర్తించడానికి ఎలాంటి చర్యలను చేపట్టకపోవడం పట్ల అసహనాన్ని ప్రదర్శించారు. ఆర్టికల్ 340 ద్వారా కనీసం బీసీ కమిషన్ని కూడా ఏర్పాటు చేయించలేకపోయినందుకు ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇలా జరగడం పట్ల తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. డా‘‘ అంబేడ్కర్ రాజీనామా అనంతర రాజకీయ పరిణామాలు, ఒత్తిడుల నేపథ్యంలో 1953లో జాతీయ స్థాయిలో మొదటి బీసీ కమిషన్ (కాకా కాలేల్కర్)ను నియమించడం జరిగింది. ఆ కమిషన్ 1955లో తన నివేదికను సమర్పించింది. కాగా సిఫారసులు ఏకగ్రీవంగా లేవని నాటి నెహ్రూ ప్రభుత్వం ఈ ప్రక్రియను పక్కన పెట్టింది. తదనంతర పరిణామాలలో 26 ఏళ్ల తరువాత 1979లో జాతీయ స్థాయిలో 2వ బీసీ కమిషన్ (బీపీ మండల్)ను మొరార్జీదేశాయ్ నాయకత్వంలోని జనతాపార్టీ నియమించింది. మండల్ కమిషన్ 31 డిసెంబర్ 1979న నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌కు నివేదికను సమర్పించింది. కానీ ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది. పదేళ్ల తరువాత 1990లో వీపీ సింగ్ నాయకత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం మండల్ సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లను అమలులోకి తెచ్చింది. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడానికి ఉద్దేశించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో లోక్‌సభలో తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్రమంత్రిమండలి నిర్ణయించడం శుభ పరిణామం. గత చేదు అనుభవం నేపథ్యంగా సమావేశాల ఆరంభానికి ముందు సంశయాల నివృత్తికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఆ దిశగా నరేంద్రమోదీ ప్రత్యేక చొరవ తీసుకుంటే ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లు పార్లమెంట్ ఉభయసభలలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమోదం పొందే వీలు కలుగుతుంది. ఈ బిల్లును మోదీ ప్రభుత్వం గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టడం, ఆమోదింపజేయడం జరిగింది. అయితే అక్కడ కూడా బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించిన జాతీయ ప్రతిపక్షానికి మెజారిటీ లేకపోవడం వల్ల చేష్టలుడిగి విఫలమైంది. బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాన ప్రతిపక్షం మినహా అన్ని రాజకీయ పార్టీలు అనుమానాలను నివృత్తి చేసుకొని బిల్లుకు సంపూర్ణంగా మద్దతునిచ్చాయి. ప్రధాన ప్రతి పక్షం మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో ఒక కీలక ఘట్టాన్ని గమనిం చాలి. ప్రభుత్వానికి నిజాయితీగా పేద వర్గాలకు ఏదైనా చేయాలని సంకల్పం ఉంటే రాజకీయాలతో పనిలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు ముందుకు వేయడం గమనించాలి. ఇవాళ దేశ మంతా ఈ గొప్ప పరిణామాన్ని తెలంగాణలో చూడవచ్చు. పార్టీ జెండాలకు, ఎజెండాలకు భిన్నంగా బీసీల సమగ్ర వికాసానికి ఎవరు ఎలాంటి సూచనలు చేసినా స్వీకరించి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. ఎలాగూ తిరిగి ఉభయసభలు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాల్సి ఉన్నందున ఆమోదయోగ్యమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవడం సముచితం. ఇందుకు జూలై 7, 2017న బెంగళూరులో జరి గిన దక్షిణాది రాష్ట్రాల బీసీ కమిషన్ల సమావేశం నిర్దిష్టంగా చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలి. ఈ సమావేశాలలోనైనా బిల్లు ఉభయ సభలలో ఆమోదింపచేయడానికి కేంద్రప్రభుత్వం అంకితభావంతో కృషి చేసినప్పుడే బీసీల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. (డిసెంబర్ 6న డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి) - డా‘‘ వకుళాభరణం కృష్ణమోహనరావు వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 98499 12948 -
ముస్లింల స్థితిగతులపై బీసీ కమిషన్ పరిశీలన
నర్సంపేట : పట్టణంలోని పలు ముస్లిం కుటుంబాలను బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, జాయింట్ కలెక్టర్ హరిత సోమవారం కలుసుకున్నారు. తొలుత వారు ముందుగా ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత పట్టణంలోని మసీద్ వద్ద ఉన్న ముస్లిం కుటుంబాలను కలిసి వారి జీవన విధానం, స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ముస్లింలకు ప్రధాన వృత్తి లేదని, దుర్భర జీవితాలను గడుపుతున్నందున వివరాలు సేకరిస్తున్నామని, నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, మైనార్టీ శాఖ ఈడీ సర్వర్, వరంగల్ ఆర్డీఓ మహేందర్‌జీ, సంగూలాల్, కామగోని శ్రీనివాస్, నాయిని నర్సయ్య, వేముల సాంబయ్య, యాకుబ్, పాష, ఇర్ఫాన్, ముస్లింలు పాల్గొన్నారు. గుండ్రపల్లిలో పర్యటన నెక్కొండ(నర్సంపేట): నెక్కొండ మండలంలోని గుండ్రపల్లిలో బీసీ కమిషన్ సభ్యుడు కృష్ణమోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రజల వాస్తవ జీవన స్థితిగతులను తెలంగాణ సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కాసీ, దుదేకుల కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు అందేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు. జిల్లా కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్నబీ, సర్పంచ్ గుగులోత్ నందనాయక్ తదితరులు ఉన్నారు.