బంగారు గాజు రహస్యం! | Vardelli Murali Article On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బంగారు గాజు రహస్యం!

Published Sun, Jan 5 2020 12:18 AM | Last Updated on Sun, Jan 5 2020 4:36 PM

Vardelli Murali Article On Chandrababu Naidu - Sakshi

భువనేశ్వరమ్మ చేతి బంగారు గాజును అమరావతి ప్రాంత రైతులకు బంపర్‌ ఆఫర్‌గా చంద్రబాబు ప్రకటించారు. రాజధాని విభజన వార్తలను ఆయన జీర్ణించు కోలేకపోతున్నారు. తమ ప్రయోజనాలతో ముడిపడి వున్న అమరావతి ప్రయోగం విఫలం కాబోతున్నదన్న బెంగ ఆయనను వెంటాడుతున్నది. ఆరని దీపంలాగా ఆందోళనలు కొనసాగాలని కోరుకుంటున్నారు. అందుకే ఒక వూళ్లో బంగారు గాజును నజరానాగా ప్రకటిస్తే, మరో ఊరిలో నగదు బహుమతి ప్రకటించారు. 28 వేల మంది రైతులకు చెందిన 34 వేల ఎకరాల భూములను జూదంలో పందెంగా ఒడ్డి, అక్కడ ఒక ‘బంగారు గని’ని తవ్వుకోవాలని ఆయన ప్రయత్నించారు.

ఈ రాష్ట్రంలోని వయోజనులైన సుమారు రెండుకోట్ల మంది మహిళలు ఒకేసారి తలా ఒక బంగారు గాజును కొనుగోలు చేస్తే ఎంత ఖర్చవుతుందో అంత విలువైన సొమ్మును ఇక్కడ తవ్వుకోవాలని ప్రయత్నించినట్టు క్రమంగా తేటతెల్ల మవుతున్నది. ఈ ‘కర్తవ్య’ నిర్వహణ కోసం రెండంచెల వ్యూహాన్ని రచించారు. తొలి అంచె ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ గుట్టు కాస్తా రట్టయ్యింది. రాజధానిగా అవతరించ బోయే ప్రాంతం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి, తన బినామీలూ, అనుయాయులకు మాత్రమే రహస్యాన్ని చెవిలో వేసి అక్కడ నాలుగు వేల ఎకరాలను కారుచౌకగా కొనుగోలు చేసిన అనంతరమే, రాజధానిని ప్రకటించారన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇక రెండవ అంచె మరింత కళ్లు చెదిరే రోబోటిక్‌ ఆపరేషన్‌. సింగపూర్‌లోని ఒక ప్రైవేటు కంపెనీని రంగంలోకి దించి ఆ కంపెనీ సొంతంగా ఖర్చేమీ పెట్టకుండానే, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతులిచ్చిన భూమిలో వ్యాపారాలు చేసి ఇబ్బడిముబ్బడిగా సంపాదించే పథకం తయారు చేశారు. ప్రైవేటు కంపెనీ సంపాదనలో భీముని వాటా ఎవరిదో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

హఠాత్తుగా ఈ బంగారు కలలు కరిగిపోయే పరిస్థితి కళ్లముందు నిలవడంతో కలవరం మొదలైంది. భూములు ఇచ్చిన రైతులకు సమాధానం చెప్పుకోవల సిన బాధ్యత తోసుకొచ్చింది. అదిగో, ఆ బాధ్యతలను తప్పించుకోవడానికి కొత్త జూదాన్ని ప్రారంభించారు. ఈ జూదంలో పందెం కాసేది రైతులనే, వారి ప్రాణాలనే. మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలని రాష్ట్రపతిని కోరుతూ రైతుల చేత లేఖలు రాయించారు. ఆ లేఖల నమూనా ప్రతిని తెలుగుదేశం కార్యకర్తలు సరఫరా చేశారు. రైతు లకు ఇక ఆత్మహత్యలే గతి అంటూ గడిచిన పది రోజు లుగా అనుంగు పత్రికలు ఊదరగొడుతున్నాయి. సిండి కేటు వార్తా ఛానెళ్ల అద్దె మైకుల ముందు రైతుల చేత అవే మాటలను చెప్పిస్తున్నారు. కృత్రిమ ఉద్యమానికి ఊపు రావాలంటే ఏదో ‘పెద్ద’ ఘటన జరగాలని ప్రతిపక్ష శిబిరం కోరుకొంటున్నదని చెప్పడానికి దృష్టాంతాలు కనిపిస్తున్నవి.

ఉరుములు, మెరుపులు లేకుండా అకాల వర్షం కురి సినట్టు వేళాపాళా లేకుండా భూపాలం పాడినట్టు అక స్మాత్తుగా చంద్రబాబు అండ్‌ కో లోని శక్తులన్నీ ఒక సింగిల్‌ పాయింట్‌ ఎజెండా మీద ఏకమవుతుంటాయి. పత్రికల్లో ప్రత్యేక పేజీల నిండా వార్తలను, వ్యాఖ్యలను వండి వారుస్తారు. చానెళ్లు ఆ వార్తలకే అంకితమై పని చేస్తాయి. వివిధ పార్టీల్లో వుండే స్లీపర్‌ సెల్స్‌ నిద్ర లేస్తాయి. సన్నాయి నొక్కులు ప్రారంభిస్తాయి. జుగల్‌ బందీ కచేరీ ప్రారంభమవుతుంది. కచేరీ ప్రారంభమైం దంటే అదొక హెచ్చరిక. తీతువుపిట్ట ఎదురొచ్చి అరచి గీపెట్టి భయపెట్టిన చందం. ఊరవతల ఊడలమర్రికి వేలాడే గబ్బిలాలు నట్టింట్లో దూరి పుట్టించే కంపరం. ఏదో వైపరీత్యం ముంచుకొస్తున్నదనే ముందస్తు కబురు. మల్లెల బాబ్జీ ఖండిత శిరస్సు చెప్పిన రహస్యం ఇదే. బెజవాడ రాఘవయ్య పార్కుకు వంగవీటి మోహన రంగా ఇచ్చిన మరణ వాంగ్మూలం కూడా ఇదే. వెన్ను పోటును అభిశంసిస్తూ ఎన్టీఆర్‌ రౌద్ర కంఠం మోగించిన దండోరా సందేశం ఇదే.

రాజధాని వికేంద్రీకరణ ప్రతిపాదన రావడంతో ఇప్పుడు మళ్లీ జుగల్‌బందీ మొదలైంది. కళ్లు చెదిరే కలల సంపాదన చేజారుతుందేమోనన్న బెంగతో కంటికి నిద్ర రావడం లేదు. ఏం చేసైనా ఈ పరిణామాన్ని ఆపాలన్న తెగింపు ధోరణి కనిపిస్తుంది. కొందరు మీడియా ప్రము ఖులు కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లబ్ధిదారులేనని వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రయోజనాలే తమ ప్రయోజనాలని భావించే ఎల్లో మీడియా సంపూ ర్ణంగా రంగంలోకి దిగింది. చంద్రబాబు ఇచ్చే మనోవర్తి మీద ఆధారపడి మనుగడ సాగించే ఉపపార్టీల అధినే తలు పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగారు.

ఇతర పార్టీల్లో స్లీపర్‌ సెల్స్‌గా వున్న చంద్రబాబు కామ్రేడ్స్‌ కొందరు రాజధాని మార్పును ససేమిరా ఒప్పుకోము అంటూ ఆవులింతలు ప్రారంభించారు. 29 గ్రామాల సమస్య లను 13 జిల్లాల సమస్యగా చిత్రించేటందుకు ప్రయత్ని స్తున్నారు. చిత్తూరు జిల్లాను తమిళనాడులో కలిపేయా లని, కర్నూలు జిల్లాను కర్ణాటకలో కలపాలని తెలుగు దేశం నేతలు కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. ఇక్కడి పరిణామాలపై జాతీయ మీడియాను జాతీయ నేతలను తప్పుదోవ పట్టించడం కోసం ఒక ప్రత్యేక బృందం 24/7 పనిచేస్తున్నది. రాజధాని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ప్రత్యక్ష లబ్ధిదారైన తెలుగుదేశం పార్టీ అధికార వికేంద్రీకరణకు ససేమిరా అంటుండగా, అను బంధ మిత్రులు కొందరు తెలివిగా రెండు అంశాలను ముందుకు తోస్తున్నారు.

ఒకటి: రాజధానిని మూడు భాగాలుగా చేస్తే భూములిచ్చిన రైతులు నష్టపోతారు, ఆ భూములను ఏం చేస్తారు? రెండు: ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. అధికారంలో ఉన్న పార్టీ మారినంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయం మారకూడదు. ఈ ప్రశ్న లకు దీటైన సమాధానాలు సోషల్‌ మీడియాలో వెల్లు వెత్తుతున్నాయి. ‘‘కూతురుకు నిశ్చితార్థం చేసిన తండ్రికి, ఆ తర్వాత వరుడు పనికిమాలిన వెధవ అని తెలిసిం దనుకోండి... ఆ తండ్రి ఏం చేస్తాడు? సంబంధం క్యాన్సిల్‌ చేసుకుంటాడా... లేక నిశ్చితార్థానికి ఖర్చయిం దని సర్దుకు పొమ్మంటాడా?’’... రాజధాని అంశంపై బాగా ట్రెండ్‌ అవుతున్న కామెంట్‌ ఇది. అమరావతి నుంచి సెక్రటేరియట్, కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, సీఎం ఆఫీసు, రాజ్‌భవన్, హైకోర్టు తరలిస్తేనే 30 వేల ఎకరాలు వృధా అవుతాయా? ఒక్కో కార్యాలయానికి వేల ఎకరాలు అవసరమా? అనే ప్రశ్నలు తలె త్తుతాయి.

ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం ఎలా మారుస్తుందని కూడా కొందరు మేధా వులు ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎందుకు ఎత్తేశావని చంద్ర బాబును ప్రశ్నించలేని ఆ ‘బలహీనత’ ఏమిటో వివరిం చిన తర్వాతనే ఈ తాజా ప్రశ్నను వారు సంధించవలసి ఉంటుంది. అమరావతిని మార్చాలంటే మళ్లీ ప్రజా తీర్పును కోరవలసిందేనని ఒక కాకలు తీరిన కామ్రేడ్‌ తన శక్తిమేరకు గర్జించాడు. ఆ గర్జనను పచ్చపత్రికలు ప్రముఖంగా మొదటి పేజీలో వేశాయి. మామూలు రోజుల్లోనయితే ఆ పత్రికల్లో సదరు కామ్రేడ్‌ ఎప్పుడూ లోపలి పేజీల్లో సింగిల్‌ కాలమిస్టే. మరయితే కామ్రేడ్‌... అమరావతిని రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు పార్టీని జనం చిత్తుచిత్తుగా ఓడించారుగా. రాజధానికి భూసమీకరణ జరిపిన రెండు నియోజక వర్గాల్లోనూ టీడీపీ ఓడిపోయిందిగా... చివరకు లోకేశ్‌ బాబును కూడా ఓడించారుగా... దీనికేం సమాధానం చెబుతారు?


సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టుల గురించి కొంచెం చెప్పుకోవాలి. తెలుగు నాట కమ్యూనిస్టుల ప్రస్థానం దున్నేవాడికే భూమి నినాదంతో మొదలైంది. ఇప్పుడు అమరావతి ప్రాంత భూముల రియల్‌ ఎస్టేట్‌ ధరల కోసం తపన పడే మజిలీకి చేరుకున్నది. రెండు పార్టీలుగా కమ్యూనిస్టులు చీలిపోయిన తర్వాత ఓ ఇరవై ఏళ్లపాటు ఇరుపక్షాలకు అస్సలు పడేది కాదు. ఎమర్జెన్సీ పూర్తయిన సమయంలో అనుకుంటా, సీపీఐని ఎద్దేవా చేస్తూ సీపీఎం వారు ‘మిత వాద కమ్యూనిస్టులారా మీ ప్రయాణం పూర్తయిందా?’ అనే పుస్తకాన్ని వేసి పంచారు. ఇప్పుడు రెండు పార్టీలను కలిపి ప్రజలు అడిగే రోజు వచ్చింది. ‘‘ఆంధ్ర కమ్యూని స్టులారా... మీ ప్రయాణం పూర్తయిందా?’’ అని. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకుంటారు.

ఏడాదికోసారి సభలు పెట్టి తీర్మానాలు చేస్తారు. చంద్రబాబు హయాంలో ప్రైవేటీకరణ అంచులకు చేరిన రోడ్డు రవాణా సంస్థను అక్కున చేర్చుకొని ప్రభుత్వ శాఖగా మార్పు చేసిన జగన్‌మోహన్‌రెడ్డిలో వీరికి అభ్యుదయ వాది కనిపించడం లేదు. పేదవర్గాల ప్రజలను కేన్సర్‌ వ్యాధిలా కాల్చేస్తున్న మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఆదర్శం కని పించడం లేదు. పీడిత ప్రజల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా చేపడుతున్న ఎన్నెన్నో సంక్షేమ పథకాలను ఏనాడూ స్వాగతించిన పాపాన పోలేదు. కానీ కమ్యూ నిస్టులకు కాలం చెల్లిందని ఈసడించుకున్న చంద్ర బాబుతో కమ్యూనిస్టులకు ఎందుకు ‘కెమిస్ట్రీ’ వర్కవుట్‌ అవుతుందో ఎప్పటికీ అర్థంకాదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబు ప్రయోజనాలకు గొడుగు పట్టే పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు రాజధాని వ్యవ హారంలోనూ అంతే.


అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై ఒక అధ్యయన నివేదికను ప్రభు త్వానికి అందజేసింది. అందులోని వివరాలను విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నియమిం చిన శివరామకృష్ణన్‌ కమిటీ చేసిన సూచనలను బలపరి చేదిగానే బీసీజీ నివేదిక కూడా ఉన్నది. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి చేపట్టదగిన కార్యక్రమాలను రేఖా మాత్రంగా ఈ కమిటీ ప్రస్తావించింది. రాజధానిని మూడు ప్రాంతాల్లోని మూడు నగరాల మధ్య విభజిం చాలని సూచించింది. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్య మని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్‌ నగ రాలు ఏ రకంగా విఫలమయ్యాయో సోదాహరణంగా వివరించింది. ఒక్క నగరం మీద లక్షా ఇరవై వేల కోట్లు ఖర్చు చేయడం బూడిదలో పోసిన పన్నీరేనని అభిప్రాయపడింది.

ఆ మొత్తాన్ని సాగునీటి రంగంపై ఖర్చుచేస్తే ఐదేళ్లలో తొంభై లక్షల ఎకరాల్లో బంగారం పండు తుందని అంచనా వేసింది. ఇదే విషయంపై ఇంతకు ముందే ప్రభుత్వానికి జిఎన్‌ రావు కమిటీ ఇంకొక నివేదికను ఇచ్చింది. ఈ రెండు నివేదికల అధ్యయనానికి ప్రభుత్వం ఒక హైపవర్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇవ్వబోయే సిఫారసులను కేబినెట్‌ ఆమోదిస్తే ఈ నెలలోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరిగి శర వేగంగా తదుపరి మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తున్నది. బోస్టన్‌ గ్రూప్‌ సూచించినట్టుగా మూడు పువ్వులు (రాజధానులు), ఆరు కాయలు (ప్రాంతా లు)గా ఆంధ్రప్రదేశ్‌ వికసిస్తుందేమో వేచి చూడాలి.


భువనేశ్వరమ్మ వజ్రాలు పొదిగిన బంగారు గాజును వేలం వేస్తారని తుళ్లూరు ప్రాంతం తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటున్నారు. అలా వేలం వేసిన సొమ్మును గొడవలను బాగా రెచ్చగొట్టేవారికో లేదా బలిపశువులయ్యే వారికో బహుమతిగా ఇస్తారని చెప్పు కుంటున్నారు.

వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement