
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం(ఫిబ్రవరి1 నాటి ఫొటో)
బడ్జెట్‌కు ముందు రైతాంగం చేతిలో డబ్బులు ఆడకుండా నోట్ల రద్దు కత్తెర వేసిన బీజేపీయే, కొత్త బడ్జెట్‌లో పంటకు మద్దతు ధర పెంచనున్నట్టు, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నది. కానీ జరగబోయేదేమిటి? మద్దతు ధర పెంచే ప్రతిపాదనను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడమే. ఈలోగా 2019లో జరగవలసిన ఎన్నికలను ముందస్తుగా జరపబోతున్నట్టు వాయిదాల పద్ధతిలో ప్రకటిస్తున్నారు. అందుకే మద్దతు ధర అంశం అటకెక్కకుండా ఆగుతుందంటే నమ్మలేం.
‘చరిత్రలో దేశదేశాల సకలైశ్వర్యాల పరిరక్షణ కోసమే అన్న సాకుతో ఏర్పడిన పౌర ప్రభుత్వాలు వాస్తవానికి, పేద ప్రజలకు వ్యతిరేకంగా సంపన్న వర్గాల రక్షణ కోసం ఏర్పడినవే. లేదా ఎలాంటి ఆస్తిపాస్తులూ లేని వారికి వ్యతిరేకంగా ఆస్తులున్నవారి రక్షణ కోసం వెలిసినవే.’ – ఆడమ్ స్మిత్ (‘వెల్త్ ఆఫ్ నేషన్స్’ 1776 నుంచి)
‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్లుగా చేస్తున్నవి ఒకే రకం హామీలు. పంటలకు సరసమైన ధరలు నిర్ణయిస్తామంటూ నాలుగేళ్ల క్రితం హామీ పడింది. నాలుగేళ్లూ గడిచాయి. ఆ హామీ నెరవేరలేదు. ఇంకా, యువతకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుక్షణమే షేర్ మార్కెట్ (సెన్సెక్స్) 800 పాయింట్లు కుప్ప కూలి, ఆ మేరకు అదేస్థాయిలో ప్రభుత్వం మీద ప్రజలకున్న అవిశ్వాసం వెల్లడయింది.’ – రాహుల్‌గాంధీ (కాంగ్రెస్ అధ్యక్షుడు)
‘రైతాంగం, కార్మిక వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా బడ్జెట్ నిర్ణయాలు ఉన్నందువల్ల సర్వత్రా నిరసన వెల్లువెత్తుతోంది. ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలను అవకాశమున్న మేరకు పునరుద్ధరించే ప్రయత్నం చేయకపోగా, వాటి షేర్లను తెగనమ్మడానికి పథకం వేయడంతో పాటు, కీలకమైన 24 ప్రభుత్వం రంగ సంస్థల వాటాలను అమ్మకానికి పెట్టారు.’ – ఆరెస్సెస్/భారత మజ్దూర్ సంఘ్ (2–2– 2018)
ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహాదారు అరవింద సుబ్రహ్మణ్యం 2018–19 బడ్జెట్ సందర్భంగా విడుదల చేసిన ప్రకటన అన్నింటికంటే విచి త్రమైనది. త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ‘పంచదార పూతతో’ప్రజలను మోసగించేందుకు సిద్ధం చేసిన బడ్జెట్ అని ప్రతిపక్షాలు ఆరోపించడానికి ముందే అరవింద సుబ్రహ్మణ్యం ప్రకటన వెలువడింది. కాబట్టి ఆయన ప్రకటన కొట్టిపారేయలేనిది.
ఇది ఎన్నికల బడ్జెట్ అనే చెప్పాలి
బీజేపీ–హిందుత్వ పరివార్ పాలనలో సామాజిక శాంతి ప్రయోజనాల రక్షణ కంటే, సెక్యులర్ భావాలకు ప్రతికూలమైన పోకడలే ఎక్కువ. ఈ ధోరణులను ఇంతకుముందే పసిగట్టిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రాజన్, ఆ తరువాత పన్‌గారియా, నీతి ఆయోగ్‌కే చెందిన మరొక ప్రముఖుడు పదవీకాలాలు ముగియకుండానే వైదొలిగారు. ఇక ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఎంత స్వేచ్ఛ ఉన్నదో తెలుస్తూనే ఉంది. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయానికి రాకున్నా అరవింద సుబ్రహ్మణ్యం తాపీగా ఒక విషయాన్ని సూచించారు: ‘ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం చేసే రుణాలకూ, ఆర్థిక వ్యవస్థలో ఎదురుకాబోయే ద్రవ్యలోటుకూ మధ్య సమతౌల్యాన్ని బలవంతంగా లేదా శుద్ధ ఆర్థిక సిద్ధాంతం ద్వారా సాధించలేం. ఎందుకంటే కళ్లముందున్న (ఎన్నికలు) రాజకీయ వాస్తవాన్ని చూడకుండా కళ్లు మూసుకోలేం!’ అన్నారు (31.1.2018) అరవింద సుబ్రహ్మణ్యం. కనుకనే పరివార్ అనుయాయి శివసేన కూడా ‘కొత్తసీసాలో పాతసారా’గానే ఈ బడ్జెట్‌ను పరిగణించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి తగిలిన దెబ్బ ‘గ్రామీణ ప్రజలు ఆ పార్టీ పట్టు నుంచి దూరమైపోతున్నారని చెప్పడానికి నిదర్శనం’ అని కూడా శివసేన వ్యాఖ్యానించింది.
నిజానికి ఈ నాలుగేళ్ల బీజేపీ పాలనలో వివాదాస్పద ఘటనలే ఎక్కువ. పెద్ద నోట్ల రద్దు చాలా కృత్రిమమైన పద్ధతి. మరింత కృతకంగా దేశ విదేశీ కార్పొరేట్ల పెట్టుబడుల విస్తృతికి అనుకూలంగా ప్రత్యక్ష పన్నులకు కోత పెట్టి మధ్య తరగతి, చిన్న వ్యాపారులు, చేతి వృత్తుల వారిపైన పరోక్ష పన్నులను పెంచింది. ప్రజల జీవనాన్ని తారుమారు చేసింది. బడ్జెట్‌కు ముందు రైతాంగం చేతిలో డబ్బులు ఆడకుండా నోట్ల రద్దు కత్తెర వేసిన బీజేపీయే, కొత్త బడ్జెట్‌లో పంటకు మద్దతు ధర పెంచనున్నట్టు, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నది. కానీ జరగబోయేదేమిటి? మద్దతు ధర పెంచే ప్రతిపాదనను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడమే. ఈలోగా 2019లో జరగవలసిన ఎన్నికలను ముందస్తుగా జరపబోతున్నట్టు వాయిదాల పద్ధతిలో ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఈ తరుణంలో రైతు మద్దతు ధర అంశం అటకెక్కకుండా ఆగుతుందంటే నమ్మలేం.
ఒక చేత్తో ఇస్తారు, మరో చేత్తో లాగేస్తారు
ఒకవేళ మద్దతు ధర పెంచే యోచన అమలులోకి వస్తే, ఆ ధరను కూడా మింగేసే ప్రయత్నాలు మరో పక్క జరుగుతున్నాయనిపిస్తుంది. లబ్ధి చేకూర్చే మద్దతు ధరను సాధించడానికి అవసరమైన మెరుగైన రాలుబడికి కావలసిన పనిముట్లు, ఎరువులు, రసాయనాల ధరలను సగటున రూ. 150 నుంచి రూ. 200 వరకు పెంచాలని నిర్ణయించడమంటే రైతాంగం పట్ల పాలకులకు ఉన్న చిత్తశుద్ధి వెల్లడవుతుంది. రైతు ఆదాయం రెట్టింపు చేయాలని ప్రభుత్వం ప్రకటన ఒకవైపు, ఎరువుల కంపెనీలు ధరలు పెంచేయడం మళ్లీ పెంచాలని భావిస్తున్నట్టు (వచ్చే జూన్‌కు) ఏం రుజువు చేస్తుంది? ఇది ఆడమ్ స్మిత్ సూత్రాన్ని మరోసారి రుజువు చేస్తోంది.
ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అధికారం కోసం దేనిమీద ఆధారపడుతున్నట్టు? అవినీతి ఊబిలోకి పాలకులు దించిన భారతంలో భాగస్వాములవుతున్న కార్పొరేట్ల చేతుల్లో పెరుగుతున్న కొన్ని దేశవాళీ రేటింగ్ సంస్థలూ, విదేశీ రేటింగ్ సంస్థలూ దేశీయోత్పత్తుల సగటు విలువను (జీడీపీ) నిర్ణయిస్తున్నాయి, లేదా తారుమారు చేసి చూపుతున్నాయి. పాలకులు విదేశీ పెట్టుబడుల రాకను యథేచ్ఛగా ఆమోదించినప్పుడు జీడీపీ విలువ తగ్గుదలలో ఉన్నా, దానిని ఎక్కువ చేసి చూపుతున్నాయి. లేదా విదేశీ పెట్టుబడుల ప్రవేశానికి పాలకులు ప్రజల ఒత్తిడివల్ల ఏ మాత్రం అభ్యంతరం కనబరచినా పెట్టుబడులను నిలిపివేయడం కూడా ఈ విదేశీ రేటింగ్ ఏజెన్సీల ఎత్తుగడ. మన అభివృద్ధి రేటు గత 30 ఏళ్ల నాటికన్నా ఇప్పుడు కుదించుకుపోయిందని భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసుయే ప్రకటించారు (24.1.18). ఈ పెనుగులాటలోనే ప్రజల్ని నమ్మింపజేసేందుకు 6.2 శాతంగా ఉన్న దేశాభివృద్ధి అకస్మాత్తుగా 7.5 శాతానికి లేదా క్షణాలలో 8 శాతానికి పైనా పెరుగుతున్నట్లు కృత్రిమంగా చూపడానికి ఈ సంస్థల ద్వారా మోదీ ప్రభృతులు ప్రయత్నిస్తున్నారు. ఇండియా ‘సంపన్న దేశాలలో ఆరవ స్థానంలో ఉందంటే హర్షించాల్సిందే. కానీ చైనా కన్నా మనం రెండేళ్ల ముందు స్వాతంత్య్రం పొందాం. కానీ చైనా మనకన్నా శరవేగాన ముందుకు దూసుకుపోవడమేగాక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా తరువాత మూడవ స్థానంలో ఉన్న జపాన్‌ను అధిగమించింది. అమెరికాను కూడా రేపో మాపో అధిగమించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించనున్నదని అమెరికా అధికార ప్రకటనలే వెల్లడిస్తున్నాయి. మనకన్నా రెండేళ్ల తర్వాత విమోచన పొందిన చైనా, 250 ఏళ్లలో ప్రపంచ సామ్రాజ్య శక్తిగా అవతరించిన అమెరికాను ప్రపంచ శక్తిగా తోసిరాజనగలగడం ఏమిటి?
ప్రజా ప్రయోజనాలకు రక్షణేది?
ఇంతకూ తేలవలసిన అసలు విషయం– ‘అభివృద్ధి’ దండకంలో ఉన్న బీజేపీ, దేశంలో వస్తు తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్) పరిశ్రమల్ని స్వయంగా దేశవాళీ పరిశ్రమలుగా తీర్చిదిద్దవలసిన తరుణంలో ‘మేక్ ఇన్ ఇండియా’ ముద్ర చాటున అమెరికా కంపెనీల ప్రవేశానికి అవకాశాలు, వెసులుబాట్లు కల్పిం చడం దాదాభాయి నౌరోజీ, ఆర్‌సీ దత్, గాంధీజీ ఆశించిన ‘స్వదేశీ భావన’కు పూర్తి విరుద్ధం కాదా? విద్య, ఆరోగ్యం, రోజువారీ వ్యవసాయ, కార్మిక, పార్ట్‌టైం ఉపాధిలో ఉన్న పారిశ్రామిక వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల పరిరక్షణకు, ఉద్యోగావకాశాల కల్పనకు కొత్త బడ్జెట్‌లో తగిన భరోసా లేదు. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన వివిధ సర్వేక్షణ నివేదికల అంచనా ప్రకారం– ఒక ప్రసిద్ధ భారత వస్త్ర పరిశ్రమలో పనిచేసే ఉన్నతాధికారి పొందే వేతనం పొందగల స్థాయికి గ్రామీణ భారతంలో కనీస వేతనం పొందే కూలీ నాలీ/జీతగాళ్లు చేరుకోవాలంటే కనీసం 900 సంవత్సరాలు పడుతుందని తేలింది.
అందువల్ల దేశ నాయకత్వం చేయవలసిన పని– దేశ ఆర్థిక వ్యవస్థ అందరికీ సమానావకాశాలు, సమాన న్యాయం, వివక్షలేని స్వేచ్ఛ కల్పించాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని పాటించడమేగానీ కృత్రిమ సంపాదనల ద్వారా ‘అదృష్టరేఖలు’ చూసుకుంటున్న వారికి అండదండలుగా నిలవడం కాదు. కావలసింది ప్రజా ప్రయోజనాలను కాపాడగల నిర్దిష్ట విధానాల ఆచరణ. ‘నయా ఉదారవాద రాజకీయాలు’ ఫాసిజానికి దారులు వేయకూడదు. అమలు జరపని ఆకర్షిత నినాదాల ద్వారానే నాజీ హిట్లర్ చాపకింద నీరులా ఫాసిజానికి దారులు పరిచాడు.
బహుశా ఇది దృష్టిలో పెట్టుకునే ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త రాజీవ్ భార్గవ (వర్ధమాన సమాజాల అధ్యయన కేంద్రం, ఢిల్లీ) అయిదు అంశాలపై తన నిరసన గళాన్ని విప్పాడు: ‘‘1. ఈ రోజున మన దేశంలో ఉదారవాద గళాలకు ఎప్పటికన్నా ఎక్కువగా సవాలు ఎదురైంది. ఇటీవల కాలంలో మితవాద శక్తులు అదుపులేని అధికారం చెలాయిస్తున్నాయి. 2. ఈ స్థితిలో ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించలేకపోతున్నారు. ప్రజలపై బెదిరింపులు, దాడులు పెరిగాయి. ఫలితంగా పౌరులు ప్రజా జీవనంతో సంబంధం లేకుండా వేరుపడి పోతున్నారు. 3. బడా కార్పొరేషన్‌లు, ప్రభుత్వమూ పౌరుల గురించిన వివరాల మీద దృష్టి కేంద్రీకరించి కూపీలు లాగుతూ, కానరాని నిఘా పెడుతున్నాయి. 4. న్యాయ వ్యవస్థ నియమాలలో విశ్వాసం సడలింప చేస్తున్నారు. 5. ఇలాగే అణచివేతలు, హింసాత్మకమైన బెదిరింపులు కొనసాగే పక్షంలో ప్రస్తుత వ్యవస్థపై ప్రజలలో అసహనం పెరిగిపోతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని యువత, స్త్రీలు, దళిత, బహుజన, పేద ముస్లిములు, చిన్న పట్టణాలలోని, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు భావప్రకటనా స్వాతంత్య్రం కోసం మరిం తగా డిమాండ్ చేస్తారు’’ (హిందూ: 4.2.18).
ఈ వాతావరణంలో దేశంలోని బ్యాంకులకు బడా కంపెనీలు మొండి చేయి చూపిన సుమారు 9 లక్షల కోట్ల బకాయిలను వసూలు చేయలేని పాలకులు స్విస్ బ్యాంకులలో, పనామా పేపర్స్‌లో తలదాచుకున్న భారత బడా సంపన్నుల రూ. 24 లక్షల కోట్ల నల్లధనాన్ని ఎలా లాక్కురాగలరో చెప్పండి. అందులోనూ తాజాగా భారత ఎన్నికల సంఘమే పాలక పక్షాల లెజిస్లేటర్ల అవినీతిని లెక్కకట్టి, ప్రజలకు చూపుతున్నప్పుడు ఇది సాధ్యమా?!
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment