సాక్షి, గుంటూరు: ఆ యువకుడికి చదువు లేదు.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. కంటి చూపు కూడా అంతంత మాత్రమే.. ఆదరించేవారు.. ప్రోత్సహించేవారు లేరు. కానీ అపార ప్రతిభ, పట్టుదలతో చదరంగం (చెస్)లో అసమాన విజయాలు సాధిస్తున్నాడు. అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతున్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. అతడే శాగం వెంకటరెడ్డి.
75 శాతం దృష్టి లోపంతో జన్మించినా..
గుంటూరు జిల్లా గురజాల మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన పేద కూలీ శాగం నారాయణరెడ్డి కుమారుడైన వెంకటరెడ్డి 80 శాతం దృష్టి లోపంతో జన్మించాడు. వెంకటరెడ్డి ఓ ముఠా కూలీ. అతడు రాష్ట్రస్థాయి చదరంగం క్రీడాకారుడంటే ఎవరూ నమ్మలేరు. చిన్నతనంలోనే చదరంగంపై మక్కువ పెంచుకున్న వెంకటరెడ్డి ఆడేవారి వద్ద నిలబడి ఆటను చూస్తూ ఉండిపోయేవాడు. అలా క్రమేణా ఆట నేర్చుకున్నాడు. పేద కుటుంబం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పనులు చేస్తూ తల్లిదండ్రులకు సహాయపడుతున్నాడు. రాత్రి పూట గురజాలలోని వీఎంఏఎస్ క్లబ్‌లో చదరంగం సాధన చేస్తున్నాడు.
గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి..
గుంటూరు ఎల్‌వీఆర్ క్లబ్‌లో 2005, నవంబర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచి నిర్వాహకులను అబ్బురపరిచాడు. చదరంగంలో ప్రావీణ్యం ఉన్నవారిని సైతం ఓడించి పలువురి మన్ననలు పొందాడు. 2012లో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానంలో, 2013 జూలైలో చెన్నైలో జరిగిన జాతీయస్థాయి చెస్ టోర్నమెంట్‌లో 12వ స్థానంలో నిలిచాడు. 2014 నవంబర్‌లో కన్యాకుమారిలో జరిగిన సౌత్‌జోన్ అంధ చదరంగ క్రీడాకారుల సెలక్షన్స్‌లో రెండో బహుమతి సాధించి నేషనల్ –బి జట్టుకు ఎంపికయ్యాడు. 2017 నవంబర్‌లో జరిగిన సౌత్‌జోన్ చాంపియన్‌షిప్ (విజువల్లీ చాలెంజ్డ్)లో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. 2017 డిసెంబర్‌లో హరియాణాలో జరిగిన నేషనల్–బి చాంపియన్‌షిప్ (విజువల్లీ చాలెంజ్డ్) పోటీల్లో 7వ స్థానంలో నిలిచాడు. త్వరలో బల్గేరియాలో జరిగే వరల్డ్ బ్‌లైండ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికై విజయమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు. కాగా, సౌత్‌జోన్ పరిధిలోని ఐదు రాష్ట్రాల్లో వెంకటరెడ్డి టాప్ ర్యాంక్‌లో ఉండడం విశేషం.
మట్టిలో మాణిక్యం
గ్రామీణ నిరుపేద కుటుంబంలో జన్మించి చదరంగంలో అసమాన ప్రతిభాపాటవాలు చూపుతున్న వెంకటరెడ్డి మట్టిలో మాణిక్యమని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కనీసం కోచ్ కూడా లేకుండా, దృష్టి లోపాన్ని సైతం అధిగమించి విజయాలు సాధిస్తుండటం చూసి చదరంగ శిక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చెస్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుని దేశానికి మంచి పేరు తీసుకొస్తానని వెంకటరెడ్డి చెబుతున్నాడు. ఇతర రాష్ట్రాల్లో చెస్ పోటీలకు ఆహ్వానం అందుతున్నా పేదరికం కారణంగా వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్ర చెస్ అకాడమీ, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఇలాంటి ప్రతిభావంతులను గుర్తించి ప్రభుత్వం వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించి ప్రోత్సాహాన్నందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని క్రీడా ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ చాంపియన్‌షిప్ (విజువల్లీ చాలెంజ్డ్)లో మొదటి స్థానంలో నిలిచి మొమెంటో అందుకుంటున్న వెంకటరెడ్డి
పేదరికం వెక్కిరిస్తున్నా.. దృష్టిలోపం వేధిస్తున్నా..
Published Sun, Jan 14 2018 3:36 AM | Last Updated on Sun, Jan 14 2018 3:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment