బస్సులో టికెట్ ఇస్తున్న మహిళా కండక్టరు
పాతగుంటూరు(గుంటూరు): ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంత సురక్షితమో..ఉద్యోగులకు విధుల నిర్వహణ అంతే కష్టం. అందులో మహిళా కండక్టర్ల పరిస్ధితి మరీ దారుణం. పేరుకు కండక్టర్ ఉద్యోగం, చెప్పుకోవడానికి ప్రయాణం చేస్తూ సాఫీగా సాగుతుందనుకుంటారు. కానీ అంత సులువేమీ కాదు. తెల్లారేసరికి ఇంట్లో పనులు చూసుకుని, పిల్లలను స్కూలుకు సిద్ధం చేసి విధులకు గంట ముందుగానే బస్టాండ్‌కు చేరుకోవాలి. గతుకుల దారిలో వేగంగా వెళుతున్న బస్సులో టిక్కెట్లు ఇవ్వాలి. ఓ వైపు ప్రయాణికుల కస్సు బుస్సులు..ఆకతాయిల వెకిలి చేష్టలు..మరో వైపు అధికారుల వేధింపులు..మానసిక ఒత్తిడిలోనూ రైట్..రైట్ అంటూ విజయవంతంగా రాణిస్తున్నారు. విధి నిర్వహణలో చికాకు, కోపాన్ని అణచివేస్తూ..ఎదురయ్యే సమస్యలు, కష్టాలను అధిగమిస్తూ టికెట్లు కొడుతూ ..విజిల్ వేస్తూ కష్టమైన జీవితాన్ని గడుపుతున్న మహిళా కండక్టర్లపై సాక్షి ప్రత్యేక కధనం...
కండక్టర్ విధులంటే ఆషామాషీ కాదు. ప్రయాణికులను ఎక్కించుకుని బస్సు కదలగానే టిక్కెట్ ఇవ్వాలి. స్టేజి ఉన్నా, లేకపోయినా ప్రయాణికులు చెయ్యేత్తిన చోట ఆపాలి. కోరిన చోట దించాలి. ప్రయాణికులను లెక్కించుకుని స్టాటికల్ రిపోర్టు(ఎస్‌ఆర్)రాయాలి. చెప్పడానికి ఇది సులువుగా వున్నా, చేయడానికి ఎంతో కష్టం. పురుషులే ఈ డ్యూటీలు చేయలేక చికాకు పడుతున్న సందర్భాలుంటాయి. కానీ మహిళలు వారితో సమానంగా సత్తా చాటుతున్నారు. 1997 కంటే ముందు పురుషులు మాత్రమే కండక్టర్లుగా విధులు నిర్వహించారు. మహిళా కండక్టర్లు ప్రారంభంలో రోజుకు రూ.65 చొప్పున పని చేసిన రోజులకు జీతం ఇచ్చేవారు. జిల్లాలోని 13 డిపోల్లో 584 మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. గుంటూరు 1డిపోలో 78 మంది,2 డిపోలో 54, రేపల్లె 36, తెనాలి 67,మంగళగిరి 28, పొన్నూరు 39, బాపట్ల 30, నర్సరావేపేట 45, మాచర్ల 46, చిలుకలూరిపేట 39, సత్తెనపల్లి 28 మంది మహిళా కండక్టర్లు పని చేస్తున్నారు.
విధుల్లో ఇబ్బందులు...
విధుల్లో మహిళా కండక్టర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చెప్పిన డ్యూటీలు చేయకపోతే వేధింపులకు గురికావాల్సిందేననే విమర్శలు వినిపిస్తున్నాయి. డిపోలలో మౌలిక వసతులు సక్రమంగా లేకపోయినా తప్పని పరిస్ధితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఏదైనా అడిగినా, ఓ చిన్న తప్పు దొరికినా మూడు నెలల పాటు ఇంక్రిమెంట్లు తగ్గిస్తున్నట్లు సమాచారం. డ్యూటీ సమయానికి నిమిషం ఆలస్యమైనా గైర్హాజరు వేస్తారు. అంతేకాక డిపో స్పేరులో పెట్టడం, సస్పెండ్ చేయడం చేస్తుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో బస్సుల సంఖ్య తగ్గడంతో బస్సులలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల (8 గంటల ప్రకారం) వరకు డ్యూటీ చేయిస్తున్నట్లు తెలిసింది.
డిమాండ్లు...
.మహిళా కండక్టర్లకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు పూర్తయ్యే డ్యూటీలు వేయాలి..ప్రతి డిపోలోనూ విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలి.డ్యూటీ టర్మినల్ పాయింట్లలో తాగునీరు, మూత్రశాల వసతులు కల్పించాలి..ప్రత్యేకంగా నెలకు మూడు రోజుల సెలవులు ఇవ్వాలి.అధికారుల ఒత్తిళ్లు, వేధింపులు అరికట్టాలి.అత్యవసర సమయాల్లో సెలవులు ఇవ్వాలి.22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు పదోన్నతులు కల్పించాలి.
సెలవులు లేవు
అవసరానికి తగినట్లుగా సెలవులు ఉండటంలేదు. అందరితో పాటే విధులకు హాజరుకాలి. ఉదయం 6 గంటల నుంచి మహిళలకు పని వేళలు మార్చేలా చర్యలు తీసుకోవాలి. ఉదయం 4 గంటలకు మహిళలు డ్యూటీకి రావాలంటే ఇబ్బందిగా ఉంది.
లక్ష్మీ,పొన్నూరు డిపో
మహిళల సమస్యలను పరిష్కరించండి
జిల్లాలోని 13 డిపోలలో మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. మూడురోజులు సెలవుపై డిపో మేనేజర్లను ఆదేశించారు. సెలవు ఇవ్వకపోతే తనకు ఫోన్‌లో చెప్పాలి.
గుంటూరు ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి
ప్రమోషన్లు లేవు
21 సంవత్సరాలుగా కండక్టరుగా విధులు నిర్వహిస్తున్నా. సర్వీసు ప్రకారం ప్రమోషన్లు లేవు. డ్యూటీ సమయంలో పలు ఇబ్బందులు తప్పడంలేదు. రద్దీ పెరిగినపుడు చిల్లర సమస్య తలెత్తుతోంది.
కాశమ్మ, కండక్టర్, తెనాలి డిపో
Comments
Please login to add a commentAdd a comment