ఆ పాఠశాలలోని తరగతి గదుల్లో గోడలే విద్యార్థులకు పాఠాలు చెబుతాయి. గుణింతాలు లెక్కల చిక్కు ముడులు విప్పుతుంటాయి. సూక్తులు భవితకు స్ఫూర్తిగా గోచరిస్తుంటాయి. దేశ నాయకుల ఫొటోలు ఆదర్శంగా ఆహ్వానిస్తుంటాయి. ఎగిరే పక్షులు, తిరిగే జంతువులు, పారే సెలయేరు ఇలా ప్రకృతి అందాలన్నీ కనువిందు చేస్తుం టాయి. విద్యార్థుల కంటికి నిండుగా..మదిలో విజ్ఞానాన్ని మెండుగా చొప్పిస్తుంటాయి. ఇదిగో ఇవన్నీ ముప్పాళ్ల మండలం దమ్మాలపాడులోని ఎంపీపీఎస్ పాఠశాలలో దర్శనమిస్తున్నాయి. అక్కడ ఉపాధ్యాయుల కృషికి ఇవి కొలమానంగా.. ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
దమ్మాలపాడు(ముప్పాళ్ళ): మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు గాను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దటంలో దమ్మాలపాడు ఎంపీపీఎస్(పీఎస్) పాఠశాలలోని ఉపాధ్యాయులు అహర్నిశలు కృíషి చేస్తున్నారు. 10 సార్లు నోటితో చెప్పడం కన్నా.. ఒక్కసారి కంటితో చూస్తే మదిలో జ్ఞాపకం ఉండిపోతాయాయని అంటున్నారు ప్రధానోపాధ్యాయుడు వి.వి.కృష్ణారావు, ఉపాధ్యాయులు ఎం.పద్మశ్రీ, ఎం.వి.పద్మకుమార్, ఎం.సాంబిరెడ్డి, వి.ఖాన్‌సాహెబ్, షేక్ నజీరున్నీసాలు.
పాఠశాలలో 132 మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలోని సృజనాత్మతకను పెంపొందిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. అందులో భాగంగానే మూడేళ్ల కిందట స్థానికుల తోడ్పాటుతో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి, అమలు చేస్తున్నారు. ఈ ఏడాది నూతనంగా తరగతి గదుల గోడలపై గుణింతాలు, తెలుగు సంవత్సరాలు, 100 సూక్తులు, రాష్ట్ర, దేశ పటాల చిత్రాలు, పక్షులు, సైన్స్ ఇంకా అనేక రకాల విషయాలకు సంబంధించిన చిత్రాలను గీయించారు. విద్యార్థులు తరగతి గదిలోకి వెళితే గోడలపై ఉన్న చిత్రాలు మదిలో మెదలాడుతూ ఉంటాయి. రోజు వాటిని చూస్తుండటం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగి, విజ్ఞానం పెంపొందుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గోడలపై చిత్రాలను చూసిన పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కంటితో ఒక్కసారి చూస్తే చాలు
10 సార్లు నోటితో చెప్పడం కన్నా ఒక్కసారి బొమ్మలతో చూపించి చెబితే మదిలో జ్ఞాపకం ఉండిపోతుంది. ఈ ఉద్దేశంతోనే తనవంతుగా ఈ విధానం చేపట్టాం. స్థానికలు, సహచర ఉపాధ్యాయులు తోడ్పాటు బాగుండటంతో పాఠశాలలో అన్ని వసతులు కల్పించుకోగలుగుతున్నాం. విద్యార్థులకు తనకున్నంతలో సేవచేసి పాఠశాలను ఆదర్శంగా నిలపటమే లక్ష్యం.–వి.వి.కృష్ణారావు, ప్రధానోపాధ్యాయుడు
పాఠాలు అర్థమవుతున్నాయి
గోడలపై ఉన్న బొమ్మలను చూపిస్తూ చెబుతున్న లెక్కలు, సైన్సు పాఠాలు బాగా అర్థమవుతున్నాయి. తరగతి గదులు కూడా చాలా అందంగా ఉన్నాయి. అర్థం కాని వాటిని మళ్లీ మళ్లీ వివరిస్తూ చెబుతున్నారు. –ఆర్.రఘురామ్, 5వ తరగతి
Comments
Please login to add a commentAdd a comment