ఆధార్ సీడింగ్‌కు సదవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటర్లకు మరో సదవకాశం. ఈ సేవా, మీ సేవా, ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలో ఏదో ఒకచోట తమ ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఓటర్ల సౌకర్యార్థం ఈ కేంద్రాలన్నింటిలో శుక్రవారం నుంచి ఈ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు సీడింగ్ చేయని ఓటర్లందరూ తమకు సమీపంలో ఉన్న కేంద్రాలకు వెళ్లి తమ ఆధార్ కార్డు నంబర్‌ను ఓటరు కార్డుతో లింక్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ గురువారం సూచించారు.
ఆధార్‌తో అనుసంధానం చేసిన వెంటనే ఆ సమాచారం సంబంధిత ఓటర్ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా అందుతుందన్నారు.
ఎస్‌ఎంఎస్ పంపినా చాలు
ఓటర్లు తమ మొైబైల్‌తో ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు. EEDEPIC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు ఐడీ నంబరు వేయాలి... మరో స్పేస్ ఇచ్చి ఆధార్ కార్డు నంబరు వేసి.. 8790499899కు ఎస్‌ఎంఎస్ పంపాలి. ఓటర్లు తమ ఆధార్ కార్డు ఓటరు ఐడీతో లింక్ అయిందా... లేదా అని తెలుసుకోవాలంటే VOTE అని టైప్ చేసి.. స్పేస్ ఇచ్చి.. ఓటరు ఐడీ నంబరు వేసి 8790499899కు ఎస్‌ఎంఎస్ పంపాలి.
ఏపీలోనే ఎక్కువ సీడింగ్
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 71.85 శాతం ఆధార్ సీడింగ్ జరిగితే, తెలంగాణలో 62.35 శాతం మాత్రమే సీడింగ్ జరిగిందని భన్వర్‌లాల్ తెలిపారు. డూప్లికేట్, అనర్హులు, చనిపోయిన వారు, ఇళ్లు మారిన వారి కేటగిరీలో.. ఏపీలో 25.54 శాతం, తెలంగాణలో 33.74 శాతం ఓట్లు గుర్తించినట్లు వెల్లడించారు.