సాక్షి, హైదరాబాద్:
- గాజులరామారంలోని మీసేవ కేంద్రానికి వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఓటరు కార్డుకు రూ.100 చెల్లించాడు. అదేంటంటే.. ఈసీ నిర్ణయించిన మొత్తం ఇదేనని నిర్వాహకుడు గదమాయించాడు.
- ముషీరాబాద్‌లోనూ ఓ ప్రైవేటు ఉద్యోగి తన ఇంట్లో నలుగురి కోసం కార్డుకు రూ.110 చొప్పున మొత్తం రూ.440 చెల్లించాడు. ఇదేంటని వారిని ప్రశ్నిస్తే.. ‘అంతేబాబూ.. కలర్ ప్రింట్‌కు ఆమాత్రం అవదా?’అంటూ ఎదురు ప్రశ్నించారు.
ఈ పరిస్థితి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో నిర్వాహకులు ఓటరు కార్డు ప్రింట్ తీసి ఇవ్వడానికి రూ.100కు పైగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ ఓటరు గుర్తింపు కార్డులు ప్రింట్ తీసి ఇవ్వడానికి ధర రూ.25గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇదే ధరను అమలు చేయాలని కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఎన్నికల సంఘం ఆదేశాలు ఎక్కడా అమలుకావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మీసేవ నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎన్నికల సంఘం ఆదేశాలంటూ దబాయిస్తున్నారు. నిజమేననుకున్న పలువురు అడిగినకాడికి సమర్పించుకుంటున్నారు.
లక్షల్లోనే కొత్త కార్డులు
కొత్త ఓటరు జాబితాలో రాష్ట్రంలో నూతనంగా దాదా పు ఐదు లక్షలకుపైగా ఓటర్లు చేరారు. వీరందరికీ కొత్త ఓటరు కార్డులు ఇవ్వాలి. దీనికితోడు చిరునామా మార్పు, ఓటరు కార్డులో తప్పుల సవరణ చేసు కున్నవారూ లక్షల్లోనే ఉన్నారు. వీరంతా పని సులువుగా అవుతుందన్న కారణంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలు కాకుండా మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఈ లెక్కన కార్డుకు రూ.100 వసూలు చేసినా ఈ మొత్తం రూ.5 కోట్లు దాటుతుంది.
మీసేవ నిర్వాహకులు ఏమంటున్నారు?
వాస్తవానికి మీసేవ కేంద్రం నిర్వాహకులు ధర పెంపు విషయాన్ని ఇటీవల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. తమకు ఒక్కకార్డు ప్రింట్ తీసి ఇవ్వడానికి దాదాపుగా రూ.35 వరకు ఖర్చవుతోందని వివరించారు. రూ.25కు ఇవ్వలేమని, ఈ మొత్తాన్ని పెంచా లని రెండుసార్లు వినతిపత్రాన్ని కూడా ఇచ్చారు. కానీ, ప్రభుత్వం రూ.25గానే ధర నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మీసేవ నిర్వాహకులు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా రూ.100 నుంచి రూ.110 వరకు వసూలు చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఇలాంటి ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. మేం నిర్ణయించిన ధర కేవలం రూ.25 మాత్రమే. అంతకుమించి వసూలు చేయకూడదు. ప్రింటింగ్ కాస్ట్ అధికంగా ఉందని, ధరలు పెంచాలని ఇటీవల మీసేవ నిర్వాహకులు మమ్మల్ని సంప్రదించారు. కానీ, అధిక ధర వసూలు చేసుకోమని మేమెలాంటి అధికారిక ఆదేశాలు ఇవ్వలేదు. వాస్తవానికి ఈ కార్డులను ఎన్నికల సంఘం పోస్టులో ఉచితంగా పంపుతుంది. అధిక ధరలు వసూలు చేసేవారిపై ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్‌రావు, ఈఎస్‌డీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment