విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధనార్జనకోసం అమాయక గిరిజనుల జీవితాలను పణంగా పెట్టి బాక్సైట్ తవ్వకాలకోసం జీవో జారీ చేసిందని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. జీవో 97 పై ప్రభుత్వం పనరాలోచించుకొని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖలో సోమవారం ఆయన విలేకరులో సమావేశంలో మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాల వల్లే కలిగే పరిణామాల గురించి ప్రధానికి వివరిస్తామన్నారు. డిసెంబర్ 2న చింతపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ బహిరంగ సభ జరుగుతుందని ఈ సందర్భంగా గిరిజనులకు పార్టీ పరంగా మద్దతు ప్రకటిస్తారని బొత్స చెప్పారు. ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు గిరిజనులను నిరాశ్రయులను చేయడం సరికాదన్నారు. గిరిజనులకు మద్దతుగా ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వంతో పోరాడుతామని చెప్పారు. ఈ నెల 24న అనంతపురంలో, 28 కాకినాడలో జగన్ ఆధ్వర్యంలో యువభేరి సభలు ఉంటాయని ప్రకటించారు. ప్రతి జిల్లాలో సభలు నిర్వహించడం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామని చెప్పారు.
గిరిజనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బొత్స హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆపేశామనే ఆరోపణలు వాస్తవం కాదన్న ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను కేటాయించేంతవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.