డ్రోన్ సాయంతో పోలవరం పనుల పరిశీలన
Published Thu, Aug 25 2016 7:10 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
- ఆన్‌లైన్ ద్వారా సమీక్షించిన సీఎం చంద్రబాబు
పోలవరం
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం ద్వారా వర్చువల్ ఇన్‌స్ట్రక్షన్ పద్ధతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి గురువారం పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో ఆన్‌లైన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముందుగా డ్రోన్ కెమెరా ద్వారా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, రాక్‌ఫిల్ డ్యామ్, పవర్‌హౌస్ నిర్మాణ ప్రాంతాలను చిత్రీకరించి వర్చువల్ ఆన్‌లైన్ విధానానికి అనుసంధానం చేశారు. వాటిని పరిశీలించిన అనంతరం జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, హెడ్‌వర్క్స్ ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు చెరుకూరి శ్రీధర్, బి.ప్రభాకర్ సీఎంతో మాట్లాడారు.
అనంతరం ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో పనుల తీరుపై సమీక్షించారు. ఇంకా 21 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్స్ (మట్టి పనులు) చేయాల్సి ఉందని, వీటిని పూర్తిచేసి కాంక్రీట్ పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చేయాలని ఆదేశించారు. డ్యామ్ నిర్మాణానికి సంబంధించి డిజైన్స్‌ను అనుమతి నిమిత్తం కేంద్ర జల వనరుల శాఖ (సీడబ్ల్యూసీ) పంపించామని ట్రాన్స్‌ట్రాయ్ ప్రతినిధి తెలిపారు. 24 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఐదు డంపర్లను తీసుకొచ్చామని, 35 క్యూబిక్ మీటర్ల మట్టిని ఒకేసారి తొలగించగల ఎక్స్‌కవేటర్‌ను తీసుకువచ్చామని త్రివేణి సంస్థ ప్రతినిధి ప్రభాకర్ వివరించారు. అనంతరం మంత్రి దేవినేని విలేకరులతో మాట్లాడుతూ నిపుణుల కమిటీ, పోలవరం అథారిటీ సూచనల మేరకు పనులు చేస్తున్నామన్నారు. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఈఈ ఎన్.పుల్లారావు, ఎల్ అండ్ టీ ప్రతినిధి రవికుమార్, బావర్ ప్రతినిధి శామ్యూల్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement