జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. రాజకీయ స్పందనను కమ్యూనిస్టులుగా తాము పరిశీలిస్తున్నామని అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లాలో కరువు పర్యటనకు విచ్చేసిన ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. గో సంరక్షణ పేరుతో బీజేపీ అనుసరిస్తున్న మత రాజకీయాలను పవన్ తప్పు పట్టడం హర్షణీయమన్నారు. తనకు కులం, మతం, ప్రాంతీయతత్వం లేవని చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ కేంద్రంపై పోరాడాలని పవన్ పిలుపునివ్వడం మంచి పరిణామమన్నారు. టీడీపీ ఎంపీ, మంత్రులు వ్యవహరిస్తున్న తీరును పవన్ తప్పుపట్టడం సరైందేనన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ అభివృద్ధి సబ్‌కమిటీ కన్వీనర్ జి.ఓబులు, జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడారు.