రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరాబాద్
ఇక జీహెచ్‌ఎంసీ ‘జిమ్స్’..
ఫిట్‌నెస్ మంత్రం జపిస్తున్న నగర కార్పొరేషన్
హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఉంటుంది. ఇందు కోసం చాలా మంది ప్రైవేట్ జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆర్థిక స్థోమత లేని వారు.. అందుబాటులో జిమ్‌లు లేని వారు వీటికి దూరంగా ఉండిపోతున్నారు. ఇలాంటి వారి కోసమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) అందరికీ ఉపయోగపడే అత్యాధునిక జిమ్‌లను అందుబాటులోకి తెస్తోంది. వ్యాయామం ద్వారా ఆరోగ్య పరిరక్షణతో పాటు శారీరక, మానసిక దృఢత్వం అందించేందుకు జిమ్‌లు ఉపయోగపడతాయని భావించి వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం గ్రేటర్‌లోని ఐఎస్ సదన్, రామంతాపూర్, ఉప్పల్, చిలుకానగర్, హబ్సిగూడతో సహ పది ప్రాంతాల్లో జిమ్‌లను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో జిమ్‌ను సగటున యాభై మంది ఉపయోగించుకోవచ్చని, మరో 125 జిమ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. వీటి ద్వారా యువత, వయోధికులు, మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు. అన్ని జిమ్ సెంటర్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వీటి వద్ద సీసీ కెమెరాలను స్థానిక కాలనీ, సంక్షేమ సంఘాలే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని 12 ప్రధాన క్రీడా మైదానాల్లో కూడా ఆధునిక జిమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.
ఆధునిక సామగ్రి..
గ్రేటర్‌లో మొత్తం 135 జిమ్‌ల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని జీహెచ్‌ఎంసీ ఇప్పటికే కొనుగోలు చేసింది. పేరెన్నికగ న్న కంపెనీల నుంచి ఆధునిక సామగ్రిని ఈ జిమ్‌ల కోసం కొనుగోలు చేశారు. ఒక్కో జిమ్‌లో 21 ఉపకరణాలు ఉంటాయి. వీటిల్లో ఆధునిక సైక్లింగ్, త్రెడ్‌మిల్, ప్లేట్‌స్టాండ్, ట్రైస్టర్, డంబెల్స్, ట్విస్టర్స్, ఫోర్‌స్టేషన్ మల్టీ జిమ్, ఇంక్లైన్, డిక్లైన్ బెంచ్ తదితర సామగ్రి ఉంటాయని జీహెచ్‌ఎంసీ క్రీడా విభాగం ఓఎస్డీ ప్రేమ్‌రాజ్ తెలిపారు.
ఎక్కడెక్కడ.. ఎవరి ఆధ్వర్యంలో..
ఒక్కో జిమ్‌కు జీహెచ్‌ఎంసీ సగటున రూ.10 లక్షలు ఖర్చు చేస్తోంది. జిమ్‌లో అవసరమైన ఉపకరణాలు, క్రీడాపరికరాలు తదితరాలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తుండగా, కేంద్రా ల్లో సదుపాయాల కల్పనకు మరో రూ.5 లక్షలు వెచ్చిస్తోంది. వీటి నిర్వహణను స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు అప్పగించనున్నారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంటాయి. సంబంధిత డిప్యూటీ కమిషనర్, ఏఈలు నిర్వహణను పరిశీలిస్తారు. కేంద్ర నిర్వహణతోపాటు సామగ్రి రక్షణ బాధ్యత రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీలదే. పేద, మధ్య తరగతి వారికి ఉపకరించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న వీటిల్లో నెలకు సుమారు రూ. 100 వసూలు చేయవచ్చని తెలుస్తోంది. జిమ్ నిర్వహణకే ఫీజును వసూలు చేస్తారు. సంపన్న ప్రాంతాల్లో అధికంగా వసూలు చేసే యోచన ఉంది.