ట్రైనర్స్‌ లేకుండా జిమ్ కి వెళ్తున్నారా.. | zym Trainers Shortage in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంతో ఆటలు

Published Mon, Feb 11 2019 9:07 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

zym Trainers Shortage in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హిమాయత్‌నగర్‌ నివాసి రూపేశ్‌గుప్తా అధిక బరువు తగ్గించుకోవాలని సమీపంలోని జిమ్‌లో చేరాడు. ఏడాది మొత్తం ఫీజును ఒకేసారి చెల్లించాడు. రెండు నెలలు వెళ్లాక అకస్మాత్తుగా కుడి భుజం నొప్పి రావడం మొదలైంది. రాన్రాను అది తీవ్రతరం కావడంతో డాక్టర్‌ను సంప్రదించాడు. సరైన రీతిలో వర్కవుట్‌ చేయకపోవడంతో కండరాల్లో అపసవ్యత వచ్చిందని, సర్జరీయే శరణ్యమని తేల్చారు. ఇలా గాయాలపాలవడం, ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడం నగరంలోని వ్యాయామ ప్రియులకు సర్వసాధారణమైంది. కొందరైతే ఏకంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలూ వెలుగు చూస్తున్నాయి. అందం, ఆరోగ్యం ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? అంటూ ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. సిటీజనుల్లో చక్కని శరీరాకృతి, ఆరోగ్యంపై ఆసక్తి అంతకంతకూ రెట్టింపవుతూ అదే సమయంలో అందుకు అవసరమైన శిక్షణ లభించకపోవడంతో అది పెను సమస్యలకు దారితీస్తోంది. 

ఆరోగ్యమే ‘మహా’భాగ్యమై...
ప్రపంచవ్యాప్తంగా ఫిట్‌నెస్‌ విప్లవం నడుస్తోంది. చాలా రోగాలకు కారణం జీవనశైలి మార్పులు. ప్రధానంగా శారీరక శ్రమ లేకపోవడమని స్పష్టమవడంతో సిటీజనులు మందుల కన్నా వ్యాయామం మీదే ఆధారపడడం పెరిగింది. ఈ నేపథ్యంలోనే నగరంలో జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. ప్రపంచస్థాయిలో పేరున్న బ్రాండ్స్‌ నగరంలో వ్యాయామ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. టాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్లు కూడా నగరంలో జిమ్‌ల ఏర్పాటుకు ఉత్సాహం చూపిస్తున్నారంటే... ఇక్కడ వీటి బూమ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతుంది. ఈ తరహా ఆరోగ్య స్పృహ మంచిదే అయినా సిటీని ఈ ఫిట్‌నెస్‌ ఫీవర్‌ ఒక్కసారిగా చుట్టుకోవడం పలు రకాల సమస్యలకు కారణమవుతోంది. 

డిమాండ్‌ ఫుల్‌.. ట్రైనర్స్‌ నిల్‌  
నగరంలో ఫిట్‌నెస్‌ ట్రైనర్ల కొరత తీవ్రంగా ఉంది. స్వల్ప వ్యవధిలో వెలిసిన వందల సంఖ్యలోని జిమ్‌లకు సరిపడా శిక్షకులు అందుబాటులో లేరు. దీనిని ఇప్పటికీ యువత పూర్తిస్థాయి కెరీర్‌గా భావించడం లేదు. అలా భావిస్తున్నవారు కొద్దొ గొప్పో ఉన్నా, శిక్షకులుగా మారడానికి అవసరమైన శిక్షణ సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. రీబాక్‌ వంటి కొన్ని సంస్థలు ఫిట్‌నెస్‌ శిక్షకుల కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నా, వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితుల్లో అనుభవరాహిత్యం గురించి పట్టించుకోకుండా, అందుబాటులో ఉన్న ట్రైనర్లతోనే నిర్వాహకులు జిమ్‌లు నడిపిస్తున్నారు. ఏవో కొన్ని పేరున్న ఫిట్‌నెస్‌ సెంటర్లను మినహాయిస్తే మరే జిమ్‌లో కూడా సర్టిఫైడ్‌ ట్రైనర్‌ లేరంటే అతిశయోక్తి కాదు. సందుగొందుల్లో మాత్రమే కాదు శ్రీనగర్‌కాలనీ, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చే స్తున్న జిమ్స్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  

ఈజీగా.. క్రేజీగా..  
వ్యయప్రయాసల రీత్యా చూస్తే చాలా వ్యాపారాల కన్నా జిమ్‌ ఏర్పాటు అనేది కాస్త సులభమైన విషయమే. అంతేకాకుండా దీని నుంచి స్థిరమైన రాబడిని అందుకునే అవకాశం ఉంది. కూర్చొని ఆదాయం సంపాదించే వ్యవహారం కావడంతో  చాలామంది రిటైర్డ్‌ ఉద్యోగులు, గృహిణులు సైతం జిమ్‌ నిర్వహణలోకి ప్రవేశిస్తున్నారు. అందులో తప్పులేకపోయినా వారికి స్వతాహాగా జిమ్‌ మెయింటెనెన్స్‌పై అవగాహన లేక, ఏదో ఒక ఫ్లాట్‌ అద్దెకు తీసేసుకుని పరికరాలు పెట్టుకుంటే చాలు నడిపించేయవచ్చుననే అపోహతో తాము నష్టాలపాలు అవడమే కాకుండా ఆరోగ్యార్థులను అనారోగ్యానికి గురిచేస్తున్నారు. 

బౌన్సర్లూ ట్రైనర్లే...  
పెద్ద మొత్తాల్లో జీతాలిచ్చి ట్రైనర్లను పెట్టుకోలేక కాస్త రెగ్యులర్‌గా వ్యాయామం చేసిన అనుభవం ఉన్నవారితో సహా ఎవరిని పడితే వారిని ట్రైనర్లుగా మార్చేస్తున్నారు. నిజానికి ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ఏమాత్రం అటూ ఇటూ అయినా ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సిటీలో కొన్ని జిమ్‌లు కాస్త శరీర సౌష్టవం ఉన్న వ్యక్తులు దొరికితే చాలు శిక్షకులుగా చేర్చుకుంటున్నాయి. దీంతో బార్లలో బౌన్సర్లుగా పనిచేసేవారు కూడా శిక్షకుల అవతారమెత్తుతున్నారు. వీరు తెలిసీ తెలియకుండా ఇస్తున్న శిక్షణతో వ్యాయామ ప్రియులకు అనూహ్యమైన శారీరక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

పర్సుఫుల్‌ ఉంటేనే పర్సనల్‌...
మరికొన్ని చోట్ల జిమ్‌లో చేరిన కొన్ని రోజుల వరకు కాస్త శ్రద్ధ చూపించి, ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారు.  నిజానికి తమ జిమ్‌లో చేరిన ప్రతి సభ్యుడికీ అవసరమైన శిక్షణ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకుండా వారిని వదలేయడం శిక్షార్హం. అయినప్పటికీ చాలా జిమ్‌లు అదేమీ పట్టించుకోవడం లేదు. జిమ్‌ల మధ్య విపరీతమైన పోటీ కారణంగా ఏడాదికి రూ.15వేలు చెల్లిస్తే చాలు సభ్యత్వాలు అందిస్తున్నారు. అయితే అలా చెల్లించిన వారికి పర్సనల్‌ ట్రైనింగ్‌ ఉండదు. కేవలం తూతూమంత్రంగా మాత్రమే వారికి సూచనలిస్తుంటారు. అలా కాదని గట్టిగా ఏదైనా మాట్లాడితే పర్సనల్‌ ట్రైనింగ్‌ పెట్టుకోమంటూ సలహా ఇస్తారు. ఈ పర్సనల్‌ ట్రైనింగ్‌లో సభ్యుడి కోసం పూర్తిగా ఒక ట్రైనర్‌ని కేటాయిస్తారు. దీనికి గాను అదనంగా నెలకు రూ.10వేలు దాకా చెల్లించాల్సి వస్తుంది. 

డేంజరస్‌.. డైట్, సప్లిమెంట్స్‌  
సాధారణంగా వ్యాయామ కేంద్రాల్లో సభ్యులుగా ఉన్నవారు తీసుకునే ఆహార అలవాట్లలో మార్పుచేర్పుల విషయంలోనూ జిమ్‌ నిర్వాహకులనే సంప్రదిస్తుంటారు. వారేమో ఎలాంటి ముందస్తు అనుభవం లేకపోయినా, వైద్య పరమైన కోర్సులేవీ చేయకపోయినా ఇష్టారాజ్యంగా డైట్‌ని సూచిస్తుంటారు. వ్యక్తికి ఉన్న ఆరోగ్య సమస్యలు, వంశపారంపర్య లక్షణాలు ఇత్యాది అంశాలేమీ పట్టించుకోకుండానే గుడ్డిగా వీరిచ్చే సలహాలు పాటించడం ద్వారా చాలా మంది సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అలాగే వేగంగా శారీరక మార్పులు కోరుకునే యువతీ యువకులకు సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్‌ వంటివి అలవాటు చేస్తున్న జిమ్‌లు, ట్రైనర్లు కూడా నగరంలో ఉన్నారు. ఇది మరింత తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత శాఖలు ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది. జిమ్‌ల నిర్వహణ, తీరు తెన్నులపై సమగ్రమైన విధి విధానాలు ఖరారు కావాల్సిన అవసరం కనిపిస్తోంది. అదే సమయంలో నగరంలోని యువతకు ట్రైనర్లుగా శిక్షణ పొందితే వచ్చే ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచాలి. వ్యాయామ ప్రియులు కూడా మెంబర్‌షిప్‌ ఫీజును మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా సరైన వ్యాయామ శిక్షకులు ఉన్న జిమ్‌లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement