
కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్య
* గ్రీవెన్స్‌సెల్ వద్ద క్రిమిసంహారక మందు తాగిన అన్నదాత
* అధికారుల వద్దకు వెళ్లకుండానే బలవన్మరణం
* తహసీల్దార్, ఎస్సై, వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్
సాక్షి, విజయనగరం కంటోన్మెంట్: తనకు చెందిన భూమిపై తగవు పడుతున్న తన బంధువులతో కలిసిపోయిన అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరించి, తన భూమిలోకి వెళ్లకుండా దారి మూసివేశారని తీవ్ర మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విజయనగరంలోని కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి, అధికారుల వద్దకు వెళ్లకుండానే క్రిమిసంహారక మందు తాగాడు. అక్కడ ఉన్న ఇతర అర్జీదారులు 108 వాహనసేవలకు సమాచారమిచ్చారు. వారు వచ్చి, ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబసభ్యుల కథనం మేరకు విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి గ్రామానికి చెందిన దామెర వెంకట సూర్యారావు భూమిని తన పేరున మార్చాలని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
బంధువులతో వాటాలకు సంబంధించిన సుమారు 56 సెంట్ల భూమి విషయమై వివాదం నెలకొంది. దీనిపై కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌సెల్‌లోనూ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సూర్యారావు భూమిలోకి వెళ్లేందుకు ఉన్న దారిని కూడా మూసేయడంతో మరింత ఆవేదనకు లోనయ్యాడు. ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయంతో పాటు పోలీస్‌స్టేషన్, గ్రీవెన్స్‌సెల్‌లకు కాళ్లరిగేలా తిరిగాడు. అయినా ఫలితం లేక పోవడంతో ఏం చేయాలో పాలుపోక మానసిక ఆందోళనకు గురయ్యాడు.
ఈ నేపథ్యంలోనే సోమవారం సూసైడ్‌నోట్‌తో గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి, అందరూ చూస్తుండగానే పోర్టికో వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. ఆ నోట్‌లో వీఆర్‌ఓ, తహసీల్దార్, ఎస్‌ఐ, కానిస్టేబుల్ భానుపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఫోన్ కాల్ డేటాతో పాటు పైన పేర్కొన్న వారి కాల్ డేటాను కూడా పరిశీలించాలని మరో చీటీ ద్వారా కోరాడు. ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన జరుగగా చికిత్స పొందుతూ 12.30 గంటలకు మృతి చెందాడు. కలెక్టర్ ఎంఎం నాయక్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకు ముందు తహసీల్దార్, వీఆర్వోలతో మాట్లాడి ఆరా తీశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఇది కోర్టులో ఉన్న విషయమని, తాము వేలు పెట్టలేమన్నారు. గతంలో గ్రీవెన్స్‌కు వచ్చినపుడు భూమి గురించి మాత్రమే చెప్పాడని, రహదారి మూసివేశారన్న విషయమై పొందుపర్చలేదని తెలిపారు. జరిగిన సంఘటనైపై విచారణ చేయిస్తున్నామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.