
జీవోలు అమలు చేయడమే మా పని
ఉద్యోగ నోటిఫికేషన్లపై టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
హైదరాబాద్ : ప్రభుత్వం నుంచి ఉద్యోగ నియామకాల జీవోలు వస్తే.. తాము కచ్చితంగా వాటిని అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ క మిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. రాజ్యాంగ సంస్థగా టీఎస్ పీఎస్సీ కేవలం ప్రభుత్వ జీవోలను మాత్రమే అమలు చేస్తుందన్నారు.తెలంగాణ వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో 2014 సివిల్స్ విజేతలు ఇరా సింఘాల్, కట్టా సింహాచలంలను హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు చట్టం ప్రకారం జోనల్ సిస్టమ్, లోకల్ రిజర్వేషన్ విధానం వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల కారణంగానే ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, వికలాంగుల సహకార సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ శైలజ, వికలాంగుల జేఏసీ చైర్మన్ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.