- హోం శాఖ న్యాయవాదికి
- హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, తుర్కయాంజల్‌లో ఓ వ్యక్తిని అతని స్థలంలోకి వెళ్లకుండా వనస్థలిపురం సీఐ, రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాది (హోం)ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
తుర్కయాంజల్‌లోని తన స్థలంలోకి వెళ్లకుండా వనస్థలిపురం సీఐ, రెవెన్యూ అధికారులు అడ్డుపడుతున్నారని.. దీనిపై స్పందించి చర్యలు తీసుకునేలా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరుతూ కె.లక్ష్మయ్యగౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హోం శాఖ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు.