ఇటు నిర్భయ.. అటు పెషావర్
స్వాతంత్య్రానంతరం ఇరు దేశాల్లో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు ఘోర సంఘటనలను భారత్, పాకిస్థాన్ గుర్తు చేసుకుంటున్నాయి. మూడేళ్ల క్రితం డిసెంబర్ 16న భారత రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై పాశవిక లైగింకదాడి, అనంతరం దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు.. కొత్త చట్టాలకు బాటలు వేస్తే, ఏడాది క్రితం ఇదే డిసెంబర్ 16న పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు సాగించిన నరమేధం.. పాలు పొసి పెంచిన ఉగ్రవాదమనే పాము తనను కూడా కాటేయకుండా ఉండదని పాక్కు తెలిసొచ్చేలా చేసింది.
మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు జస్టిస్ వర్మ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన చట్టానికి 'నిర్భయ' పేరు పెట్టుకుంది భారత్. పెషావర్ మారణహోమం తర్వాత ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది పాక్. ఆ మేరకు ఉగ్రవాదులకు ఉరిశిక్షల అమలుపై కొనసాగుతున్న మారటోరియాన్ని ఎత్తేసి నాలుగు నెలల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులకు మరణ దండన విధించింది.
నిర్భయ చట్టం రూపొందించినంత మాత్రన మన దేశంలో లైంగిక దాడులు ఆగలేదు. మరణశిక్షలు అమలు చేసినంత మాత్రాన పాకిస్థాన్లో ఉగ్రవాదమూ అంతమొందలేదు. కానీ ఆ రెండు ఘటనలు ఇరుదేశాల పౌరుల ఆలోచనా సరళిని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు ఇండియాలో వేధింపులు తగ్గలేదు. కానీ వేధింపులను భరించే మహిళల సంఖ్య తగ్గింది. కాటేయజూసినవాడు కన్నతండ్రైనా, సొంత అన్నైనా, ఉపాధ్యాయుడైనా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే పోయే 'పరువు' కంటే, పిల్లల ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి భారతీయ కుటుంబాలు. కేవలం దాయాది దేశం మీద ద్వేషంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే.. భావితరం బతకలేదని గుర్తించారు పాకిస్థానీ పేరెంట్స్.