
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై చర్చ
హైదరాబాద్: కేంద్ర న్యాయ శాఖ, హోం శాఖ, శాసనసభ కార్యదర్శులతో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అంశంపై చర్చించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో 225, తెలంగాణలో 153 వరకు శాసన సభ స్ధానాలను పెంచే విషయంపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా చర్చించి నట్టు వెంకయ్య తెలిపారు. తెలంగాణ నుంచి స్థానాల పెంపుపై కరీంనగర్ ఎంపీ వినోద్ సోమవారం తనతో సమావేశమైనట్టు వెల్లడించారు. 2026 వరకు సీట్ల పెంపు అవసరం లేదంటే విభజన చట్టంలోని సెక్షన్ 26 లో సీట్ల పెంపుపై పేర్కొనాల్సిన అవసరం లేదన్నారు.
న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఈ వ్యవహారంపై చర్చిస్తున్నామని వెంకయ్య నాయుడు తెలిపారు. బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో సీట్ల పెంపు బిల్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. న్యాయ శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని హోంశాఖకు నివేదిస్తుందన్నారు. సవరణ బిల్లును హోంశాఖ పార్లమెంట్ ముందకు తీసుకొస్తుందని వివరించారు. వీలైనంత త్వరగా సవరణ బిల్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.