పురుషుల ఆలోచనా విధానం మారాలి | men idealogy should change, says nalsar versity registrar balakrishna reddy | Sakshi
Sakshi News home page

పురుషుల ఆలోచనా విధానం మారాలి

Published Sat, Jan 30 2016 8:17 PM | Last Updated on Tue, Oct 16 2018 8:54 PM

men idealogy should change, says nalsar versity registrar balakrishna reddy

-నల్సార్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాలకిష్టారెడ్డి
-తెలంగాణ భూమి చట్టాలు-మహిళా దృక్పథం’ అంశంపై సదస్సు


శామీర్‌పేట్(రంగారెడ్డి జిల్లా) :
మహిళలు సాధికారతను సాధించడానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు అడ్డంకులుగా ఉన్నాయని, దీంతోపాటు పురుషుల ఆలోచనా విధానంతో పాటు వారి ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నల్సార్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. శామీర్‌పేట్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, రూరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్త నిర్వహణలో తెలంగాణ భూమి చట్టాలు-మహిళా దృక్పథం’ అనే అంశంపై ఒకరోజు సదస్సును శనివారం నల్సార్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్సార్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. బాలకిష్టారెడ్డి స్వాగతోపన్యాసం చేశారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న భూచట్టాలను పునఃపరిశీలన చేస్తున్న క్రమంలో మహిళల దృక్పథంతో పరిశీలన జరగాలని, ఈనేపథ్యంలో సదస్సును నిర్వహించినట్లు వివరించారు. అవసరమైన సిఫార్సులు.. వారసత్వ చట్టాలు, భూపంపిణీ మరియు కొనుగోలు పథకాలు, భూమి కౌలు, రెవెన్యూ వ్యవస్థ అందుబాటు, భూ సమస్యలు/భూవివాదాలు, మహిళలకు సంబంధించిన ఇతర భూవ్యవహారాలు అనే మొత్తం ఆరు అంశాలపై చర్యలు జరిపినట్లు నల్సార్ రిజిస్ట్రార్ ప్రొఫెషర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. అనంతరం అవసరమైన సిఫార్సులు చేస్తామని పేర్కొన్నారు. సమాజంలో పురుషులతో పాటు స్త్రీలు అన్ని రంగాల్లో సమాన అవకాశాలను పొందగలరని తెలిపారు. రాజకీయ, సామాజిక అంశాలతో పాటు మహిళలకు న్యాయపరమైన పరిజ్ఞానం మహిళలకు అందించాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మహిళల్లోని నిరక్షరాస్యత, చట్టాలు, న్యాయవ్యవస్థపై అవగాహన లేమి, హక్కులు పొందలేక పోవడం అనే అంశాలు మహిళలు నిర్ణయాధికార స్థాయిలోకి రాలేక పోవడానికి ముఖ్య అడ్డంకులుగా ఉన్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, సంస్థల వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు తెలంగాణ భూ చట్టాల సవరణ, మార్పు కోసం ఉపయోగించే అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమంలో లాండెస్సా/ఆర్‌డీ ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌కుమార్ మాట్లాడుతూ..భూ సమస్యలను మహిళల దృక్పథంతో చూడాలన్నారు. అందుకు అవసరమైన మార్పులు, లింగ సమన్యాయాన్ని తెలంగాణ భూచట్టాల్లో జోడించాలని తెలిపారు.

నల్సార్ లా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, లాండెస్సా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూచట్టాల సమీక్ష అందుకు ఉపయోగపడుతుందన్నారు. పేదలు, మహిళలు, గిరిజనుల సాగుదారుల దృక్పథాన్ని ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోని చట్టాల సవరణ జరగాలని అభిప్రాయపడ్డారు. సీనియర్ పాత్రికేయుడు దుర్గం రవీందర్ మాట్లాడుతూ.. భూసంబంధిత అంశాలు, చట్టాల మార్పులలో మహిళలకు స్థానం కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ సంఘాలకు చెందిన మహిళలు 100 మంది, సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు, లాండెస్సా సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రీసెర్చ్ స్కాలర్లు, అధ్యాపకులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement