తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో 12 మంది శాసన మండలి సభ్యులు గా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదలయింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో యిద్దరిని, మిగితా జిల్లాలో ఒక్కరిని శాసనమండలి సభ్యులుగా స్థానిక సంస్థల నుండి ఎన్నుకోనున్నారు.
ఈ నెల 9 నామినేషన్లకు చివరి తేదీ. 10 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 30న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది.
కాగా.. వరంగల్ జిల్లాలో మొత్తం 860 మంది ప్రజా ప్రతినిధులకు ఓటింగ్ అవకాశం వుంది యిందులో zptc 50, mptc 687, కౌన్సిలర్లు 116, ఎక్స్ అఫీషియో సభ్యులు 7 మంది ఉన్నారు. మరో వైపు వరంగల్ కార్పొరేషన్ కు గత రెండేళ్ళు గా ఎన్నిక నిర్వహించకపోవడంతో కార్పోరేటర్లకు ఓటింగ్ అవకాశం లేదు.
మంగపేట, హనుమకొండ మండలాలలో కోర్టులో వాజ్యం మూలంగా ఎన్నికలు నిర్వహించలేదు. దరిమిలా యం.పి.టి.సిలకు ఓటింగ్ హక్కు లేదు. మెజారిటీ స్థానాలు అధికార టీఆర్ఎస్ కే వుండడంతో ఆ పార్టీ గెలుపు ఖాయం. అయితే ఎమ్మెల్సీ టికెట్ కి భారీ పోటీ ఉంది.