మూడేళ్ల కొడుకుపై తల్లి పైశాచికం
ఒంగోలు : ప్రత్యూష.. సంధ్య.. నిన్నమొన్న మహబూబ్ నగర్ లో ఐదేళ్ల చిన్నారి.. ఇప్పుడు ఒంగోలులో మూడేళ్ల బాలుడు.. తల్లిదండ్రులు, సవతి తల్లుల చేతిలో హింసకు గురవుతున్న బాలల ఉదంతాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ఒంగోలు పట్టణంలోని కొటవీధిలో మూడేళ్ల కొడుకును ఓ తల్లి చిత్రహింసలకు గురిచేసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కోటవీధికి చెందిన రిజ్వానాకు నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. కాగా గర్భిణీగా తల్లివారింటికి వచ్చిన రిజ్వానా తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు. ప్రస్తుతం రిజ్వానా కుమారుడు ఫర్హాన్కు మూడేళ్లు.
రిజ్వానా.. తన కుమారుడు ఫర్హాన్‌ను నిత్యం చిత్రహింసలకు గురిచేస్తుండేది. ఇది గమనించిన చుట్టుపక్కలవారు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన చైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధులు.. ప్రభుత్వాధికారుల సహాయంతో ఆ బాలుడ్ని కాపాడారు. ఒంటినిండా గాయాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. తల్లి పైశాచికంపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. కాగా రిజ్వానాకు వేరే వ్యక్తితో సంబంధం ఉండటంతో బాలుడిని చిత్రవధ చేసేదని స్థానికులు చెబుతున్నారు. అలా చేస్తే బాలుడి తండ్రి వచ్చి కొడుకుని తీసుకొని వెళ్తాడని భావించి ఈ పనికి పూనుకొని ఉండవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు.