న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాపై శుక్రవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఆదాయమే ధ్యేయంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి అని మండిపడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది.
ఇసుక తవ్వకాల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, భవిష్యత్ తరాలకు తీవ్రమైన నష్టం కలుగుతుందని పేర్కొంది. అక్రమ ఇసుక తవ్వకాల వలన భూ గర్భ జాలాలు అడుగంటుతాయని తెలిపిన ఎన్జీటీ.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక తవ్వకాల విషయంలో స్పష్టమైన విధానాలు పాటించాలని సూచించింది.
కాగా ఇసుక దోపిడిని అడ్డుకున్న కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా పిటీషనర్ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు.