వృద్ధురాలిపై పేపర్ బోయ్ హత్యాయత్నం
Published Sat, Dec 17 2016 1:41 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
వైఎస్సార్ జిల్లా: పొద్దున్నే పేపర్ వేయటానికి వచ్చిన ఓ యువకుడు ఒంటరిగా ఉన్న మహిళను దోచుకుని, చంపేందుకు యత్నించాడు. వైఎస్సార్ జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రెండు కుళాయిల వీధిలో ఉండే సుబ్బయ్య ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగి. ఆయన శనివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లగా భార్య సావిత్రమ్మ ఒంటరిగా ఉంది. అదే సమయంలో వచ్చిన పేపర్ బాయ్ డోర్ కాలింగ్ బెల్ కొట్టాడు.
తలుపు తెరిచిన సావిత్రమ్మను బెదిరించి ఇంట్లోకి ప్రవేశించాడు. భయకంపితురాలైన సావిత్రమ్మ గట్టిగా కేకలు వేసింది. అయితే, వెంట తెచ్చుకున్న కత్తితో సావిత్రమ్మను పొడిచి, ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.10వేల నగదును తీసుకున్నాడు. అనంతరం ఆమెను ఓ గదిలో బంధించి చంపుతానంటూ వంట గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను అక్కడికి తీసుకువచ్చాడు.
అయితే, గ్యాస్ లీక్ చేసి నిప్పుపెట్టేందుకు అవసరమైన అగ్గి పెట్టె దొరకలేదు. దీంతో సావిత్రమ్మను గది నుంచి వెలుపలికి తీసుకువచ్చి అగ్గిపెట్టె ఎక్కడుందో వెతకమని బెదిరించాడు. ఈ లోగా చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం గ్రహించిన ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
Advertisement
Advertisement