ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌక
- అరేబియా సముద్ర జలాల్లోని విక్రమాదిత్య యుద్ధనౌకను సందర్శించిన ప్రధానమంత్రి
- అక్కడే త్రివిధ దళాధిపతులతో భేటీ
కొచి: రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా అరేబియా సముద్ర జలాల్లో వినూత్న రీతిలో కీలక సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొచి తీరానికి 40 నాటికన్ మైళ్ల దూరంలో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకలో.. ప్రధాన మంత్రి అధ్యక్షతన త్రివిధ దళాధిపతుల సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఈ సమావేశం కొనసాగుతుంది. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
కొచి తీరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విక్రమాదిత్య వద్దకు చేరుకున్న ప్రధానికి సిబ్బంది ఘనస్వాగతం పలికారు. భారత నౌకాదళం అమ్ములపొదిలోని అతి భారీ యుద్ధనౌక అయిన విక్రమాదిత్యను మోదీ సందర్శించడం ఇది రెండోసారి. గత జూన్ లో ప్రధాని మోదీయే విక్రమాదిత్యను జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత మోదీ కొల్లాం బయలుదేరతారు. అక్కడ కేరళ మాజీ ఆర్ శంకరన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఢిల్లీకి తిరుగుపయనమయ్యేలోగా కేరళ కేబినెట్ తోనూ భేటీ అవుతారని సమాచారం.