సాక్షి నెట్‌వర్క్: పీఆర్‌సీ అమలు కోసం వర్సిటీల బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన బంద్‌తో ఆయా వర్సిటీలు బోసిపోయాయి. వర్సిటీల ప్రవేశ ద్వారాలు, పరిపాలన భవనాల ముందు ఉద్యోగులు, సిబ్బంది బైఠాయించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. పీఆర్‌సీ అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ ధోరణి వీడాలని డిమాండ్ చేశారు.
జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల పరిపాలన విభాగం, యూజీసీ అకడమిక్ స్టాఫ్ కళాశాలలతో పాటు క్యాంపస్‌లోని బ్యాంకులు, క్యాంటీన్‌తో సహా అన్నింటినీ ఉద్యోగులు మూసివేయించారు. గురువారం జరగాల్సిన పరీక్షలను బంద్ కారణంగా అధికారులు వాయిదా వేశారు. ఉద్యోగులు క్యాంపస్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి.. వాహనాలను, విద్యార్థులను, ఉద్యోగులను క్యాంపస్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు, పోలీసు ల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. వీరి ఆందోళనకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్రనాయకుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులు బోధనేతర సిబ్బంది సంఘానికి మద్దతుగా బంద్‌లో పాల్గొన్నారు.
అగ్రికల్చర్ వర్సిటీలో...
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయవర్సిటీల బోధనేతర సిబ్బంది కూడా బంద్ పాటించారు. వర్సిటీలోని అన్ని విభాగాలను మూసివేయించి ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల సొంత రాష్ట్రంలోనూ ఉద్యమాలు చేసే గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. 10వ పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
కేసీఆర్ నిరంకుశ ధోరణి వీడాలి
Published Fri, Jul 17 2015 3:43 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement