సోమవారం ఓయూలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న వర్సిటీ ఉద్యోగులు
సర్వీసు వెయిటేజీ పాతదే.. అదనపు పెన్షన్ యథాతథం
* పీఆర్సీ ఫైళ్లకు సీఎం ఆమోదం
* గ్రాట్యుటీ రూ.12 లక్షలకు పెంపు
* డెత్ రిలీఫ్ అలవెన్స్ రూ.20 వేలు
* అర్ధ వేతన సెలవులకు నగదు సదుపాయం విస్తరణ
* నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సర్వీసు వెయిటేజీ, అదనపు పెన్షన్ చెల్లింపులపై పదో పీఆర్సీ చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.
రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు, డెత్ రిలీఫ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, అర్ధ వేతన సెలవులను నగదుగా మార్చుకునేందుకు అవకాశమివ్వడం తదితర సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు దాదాపు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పలు ఫైళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. సంబంధిత ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో జారీ కానున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి పెన్షన్ పొందేందుకు రిటైర్మెంట్ నాటికి 33 ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి.
కానీ అభ్యర్థుల వయో పరిమితి పెంపు, నోటిఫికేషన్ల జారీలో జాప్యం కారణంగా ప్రభుత్వం గతంలో ఐదేళ్ల సర్వీసు వెయిటేజీ ఇచ్చింది. దాంతో 28 ఏళ్ల సర్వీసు ఉన్న వారికీ పెన్షన్ సదుపాయం ఉంది. అయితే కేంద్ర ఉద్యోగులకు 20 ఏళ్ల సర్వీసు ఉన్నా పెన్షన్ ఇస్తున్న నేపథ్యంలో సర్వీసు వెయిటేజీని ఎనిమిదేళ్లకు పెంచాలని పదో పీఆర్సీ సిఫార్సు చేయగా.. దానిని ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో 30 ఏళ్ల వయసు నిండిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరూ పెన్షన్ సదుపాయం ఉండదు.
ఇక పెన్షనర్లకు వయసు పెరిగేకొద్దీ అదనంగా పెన్షన్ చెల్లించే (అడిషనల్ క్వాంటమ్ పెన్షన్) అంశానికి సర్కారు నో చెప్పింది. ప్రస్తుతం 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు 15 శాతం అదనపు పెన్షన్ ఇచ్చే విధానముంది. వయసు పెరిగే కొద్దీ ఐదేళ్లకోసారి ఐదు శాతం చొప్పున పెరుగుతుంది. ఈ అదనపు పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచే అందించాలని పదో పీఆర్సీ సూచించినా.. హేతుబద్ధత లేదంటూ ఆర్థిక శాఖ పేర్కొనడంతో సీఎం ఆ ఫైలును వెనక్కి పంపారు. ఇక మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పాటు ఇచ్చే చైల్డ్ కేర్ లీవ్ సిఫార్సుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కొన్నింటికీ మోక్షం
రిటైరయ్యే ఉద్యోగులకు చెల్లిస్తున్న రూ.8లక్షల గ్రాట్యుటీని రూ.12లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగులు మరణిస్తే అందించే అంత్యక్రియల ఖర్చు (డెత్ రిలీఫ్ అలవెన్స్)ను పీఆర్సీ సిఫార్సు మేరకు రూ.10 వేల నుంచి రూ.20వేలకు పెంచింది. అయితే వారి కుటుంబీకులు మరణించినప్పుడు కూడా ఈ అలవెన్స్ ఇవ్వాలన్న సూచనను తోసిపుచ్చింది. ఇక పదవీ విరమణ చేసిన వారికి 300 రోజులకు మించకుండా అర్ధవేతన సెలవులను (హెచ్‌పీఎల్) నగదుగా మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
పెన్షనర్లకు వైద్య ఖర్చుల కింద చెల్లిస్తున్న సొమ్మును రూ.350కు పెంచేందుకు ఆమోదం తెలిపింది. కాగా యూనివర్సిటీలకు పదో పీఆర్సీని వర్తింపజేసేందుకు సీఎం కేసీఆర్ ఆమోదించడంపై ఎన్జీవోస్ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉస్మానియా వర్సిటీలో సంబరాలు జరుపుకొన్నారు. స్వీట్లు పంచుకొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
బకాయిలపై తేల్చండి..
పీఆర్సీ బకాయిలను నగదు రూపం లో చెల్లించే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి కోరారు. గ్రాట్యుటీ రూ.12లక్షలకు పెంపు, డీఏ మంజూరు తదితర అంశాలపై నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. బకాయిల కోసం ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.